ETV Bharat / state

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రక్షాళన షురూ

author img

By

Published : Apr 22, 2023, 5:43 PM IST

Telangana University
Telangana University

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రక్షాళన ప్రారంభమైంది. అక్రమ నియామకాలు, నిధుల ఖర్చులో అవినీతి, ఇష్టారాజ్యంగా మారిన పాలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉపకులపతి తీసుకున్న నిర్ణయాలతో విభేదించిన పాలక మండలి.. పాలనా పరమైన వ్యవహారాల పర్యవేక్షణకు తొలిసారిగా ఉపసంఘాన్ని నియమించింది. అలాగే ఉపకులపతి రవీందర్‌ గుప్త హయాంలో జరిగిన నిర్ణయాలపై విచారణకు ఆదేశించింది.

Telangana University: తెలంగాణ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉన్నత స్థాయికి అందిన ఫిర్యాదులపై సర్కార్‌ చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించకుండా నియామకాలు, పదోన్నతుల తీరుపై ఆరోపణలు రావటమే కాకుండా, ఏడాదిన్నర కాలంగా పాలకమండలి భేటీ లేకపోవటం, బడ్జెట్‌ ఆమోదం లేకుండానే భారీ వ్యయాలు చేశారంటూ విమర్శలు వచ్చాయి. కొంతకాలంగా జరిపిన వివిధ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ఈసీ సభ్యులు, విద్యార్ధి సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల పర్యవసానంగా, ఇటీవల హైదరాబాద్‌ జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి భేటీలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రార్‌ను మార్చటమే కాకుండా, ఉపకులపతి నిర్ణయాలతో పూర్తిగా విభేదించారు.

నామమాత్రంగానే వీసీ నిర్ణయాలు: పాలనాపరమైన వ్యవహారాల పర్యవేక్షణకు ఉన్నతాధికారులు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో పాటు ఈసీ సభ్యులుగా ఉన్న రవీందర్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఆరతి, రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య యాదగిరి కలిసి బృందంగా పనిచేయాల్సి ఉంది. పాలనను గాడిలో పెట్టే చర్యల్లో భాగంగా ఈ ఉపసంఘం పాలనలో అవసరమైన నిర్ణయాలు తీసుకుని, వారానికోసారి పాలకమండలి ఎదుట ఉంచాలనేది ఆలోచనగా చెబుతున్నారు. ఇదే జరిగితే ఉపకులపతిగా ఉన్న రవీందర్ నిర్ణయాధికారాలు నామమాత్రం కావటమే కాకుండా ఆయన అధికారాలకు కత్తెర వేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పాలకమండలి సరైన నిర్ణయమేనా: ఉపకులపతి ప్రమేయం లేకుండా పాలన, ఆయన అధికారాలను తగ్గించటం సాధ్యమయ్యే నిర్ణయాలేనా అనే చర్చ సైతం మొదలైంది. ఇప్పటి వరకు వీసీ తనకున్న విశిష్ట అధికారాలతో పరిపాలన పదవులు కేటాయించటం, వర్సిటికి కావాల్సిన వస్తువులు కొనుగోళ్లు చేశారు. ఇప్పుడు ఆయా విషయాలకు దూరంగా ఉంచేలా పాలకమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయాలతో ఈసీ సమావేశం నుంచి అగ్రహంతో బయటకు వెళ్లిపోయిన ఉపకులపతి. రానున్న రోజుల్లో ఎలాంటి వైఖరితో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక పాలకమండలి హవా: ఇకపై పాలకమండలి విశిష్ట అధికారాలు కలిగి ఉంటుందని సీనియర్ ఆచార్యులు చెబుతున్నారు. అన్నింటికి ఆమోదం తెలపటానికే కాదు, కొన్నింటికి కత్తెర వేయటానికీ అధికారాలు ఉంటాయని, వాటిని వినియోగించే నిర్ణయాలు తీసుకున్నారని భావిస్తున్నట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి అభిప్రాయపడుతున్నారు. విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట పడి గౌరవాన్ని పెంచేలా పాలన సాగాలని ఆశిస్తున్నారు. కాగా, ఈ నెల 26న హైదరాబాద్​లో నిర్వహించనున్న పాలకమండలి భేటీ నాటికి ఆయా విషయాల పై రిజిస్ట్రార్ ద్వారా నివేదికలు తెప్పించుకొని కార్యాచరణ అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని అంశాల్లో నిబంధనలు అతిక్రమించి ఖర్చులు చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రక్షాళన మొదలు...నిజాలు బయట పడేనాాా....?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.