ETV Bharat / state

Seethakka Birthday: గిరిజన బిడ్డల పెద్దదిక్కు.. మన సీతక్క

author img

By

Published : Jul 9, 2021, 4:07 PM IST

Updated : Jul 9, 2021, 4:50 PM IST

పీడిత వర్గాల కోసం చిన్న వయసులోనే అడవి బాట పట్టారు. ప్రజల కోసం ప్రతి నిత్యం పరితపించారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు.. అయినా ప్రజాసంక్షేమం మరవలేదు. కరోనా కాలంలో గిరిజన బిడ్డలకు అన్నీ తానై సాయం చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు ఐరన్​ లేడీ సీతక్క.. ఈరోజు ఆమె పుట్టిన రోజు.

mla, seethakka
సీతక్క, ఎమ్మెల్యే, ములుగు

ఆమె గిరిజన బిడ్డలకు అండగా నిలుస్తోంది. ప్రజల కోసం నిత్యం పరితపిస్తోంది. ప్రభుత్వం సాయం చేయకపోయినా తన వంతుగా సహాయం చేస్తోంది. భూదేవి అంత సహనంతో ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తోంది. ఆమె సీతక్క.. ఈరోజు ఆమె పుట్టిన రోజు.. సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా అక్కడ ఎంతో కొంత హడావుడి ఉంటుంది. అదే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వెళ్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడో అతికొద్ది మంది మాత్రమే నిరాడంబరంగా ఉంటూ ప్రజాసేవ కోసం పరితపిస్తుంటారు. ఆ కోవలోకే వస్తారు సీతక్క.

చిన్నతనంలోనే అడవిబాట

చిన్నతనంలోనే ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక.. అడవి బాట పట్టారు. సంవత్సరం కూడా నిండని కొడుకుని అమ్మకు అప్పగించి పీడిత వర్గాల కోసం పోరాడారు. జైలు జీవితం గడిపారు. జనజీవితంలోకి వచ్చారు. అంబేడ్కర్​ రాసిన రాజ్యాంగంతో బడుగుబలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ప్రజామనిషి కావటంతో ఆమెను ములుగు ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆ ప్రజల నమ్మకాన్ని ఆమె నిలబెట్టుకున్నారు. కరోనా కాలంలో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం పరితపించారు. కొండలు, అడవులు దాటికి గిరిజన బిడ్డలకు సాయం చేశారు. నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. నిత్యావసర సరకులు అందించారు.

కూరగాయల మూట తలపై పెట్టుకుని..

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం నుంచి పెనుగోలు దూరం 20 కి.మీ. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న ఆ గ్రామానికి చేరుకోవాలంటే కాలినడకే శరణ్యం. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సీతక్క సైతం సుమారు 15 కి.మీ కాలినడకన నడిచారు. అవకాశం ఉన్నచోట మధ్యలో కొద్దిదూరం ద్విచక్ర వాహనం ఎక్కినప్పటికీ ఎక్కువ భాగం కాలినడకనే వెళ్లి పెనుగోలు చేరుకున్నారు. ఇలా పేదలకు అండగా నిలుస్తూ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు ఐరన్​ లేడీ సీతక్క.

అసెంబ్లీలో గొంతెత్తిన సీతక్క

ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తనదైన శైలిలో మాట్లాడారు. ప్రజాగొంతుకను వినిపించారు. కరోనా పట్ల సర్కార్​ను ముందే హెచ్చరించారు. ఎక్కడా గీట దాటకుండా సమస్యలపై పోరాటం చేశారు. కొవిడ్ చికిత్సను​ ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేశారు. ఇలా ప్రజా పోరాటం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

కన్నీరు పెట్టుకున్న సీతక్క

కొద్ది రోజుల క్రితం మావోయిస్టు నేత హరిభూషణ్‌ మరణ వార్త తెలుసుకున్న సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరిభూషణ్‌ టీం లీడరుగా ఉన్నప్పుడు తను ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమంలో పనిచేశానని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం జరిపే సీతక్క అంటే గిరిజనులకు ఎంతో ప్రేమ.

Seethakka Birthday: ఎమ్మెల్యే సీతక్క పుట్టిన రోజు

ఇదీ చదవండి: L. Ramana: రాష్ట్ర తెదేపా అధ్యక్ష పదవికి ఎల్.రమణ రాజీనామా

Last Updated : Jul 9, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.