ETV Bharat / state

పిల్లల కలల్ని నిజం చేసిన ఓ తండ్రి కథ.. రామోజీ ఫిలింసిటీ డ్రైవర్ సక్సెస్‌ స్టోరీ

author img

By

Published : Jun 29, 2022, 3:31 PM IST

Updated : Jun 29, 2022, 4:33 PM IST

cab driver success story: మనం ఎలా ఉన్నా... మన పిల్లలు బాగుండాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. పిల్లలకు తెలియకుండా వారిని పెంచుతారు. తమ రెక్కల కష్టంతో కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. బిడ్డలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు కృషి చేస్తారు. ఇలానే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. డ్రైవర్‌గా పనిచేస్తూ... తన నలుగురి పిల్లలకు బంగారు భవిష్యత్తునిచ్చారు. వాళ్ల కుటుంబంపై ప్రత్యేక కథనం.

cab driver success story
రామోజీ ఫిలింసిటీ డ్రైవర్ సక్సెస్‌ స్టోరీ

పిల్లల కలల్ని నిజం చేసిన ఓ తండ్రి కథ/ రామోజీ ఫిలింసిటీ డ్రైవర్ సక్సెస్‌ స్టోరీ

cab driver success story: రంగారెడ్డి జిల్లా గుడితండా అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్కునాయక్‌, లక్ష్మీబాయిలు దంపతులు. 30 ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం.. నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లోని బంజారాకాలనీకి వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. లక్కునాయక్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ... తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తూ వచ్చారు. లక్ష్మీబాయి కుట్టు మిషన్ పనిచేస్తూ.. ఇంట్లో ఖర్చులను వెళ్లదీస్తూ చేదోడువాదోడుగా నిలిచేది.

లక్కునాయక్, లక్ష్మీబాయి ఒక పూట పస్తులు ఉండైనా.. పిల్లలకు మాత్రం పెట్టేవారు. తమ పిల్లలను ఎలాగైనా పెద్ద పెద్ద చదువులు చదివించి.. ప్రయోజకులను చేయాలని తపనతో.. ఎంతో కష్టపడుతూ.. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చదివించారు. తర్వాత లక్కు నాయక్ రామోజీ ఫిలిం సిటీలో డ్రైవర్‌గా చేరి ఏడు సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

మేం పల్లెటూరి నుంచి వచ్చాం.. నాకు చదవాలనే కోరిక ఉండేది. కాకపోతే.. ఆర్థిక స్తోమత లేకుండే. అందుకే మా పిల్లలను చదివించాలనుకున్నాం.. రాత్రింబవళ్లు ఆటో, క్యాబ్ నడుపుతూ... వాళ్లను చదివించాం. వారానికి ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా పనిచేశాం. మా భార్య కూడా కుట్టుమిషన్ నేర్చుకుని పనిచేస్తోంది. ఎస్‌ఎస్‌సీలో మంచి మార్కులు సంపాదిస్తే కంప్యూటర్ ఇప్పిస్తా... నీట్‌లో ఎంబీబీఎస్ సీట్ కొడితే ఫొన్ ఇప్పిస్తా.. అంటూ తనని ప్రోత్సహించాను. అప్పటి వరకు మా పిల్లలకు ఫోన్ కూడా లేదు. ఇంటర్‌ తర్వాతే వాళ్లకు మొబైల్‌ ఇప్పించాను. నాకు చదువు విలువ తెలుసు.. అందుకే వారికి ఆ చదువును అందించాం. - లక్కు నాయక్, క్యాబ్ డ్రైవర్

పిల్లల గురించి.. చాలా కష్టపడ్డాం. కూలీ పనులు చేసి మరి.. నలుగురి పిల్లలను బాగా చదివించాను. మూడు రోజులు ఉపాసం ఉండి.. కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాం. వాళ్లు కూడా మంచిగా సెటిల్ అయ్యారు. అదే సంతోషం. - లక్ష్మీబాయి, లక్కునాయక్ భార్య

2016లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఇంటర్‌ నాగోల్‌లో చదువుకున్నాను. మా నాన్న డ్రైవర్‌గా రామోజీ ఫిలిం సిటీలో చేశారు. మా నాన్న కష్టపడి చదివించారు. ఇప్పుడు పీజీకి ప్రిపెర్ అవుతున్నా... చాలా హ్యాపీగా ఉన్నాం. - విద్యాసాగర్, లక్కు నాయక్ పెద్ద కుమారుడు

పెద్దమ్మాయి రోజా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించగా.. పెద్ద కుమారుడు విద్యాసాగర్ నాయక్‌ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రెండో అమ్మాయి పూజ బీటెక్ పూర్తి చేసి.. ఐటీ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. చిన్నబ్బాయి రాహుల్ నాయక్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

తాను పడ్డ కష్టాలను తమ పిల్లలు పడొద్దని.. ఎంత కష్టమైనా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎదుర్కొని తమ పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ఆటోడ్రైవర్‌గా, క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేశానని లక్కునాయక్ అన్నారు. పిల్లలకు మంచి చదువును అందించానని, తాను పడ్డ కష్టానికి ఒక్కొక్కరు సెటిల్ అవుతుండటం వల్ల చాలా గర్వగం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సూరజ్‌నగర్‌లో సొంతంగా ఇల్లు నిర్మించుకుని ఉంటున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 29, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.