ETV Bharat / state

ప్రమాదాలకు అడ్డాగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి

author img

By

Published : Jul 8, 2022, 12:10 PM IST

Road accidents
Road accidents

ACCIDENTS ON NH 65: జీవన ప్రయాణం సహజంగా ముగిస్తేనే ఆ జీవితానికి సార్థకత. కానీ... నేటి రోజుల్లో సహజ మరణాల కంటే... అర్ధాంతంగా తనువు చాలిస్తున్న ఘటనలే అధికంగా ఉండగా... ఇందులోనూ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఓ చోట మనుషులను బలితీసుకుంటునే ఉన్నాయి. రెప్పపాటులో చేసే పొరపాటు, ఏం జరుగుతుందిలే అన్న నిర్లక్ష్యం.. తమనే కాదు ఒక్కోసారి అన్యం పుణ్యం ఎరగని అమాయకులను సైతం పొట్టనబెట్టుకుంటుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై నిర్లక్ష్య ధోరణులు నిత్యం జరుపుగుతున్న ప్రమాదాలను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

ACCIDENTS ON NH 65: తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉంటూ... నిత్యం అత్యంత రద్దీగా ఉండే రహదారుల్లో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిని ప్రధానంగా చెప్పవచ్చు. ఈ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రజలు చనిపోవటం సర్వసాధారణంగా మారింది. అతివేగం, రోడ్డు విస్తరణలాంటి కారణాలెన్నీ ఉన్నా... రోడ్డుపక్కన అడ్డగోలుగా పార్కింగ్‌ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. జాతీయ నేర గణాంక విభాగం-ఎన్​సీఆర్​బీ ప్రకారం ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టి... ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఈ రహదారిపై సగటున రోజుకు ఇద్దరు ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

ఎన్​హెచ్​-65తో పాటూ... హైదరాబాద్‌ - వరంగల్‌ రహదారిలోనూ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఇటీవల ఆలేరు పట్టణ శివారులో రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఒక్క హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి పైనే 172 ప్రమాదాలు జరగ్గా.. 84 మంది వాహనదారులు మృత్యువాత పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. లారీలను ఇష్టానుసారంగా రహదారి పక్కనే నిలుపుతుండటం వీటికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రహదారి పక్కన పార్కింగ్‌ను నియంత్రించాల్సిన పెట్రోలింగ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ-ఎన్​హెచ్​ఏఐ అధికారులతో పాటూ స్థానిక పోలీసు యంత్రాంగాలు జాతీయ రహదారిపై సరైన పెట్రోలింగ్‌ చేయటంలేదు. భారీ సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడ రహదారి పక్కన నిలుపుతున్నారు.

గుత్తేదారు కంపెనీ అస్తవ్యస్త నిర్వహణ తీరుతో.. ఈ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేయగా... రహదారిపై నిత్యం ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పలు చోట్ల సర్వీసు రహదారులు, అండర్‌పాసులు నిర్మించాలని కేంద్రం నిర్ణయించి... ఆ మేరకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అయినా నెలలు గడుస్తున్నా ప్రతిపాదనల అమలుకు మోక్షం కలగడం లేదు. దీంతో ప్రమాదాల శాతం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణం రహదారి మరమ్మతుల పనులు మొదలుపెట్టాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.