ETV Bharat / state

వదలని వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. మరో 3 రోజులూ..!

author img

By

Published : Jul 8, 2022, 10:37 AM IST

Updated : Jul 8, 2022, 2:09 PM IST

రాష్ట్రంలో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు గత రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలతో పలు పట్టణాలు జలమయమయ్యాయి. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

విస్తారంగా వర్షాలు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. మరో 3 రోజులూ ఇలాగే..!
విస్తారంగా వర్షాలు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. మరో 3 రోజులూ ఇలాగే..!

వదలని వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. మరో 3 రోజులూ..!

అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ.. రాత్రి నుంచి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడింది. జిల్లాల్లో భారీ వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నాయి. పలుచోట్ల చెరువులు అలుగు పోస్తున్నాయి.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 19.4, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 16.2, భద్రాద్రి జిల్లా సీతారాంపట్నంలో 10.9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

నీట మునిగిన కాలనీలు..: నల్గొండ, ఖమ్మంలో కురిసిన వర్షాలకు పట్టణాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో.. వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణాల్లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ద్విచక్ర వాహనాలపై కార్యాలయాలకు, ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లేవారు తడిసి ముద్దయ్యారు. గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి.

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..: మరోవైపు వరద నీటితో రామగుండం, ఇల్లందు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇల్లందు కోయగూడెం ఉపరితల గనిలో క్యాంపు కార్మికుల నివాస సముదాయాలు నీట మునిగాయి. రామగుండం పరిధిలో ఉపరితల గనుల్లో వరద నీరు చేరడంతో పనులకు అంతరాయం కలిగింది. బురద కారణంగా బొగ్గు తరలించే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో భారీ వాహనాలను నిలిపివేశారు. వర్ష ప్రభావం పూర్తిగా తగ్గితేనే.. తిరిగి బొగ్గు ఉత్పత్తి పనులు యాధావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

70 గ్రామాలకు రాకపోకలు బంద్..: మహారాష్ట్రలో కురుస్తున్న వానలకు ఇంద్రావతి, ప్రాణహిత, గోదావరి నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. వాగులు నిండి పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. మారుమూల ప్రాంతం బామరాగడ్ తాలూకాలోని 70 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఇవీ చూడండి..

వరదలో చిక్కుకుపోయిన పాఠశాల బస్సు.. విద్యార్థులు సేఫ్​..

'కిన్నెరసాని'కి పోటెత్తిన వరద.. ప్రమాద హెచ్చరికలు జారీ..

Last Updated : Jul 8, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.