ETV Bharat / state

'పోషకాలున్న బియ్యమే తీసుకుంటాం'.. ధాన్యం సేకరణపై ఎఫ్​సీఐ క్లారిటీ

author img

By

Published : Feb 18, 2022, 8:21 AM IST

FCI On Rabi Paddy Procurement : యాసంగి సీజన్​లో పోషకాలు మిళితం చేసిన ఉప్పుడు బియ్యమే తీసుకుంటామని రాష్ట్రానికి ఎఫ్​సీఐ స్పష్టం చేసింది. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి రోజువారీగా 50 శాతం సాధారణ ఉప్పుడు బియ్యం, 50 శాతం బలవర్ధక ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది.

rabi season, fci
తెలంగాణలో యాసంగి ధాన్యం

FCI On Rabi Paddy Procurement : యాసంగి కోటాలో మిగిలిన బియ్యంలో సగం.. పోషకాలు మిళితం చేసిన బలవర్ధక ఉప్పుడు బియ్యం (ఫోర్టిఫైడ్‌ బాయిల్డు రైస్‌) రూపంలోనే ఇవ్వాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ).. రాష్ట్రానికి స్పష్టం చేసింది. గత యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడీవేడీ చర్చలు జరిగిన విషయం తెలిసింది. రాష్ట్రం నుంచి 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని, మిగిలిన మొత్తం సాధారణ బియ్యం రూపంలో ఇవ్వాలని కేంద్రం కోరింది.

FCI Clarifies about Paddy Purchase : రాష్ట్రంలో యాసంగిలో పండే ధాన్యాన్ని సింహభాగం ఉప్పుడు బియ్యంగానే మారుస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుపట్టడంతో మరో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి ఎఫ్‌సీఐకి 44.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యానికి గాను ఇంకా 5.65 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉంది. అందులో పోషకాలు మిళితం చేసిన బియ్యం 50 శాతం ఇవ్వాలని ఎఫ్‌సీఐ 3-4 నెలల నుంచి రాష్ట్రానికి లేఖలు రాస్తోంది. మిల్లర్ల నుంచి పెద్దగా స్పందన లేకపోవటంతో వచ్చే వారం నుంచి రోజువారీగా 50 శాతం సాధారణ ఉప్పుడు బియ్యం, 50 శాతం బలవర్ధక ఉప్పుడు బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని తేల్చి చెప్పింది. పలు రాష్ట్రాల్లో రేషన్‌కార్డుదారులకు బలవర్ధక బియ్యం ఇవ్వాల్సి ఉన్న దృష్ట్యా వాటినే ఇవ్వాలని రాష్ట్రానికి రాసిన లేఖలో ఎఫ్‌సీఐ పేర్కొంది.

2024 నుంచి దేశవ్యాప్తంగా..

FCI About Paddy Purchase in Telangana : పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు 2024 నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తిగా బలవర్ధక బియ్యమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సహా ప్రయోగాత్మకంగా 15 రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తోంది.

బలవర్ధక బియ్యం అంటే..

FCI About Rabi Paddy Purchase : ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-ఎ, జింక్‌, ఇతర బి-కాంప్లెక్స్‌ విటమిన్లను గుళికలు లేదా పలుచటి ముక్కలు(ఫ్లేక్స్‌)గా రూపొందించి ప్రతి వంద కిలోల బియ్యంలో ఒక కిలో కలపాలి. తద్వారా ఆ బియ్యం పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారంగా మారుతుందని కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల్లో పేర్కొంది. బలవర్ధక బియ్యంగా మార్చడానికి క్వింటాకు అదనంగా 50 పైసలు మాత్రమే ఖర్చవుతుందని సమాచారం.

ఇదీ చదవండి : పంటల సాగులో భారీగా పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.