ETV Bharat / bharat

కోడిగుడ్డు ఇవ్వలేదని బిర్యానీ సెంటర్​ ఓనర్​ కిడ్నాప్​.. రంగంలోకి పోలీసులు.. ఆఖరికి..

author img

By

Published : Apr 22, 2023, 4:01 PM IST

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. కోడి గుడ్డు అప్పుగా ఇవ్వలేదని ఓ బిర్యానీ సెంటర్ యజమానిని కిడ్నాప్​ చేశారు కొందరు దుండగులు. అనంతరం అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.

man kidnapped for eggs in bilaspur  Chhattisgarh
man kidnapped for eggs in bilaspur Chhattisgarh

కోడి గుడ్డు అప్పుగా ఇవ్వలేదని బిర్యానీ సెంటర్​ నిర్వాహకుడిని కిడ్నాప్​ చేశారు కొందరు దండగులు. అనంతరం అతడిపై దుర్భాషలాడి.. దాడి చేశారు. కిడ్నాప్​పై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్​పుర్​ జిల్లా బిల్హా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్​ వర్మ అనే వ్యక్తి.. అదే గ్రామంలో బిర్యానీ సెంటర్​ నడుపుతున్నాడు. ఏప్రిల్​ 20న అతడి బిర్యానీ షాప్​నకు కొహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్‌ వచ్చారు. అనంతరం కోడిగుడ్లు అప్పుగా అడిగారు. అప్పు ఇవ్వడం కుదరదు అని దుకాణదారుడు యోగేశ్​ నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తులైన నిందితులు.. అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు అతడిని కిడ్నాప్​ చేశారు. తమ కారులో ఎక్కించుకుని.. ఓ నది ఒడ్డున ఉన్న ముక్తిధామ్​ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడిపై దుర్భాషలాడి.. తీవ్రంగా దాడి చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కొన్ని గంటల్లోనే ఛేదించి.. బాధితుడిని సురక్షితంగా కాపాడారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వాహనాన్ని సీజ్​ చేశారు.

చికెన్​, కల్లు అప్పు ఇవ్వలేదని దాడి..
ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు.. చికెన్​ అప్పు ఇవ్వలేదని కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి దుకాణ యజమానిపై దాడి చేశాడు. ఘటన తెలంగాణలోని​ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం బస్తేపూర్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన దర్సోజీ చికెన్ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి దుకాణం మూసివేసిన తరువాత చికెన్ అప్పు ఇవ్వాలని కోరాడు. దీనికి దర్సోజీ నిరాకరించాడు. కోపగించుకున్న అనిల్‌ అక్కడే ఉన్న కత్తితో చికెన్​ సెంటర్​ ఓనర్​పై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన యజమాని.. ఆస్పత్రిలో చికిత్స పొందాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన అనిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కల్లు అప్పు ఇవ్వనందుకు ఓ వ్యక్తి ముగ్గురిపై కత్తితో దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్​లో జరిగింది. గ్రామానికి చెందిన దాసు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న కల్లు దుకాణానికి వెళ్లి.. కల్లు అప్పు అడిగాడు. దీనికి దుకాణ యజమానులు నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. కత్తితో ముగ్గురిపై దాడి చేశాడు. గాయపడిన రవి, జోగయ్య, రాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.