ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. మూడో రోజు వనమహోత్సవాలు

author img

By

Published : Aug 10, 2022, 9:27 PM IST

Independence Day celebrations
మూడో రోజు వనమహోత్సవాలు

Flag celebrations in TS: తెల్లదొరల మెడలు వంచి.. బానిస సంకెళ్లను తెంచి.. భరతమాతకు విముక్తి కల్పించిన మహనీయుల వీరగాధలను గుర్తు చేసుకుంటూ 75ఏళ్ల స్వరాజ్య స్ఫూర్తిని చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు సాగుతున్నాయి. 15రోజుల పాటు ఘనంగా జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన వన మహోత్సవాలు అంబరాన్నంటాయి.

Flag celebrations in TS: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలపాటు తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ నెల 8న ప్రారంభమైన ఈ వజ్రోత్సవాల్లో భాగంగా మూడోరోజు రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవాన్ని నిర్వహించారు. దేశభక్తిని చాటిచెప్పేలా.... విద్యార్థులు, యువతతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఫ్రీడమ్‌ పార్క్‌లో వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేశవరావు, మంత్రి తలసాని, జీహెచ్​ఎంసీ మేయర్‌ విజయలక్ష్మీ మొక్కలు నాటి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు.

దోమలగూడలోని భారత స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ మోడల్ హైస్కూల్‌లో నిర్వహించిన వనమహోత్సవ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కూకట్‌పల్లి జోనల్‌ ఆఫీస్‌ వద్ద మొక్కలు నాటిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనసభ్యసిస్తున్న 11వేల మంది విద్యార్థులకు పుస్తకాల కిట్‌లను పంపిణీ చేశారు. మాదాపుర్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గాంధీ చిత్ర ప్రదర్శనకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. నార్సింగిలోని నూతన ఠాణాలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీస్‌ అధికారులతో కలిసి మొక్కలు నాటి తిరంగా జెండాల బెలూన్లను చిన్నారులతో కలిసి గాల్లోకి ఎగురవేశారు.

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం ఆరెగూడెంలో ఏర్పాటు చేసిన ఫ్రీడమ్‌ పార్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. మహబూబాబాద్‌లో విద్యార్థులతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్‌ గాంధీ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం, గాంధీ పార్క్‌లో మొక్కలు నాటిన ఆమె... ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుతో పాటు అధికారులు మొక్కలు నాటారు. సిద్దిపేట శివారులోని రంగనాయకసాగర్‌లో ఫ్రీడమ్‌ పార్కును మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 ఏళ్ల స్వతంత్ర వేడుకల నిర్వహణలో కేంద్రం విఫలమైందన్న ఆయన.... కాగితపు జెండాలతో వేడుకలు జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం అవమానకరంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. మూడో రోజు వనమహోత్సవాలు

వజ్రోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ప్రయాణీకుల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్దపల్లి వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు , మాజీ మంత్రి కేశవులు ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బస్టాండ్‌లో అధికారులు, ప్రయాణికులతో కలిసి జెండా వందనం చేశారు. కరీంనగర్‌లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌ విద్యార్థులతో కలిసి గాంధీ చిత్రాన్ని వీక్షించారు. అంతకుముందు హౌజింగ్‌ బోర్డు కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు..

ఆదిలాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్రీడం పార్క్‌ను ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మంచిర్యాలలోని ఫ్రీడం పార్క్‌లో కలెక్టర్‌ భారతి హోలికేరి మొక్కలు నాటారు. ఖమ్మంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో భారీ జాతీయజెండాను ప్రదర్శించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ శ్రీనివాసరావు విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని రాజపేట నెమిల గ్రామంలో 75 అనే సంఖ్యను సూచించే విధంగా నాటిన ఈత మొక్కలు ఆకట్టుకున్నాయి. చిత్రాన్ని వీక్షించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మొక్కలు నాటడంలో భాగస్వాములైన వారిని అభినందించారు.

ఇవీ చదవండి: EAMCET Results 2022: ఎల్లుండి ఎంసెట్​ ఫలితాల విడుదల..!

నుపుర్​ శర్మకు ఊరట.. ఎఫ్ఐఆర్​లన్నీ దిల్లీకి బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.