ETV Bharat / state

జెండా ఏదైనా తన ఎజెండా మాత్రం బీఆర్​ఎస్​ను గద్దె దించడమే: పొంగులేటి

author img

By

Published : Mar 5, 2023, 5:37 PM IST

Ponguleti Srinivas Reddy Fire On BRS: ఆరు దశాబ్దాలుగా పోరాడి సంపాదించుకున్న రాష్ట్రం.. ఇప్పుడు సీఎం కేసీఆర్​ వల్ల దగాపడుతోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు. ఏ జెండా పట్టుకున్నా తన ఎజెండా మాత్రం బీఆర్​ఎస్​ ఓటమేనని అభిమానులకు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Ponguleti Srinivas Reddy
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Paleru: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ.. ఖమ్మం జిల్లాలోని ప్రజా ప్రతినిధుల ఓటమే లక్ష్యంగా పని చేయాలని.. ఏ జెండా పట్టుకున్నా తన ఎజెండా ఇదేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి అభిమానులకు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఆరు దశాబ్దాలు అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు ఈ ప్రభుత్వం వల్ల దగాపడ్డారని పేర్కొన్నారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన రాష్ట్రాన్ని బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ. ఐదు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి తీసుకెళ్లి నట్టేటా ముంచిందని తీవ్ర విమర్శలు చేశారు. నియామకాల కోసం పోరాడి సంపాదించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో.. ఇప్పుడు ఉద్యోగాలు లేక యువత దగాపడిందని ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఎంతో ఇబ్బంది పడ్డామని... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీళ్లు కోసం నిధులు కోసం ఇంకా పోరాటాలు చేస్తూనే ఉన్నామని పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత.. జీవితాలు మారిపోతాయని కలలు కన్న ప్రజలకు.. చివరికు ఈ ప్రభుత్వం వల్ల కలలే మిగిలాయని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు ఆ పనే చేయలేదని తెలిపారు. దళిత బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలోని 100 మందికి ఇచ్చి.. చేతులు దులుపుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.

Ponguleti Srinivas Reddy Fire On KCR: ఇప్పుడు గిరిజన బంధు ఇస్తానని మాయ మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నిక ముందు ఇలానే హామీలు ఇచ్చి.. గెలిచిన తర్వాత చేటలో తవుడు పోసి కుక్కలను ఉసిగొల్పినట్లుగా చేస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానని ఎన్నికల్లో చెప్పిన సీఎం కేసీఆర్​.. ఇప్పుడు ఇక్కడ ఎకరానికైనా నీళ్లు ఇచ్చారని ప్రశ్నించారు.

ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​ కొట్టుకుపోవడం ఖాయమని వెల్లడించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని.. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించిన ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుందని స్పష్టం చేశారు. జెండా ఏదైనా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ప్రధాన ధ్యేయమని పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రకటించారు.

"మైక్​ తీసుకుంటే ప్రజలను మభ్యపెట్టడంలో ఈ ముఖ్యమంత్రి దిట్ట. మాటలకే పరిమితం తప్ప.. చేతలు అనేవి ఈ సీఎంలో లేవు. తెలంగాణ బిడ్డలను ముఖ్యమంత్రి కేసీఆర్​ అసత్యలతో భ్రష్టు పట్టిస్తున్నారని నగ్న సత్యం. నా నియోజకవర్గ ప్రజలను ఈ ప్రభుత్వ నాయకులు అనేక ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అధికారం అనేది శాశ్వతం కాదు.. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులు అందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతూ.. ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల ఓటమే లక్ష్యంగా పనిచేయాలి. జెండా ఏదైనా ఇదే మన అజెండా." - పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి , మాజీ ఎంపీ

జెండా ఏదైనా తన ఎజెండా మాత్రం బీఆర్​ఎస్​ను గద్దె దించడమే: పొంగులేటి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.