ETV Bharat / state

పీహెచ్​సీల్లో వైరస్‌ భయం వెంటాడుతోంది

author img

By

Published : May 7, 2021, 7:06 PM IST

Virus threat in phc
Virus threat in phc

రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. కొవిడ్‌ పరీక్షల కోసం కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. దీంతో సాధారణ వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వచ్చే వారిని వైరస్‌ భయం వెంటాడుతోంది.

కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో.. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ పీహెచ్​సీ ఎదుట నిత్యం జనాలు బారులు తీరుతున్నారు. రోజూ వ్యాక్సిన్‌ కోసం వచ్చేవారి సంఖ్య 200 పైనే ఉంటోంది. ఇరుకైన ప్రాంగణంలో.. సాధారణ వైద్య సేవలకు వచ్చే వారిని వైరస్‌ భయం వెంటాడుతోంది.

పరీక్షలు అక్కడే.. టీకా అక్కడే..

ప్రధానంగా గర్భిణులు, చంటి పిల్లలకు సంబంధించిన వైద్య సేవలకు ఈ ఆస్పత్రి ప్రసిద్ధి. నెలలో సుమారు 15కు పైగా ప్రసవాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా వైద్య సేవలూ ఇక్కడే అందిస్తుండడంతో.. వారంతా భయాందోళనకు గురవుతోన్నారు. మరోవైపు కొవిడ్​ పరీక్షలు జరపడం, టీకాలు ఇవ్వడం.. సిబ్బందికి ఇది అదనపు భారంగా మారింది.

పక్క పక్కనే.. అంతా అయోమయం..

ఆస్పత్రికి వచ్చిన వారంతా ఒకే వరుసలో నిలబడుతుండటంతో.. కరోనా బాధితులెవరో, సాధారణ వైద్య సేవలకు వచ్చిన వారెవరో తెలియడం లేదంటున్నారు సిబ్బంది. స్థలం లేక.. ఓ వైపు కరోనా నిర్ధారణ పరీక్షలను జరుపుతూనే.. ఆ పక్కనే టీకాలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నామని అంటున్నారు. అక్కడకు వచ్చిన వారంతా.. కలిసే తిరుగుతుండడం… వారిని భయాందోళనకు గురి చేస్తోందంటున్నారు. ఇప్పటికైనా కొవిడ్‌ పరీక్షలను శాశ్వత ప్రాతిపదిక మరోచోట చేపట్టాలని వేడుకుంటున్నారు.

జిల్లా వైద్యాధికారి స్పందన..

ఈ సమస్యను 'ఈటీవీ భారత్‌' ప్రతినిధి.. జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వారు స్పందించారు. ప్రత్యామ్నాయ ప్రదేశాలను తీవ్రంగా అన్వేషిస్తున్నామని వివరించారు. సాధారణ వైద్య సేవలకోసం వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాక్సిన్‌ సేవలు మాత్రం ఆరోగ్య కేంద్రంలోని వైద్యుల పర్యవేక్షణలోనే జరుగుతాయని చెప్పారు.

ఇదీ చదవండి: ప్రపంచవ్యాప్తంగా 69 లక్షల కరోనా మరణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.