ETV Bharat / state

గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది: రేవంత్​రెడ్డి

author img

By

Published : Mar 5, 2023, 10:47 PM IST

Revanthreddy Comments At Vemulawada Meeting: రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా రూ. 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని మాట తప్పారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడని మండిపడ్డారు. వేలకోట్లు ఉన్న కేసీఆర్​ కుటుంబం.. ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ తీసుకుని పేదల పొట్ట కొడతారా అని ప్రశ్నించారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని విమర్శలు గుప్పించాారు.

Revanthreddy
Revanthreddy

Revanthreddy Comments At Vemulawada Meeting: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి చేపట్టిన 'హాథ్​ సే హాథ్ జోడో యాత్ర' ఉత్సాహంగా కొనసాగుతోంది. వేములవాడ నియాజకవర్గంలో 21వ రోజు విజయవంతంగా సాగింది. సంకెపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర అనుపురం, నాంపల్లి, చింతల్ తానా మీదుగా వేములవాడ పట్టణానికి చేరుకుంది. రేవంత్ వెనుక కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తూ పాదయాత్రలో పుల్​ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలో వేములవాడలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్​ మీటింగ్​లో తనదైన శైలిలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం, కేసీఆర్​పై విమర్శనాస్త్రాలు సంధించారు.

రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ ప్రతీ ఏటా రూ. 100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తానని మాట తప్పారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. తాగు నీటి సమస్యను కూడా తీర్చలేకపోయాడని మండిపడ్డారు. 2018లో చెన్నమనేని రమేష్ ఓడిపోతాడనే భయంతో సూరమ్మ ప్రాజెక్ట్​కు హడావుడిగా శిలాఫలకం వేశారన్న రేవంత్​రెడ్డి... 43 వేల100 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ఈ ప్రాంతంపై ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన వివక్షనే.. కేసీఆర్ పాలనలోనూ కొనసాగుతోందని విమర్శించారు.

'40ఏళ్ల కింద ఇక్కడే తనకు పెళ్లి జరిగిందని... ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిండు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ.. వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగే ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇక్కడి ఎమ్మెల్యేను కలవాలంటే జర్మనీకి పోవాల్సిన ఖర్మ పట్టింది. ఈ ప్రజలపై స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్​కు ప్రేమ లేదు.. అందుకే ఇక్కడి పౌరసత్వం వదులుకున్నారు. ప్రజలతో బంధం తెంచుకున్నారు.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

వేములవాడ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే.. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్​రెడ్డి అన్నారు. మిడ్ మానేరు బాధితులుగా కేసీఆర్ కుటుంబం ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ తీసుకున్నారన్న రేవంత్​.. పెళ్లైన గిరిజన ఆడ బిడ్డలకు మాత్రం ఇవ్వనంటున్నారని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఒక న్యాయం... గిరిజన బిడ్డలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కేసీఆర్​కు కొంచెమైనా బాధ్యత ఉందా అని నిలదీశారు. వేలకోట్లు ఉన్న తమ కుటుంబం.. ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ తీసుకుని పేదల పొట్ట కొడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్​కు రెండుసార్లు అవకాశం ఇస్తే.. ఇచ్చిన కాంగ్రెస్​కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్నారు.

'కాంగ్రెస్ అధికారంలోకి రాగాానే ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5లక్షలు సాయం అందిస్తాం. ఇప్పుడున్న రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ప్రతీ పేద రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం. తాము అధికారంలోకి రాగానే ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతీ పేద ఆడబిడ్డకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఆదుకుంటాం.'-రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

అంతకుముందు రుద్రారంలో సంచార జాతులకు చెందిన వారిని కలిసిన రేవంత్​.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పొట్టకూటి కోసం ఊరూరా తిరిగే వారి కష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని సంచార జాతుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సంచార జాతుల కుటుంబాలకు రేవంత్​రెడ్డి కొంత ఆర్థిక సాయం అందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.