ETV Bharat / state

కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పెద్దపట్నం.. తరలివచ్చిన భక్తులు

author img

By

Published : Feb 19, 2023, 8:13 AM IST

komuravelli mallanna pedda patnam: కొమురవెల్లి మల్లన్న శరణు శరణు అంటూ వేలాది మంది భక్తులు పారవశ్యంలో.. మహాశివరాత్రి పర్వదినాన పెద్దపట్నం కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. మంత్రముగ్ధులై భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ మహోత్సవాన్ని వీక్షించారు.

Shivratri celebrations in the presence of Komaravelli Mallanna
కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాలు

komuravelli mallanna pedda patnam : భక్తుల కొంగు బంగారం కోరమీసాల కొమురవెల్లి మల్లన్న పెద్దపట్నం కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, శివసత్తులు పెద్దపట్నం తొక్కేందుకు పోటీపడ్డారు. కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టం పెద్దపట్నంతో ముగిసింది.

Shivratri celebrations at komuravelli mallanna temple : మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో పండితులు, అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా రాజగోపురం నుంచి రాతిగీరాల రథం దగ్గరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు.

పెద్దపట్నం వేటితో వేస్తారు: ఆలయంలో అర్చన, కల్యాణ మండపం దగ్గర ఒగ్గు పూజారుల పట్నం ఒకేసారి కొనసాగాయి. కోనేరులోని గంగనీరు తీసుకువచ్చి భక్తులు మల్లన్నకు పూజలు చేశారు. మల్లన్నను స్తుతిస్తూ స్వామి వారి చరిత్రను ఒగ్గు కథ రూపంలో చెప్పారు. కుంకుమ, బియ్యం పిండి, తంగేడు ఆకులతో తయారుచేసిన ఆకుపచ్చ పొడి, గులాబీ చూర్ణం పొడి, పంచరంగులను పెద్ద పట్నం వేయడానికి వినియోగించారు. మూడు గంటలకు పైగా ఒగ్గు కళాకారులు పెద్దపట్నాన్ని వేశారు. పట్నం వేయడం పూర్తికాగానే ముందుగా పట్నంలోకి బోనాన్ని తర్వాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి పూజలు నిర్వహించారు.

భక్తుల ఉత్సాహాం: ముందుగా స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో అర్చకులు ఒగ్గు పూజారులు పెద్దపట్నం దాటారు. పూనకాలతో ఊగిపోతూ మల్లన్న నామస్మరణ చేస్తున్న భక్తులు పట్నం పైకి దూసుకు వచ్చారు. చిందులు వేస్తూ శివతాండవం చేశారు. మరికొందరు భారీ కేడ్లు దూకి వచ్చారు. పంచరంగుల చూర్ణాన్ని తీసుకెళ్లేందుకు భక్తులు పోటీపడ్డారు. క్రమ పద్ధతిగా పటంలోకి భక్తులను పంపిస్తూ పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్దిపేట జిల్లా అదనపు సీపీ మహేందర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మూడు నెలలు పాటు బ్రహ్మోత్సవాలు: ఉగాది వరకు కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంటుంది. మూడు నెలల పాటు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.