ETV Bharat / state

కాళేశ్వరం నిర్వాసితులకు కన్నీరే మిగిలింది: శ్రీధర్​బాబు

author img

By

Published : Jan 23, 2021, 5:39 PM IST

manthani mla , kaleshwaram project
మంథని ఎమ్మెల్యే, కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మంథని ఎమ్మెల్యే శ్రీధర్​ బాబు డిమాండ్ చేశారు. భూములు ఇచ్చి నేటికి మూడేళ్లు పూర్తయినా ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదంటూ రైతులు.. ఎమ్మెల్యేను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు ఇచ్చి నేటికి మూడేళ్లు పూర్తయినా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ముంపు గ్రామాల రైతులు.. పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబును కలిసి విన్నవించుకున్నారు. గత వారం రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతూ, రోడ్లపై నిరసనలు తెలియజేసినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో ఆయనను బాధితులు కలిశారు. అనంతరం 'ఈటీవీ భారత్​'తో ఎమ్మెల్యే.. బాధితుల సమస్యలపై మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా సీఎం కేసీఆర్​.. మంథని వచ్చిన ప్రతిసారీ ముంపునకు గురై నష్టపోతున్న రైతుల సమస్యలను వినతి పత్రాల ద్వారా తెలియజేశామని శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ నిర్మించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని.. నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలో 3 బ్యారేజ్​లను నిర్మించడం వల్ల అనేక మంది రైతుల పంట పొలాలు నీటిలో మునిగిపోయి నష్టపోతున్నారని వివరించారు.

అర్హులకు ప్రయోజనాలు లేవు

సాంకేతికపరంగా సరైన అధ్యయనం చేయకుండా ప్రాజెక్టును రూపకల్పన చేయడం ద్వారా అనేక మంది రైతుల పొలాలు, భూములు మూడేళ్లుగా నీటిలో మునిగిపోయి కష్టాలు పడుతున్నారని తెలిపారు. మహదేవ్​పూర్, సూరారం, బెగ్లూర్, బ్రాహ్మణపల్లి, కుదురుపల్లి, ఆరెంద, వెంకటాపూర్, ఖాన్సాయిపేట గ్రామాల రైతుల భూములు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. గోదావరి నీటిని, ఇసుకను రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు తరలించి, ఇక్కడి సంపాదన కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇక్కడి సంపద ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లినా, నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు, ప్రజలకు మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదని విమర్శించారు.

ఇప్పటికైనా స్పందించండి

దామరకుంట, సుందిళ్ల వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని గ్రామాలకు నీరు అందించిన తర్వాత నీటిని వేరే ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రికి.. అసెంబ్లీలో ఎన్నోసార్లు అభ్యర్థించినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గంలో నత్తనడకన కొనసాగుతున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు. డీపీఆర్​ను సిద్ధం చేసి మంథని ప్రాంతానికి మొదటగా నీరు ఇవ్వాలని సూచించారు. రానున్న బడ్జెట్​లో నిధులు విడుదల చేసి పనులు సకాలంలో ప్రారంభించి నీటిని అందించాలని సీఎంను కోరారు. సాంకేతిక లోపాలను సరిచేసి నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ముంపునకు గురైన భూములు, పొలాలను గుర్తించి వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు. రెండు సంవత్సరాల పంట నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు.

సాంకేతిక పరమైన సమస్యలు గుర్తించి రైతులకు న్యాయం చేయాలి

ఇదీ చదవండి: మద్దతు ధర ఇప్పిస్తారా..? రాజీనామా చేస్తారా..?: పసుపు రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.