ETV Bharat / state

మహబూబ్‌నగర్ పురపాలికలో పేరుకే అద్దెలు.. పేరుకుపోతున్న బకాయిలు

author img

By

Published : Jan 13, 2023, 9:22 AM IST

Mahabubnagar Municipality
Mahabubnagar Municipality

Mahabubnagar Municipality: మహబూబ్‌నగర్ పురపాలికలో దుకాణాల అద్దె వసూళ్ల ప్రక్రియ.. అధికారులకు తలనొప్పిగా మారింది. సిబ్బంది వసూళ్ల కోసం వెళ్తే దుకాణాలకు తాళాలు వేసుకొని ఉడాయిస్తున్నారు. తప్పదని భీష్మించుకు కూర్చుంటే రాజకీయనేతలతో ఫోన్​లు చేయించి నోళ్లు మూయిస్తుండటంతో మహబూబ్‌నగర్‌ పురపాలికకు రావాల్సిన కోట్ల ఆదాయానికి గండిపడుతోంది.

మహబూబ్‌నగర్ పురపాలికలో పేరుకే అద్దెలు.. పేరుకుపోతున్న బకాయిలు

Mahabubnagar Municipality: నెలనెలా పురపాలికలకు వచ్చే ఆదాయం సక్రమంగా వస్తేనే.. మున్సిపాలిటీల నిర్వహణచక్కగా సాగుతుంది. వచ్చే ఆదాయానికి గండిపడితే నిర్వహణ అస్తవ్యస్తమవుతుంది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. దుకాణాల ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. మహబూబ్‌నగర్ పట్టణంలో మార్కెట్, గడియారం కూడలి, బస్టాండ్, న్యూటౌన్, పద్మావతి కాలనీ, టీడీ గుట్ట ప్రాంతాల్లో మున్సిపాలిటీకి సంబంధించిన 287దుకాణాలున్నాయి.

ఆ దుకాణాల నుంచి ప్రతినెల అద్దె వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని దక్కించుకున్న వ్యాపారులు.. అద్దెలు చెల్లించడం లేదు. సుమారు రూ.18కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పద్మావతికాలనీలో ఓ వ్యాపారి 5దుకాణాల్ని టెండర్‌లో దక్కించుకున్నాడు. రూ.57లక్షలు అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఆ వ్యాపారి అధికారులకు అద్దె చెల్లించకుండా.. దుకాణానికి తాళాలు వేసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు.

నోటీసులు అంటించినా సదరు వ్యాపారి నుంచి స్పందన కరవైంది. అలా మార్కెట్‌లోని 47దుకాణాల నుంచి రూ.5కోట్లు, గడియారం కూడలిలోని దుకాణాల నుంచి రూ.7 కోట్లు, న్యూటౌన్ కాంప్లెక్స్‌లోని 100 దుకాణాల నుంచి రూ.4 కోట్లు రావాల్సి ఉంది. అధికారులు నోటీసులు జారీ చేసి, తాళాలు వేస్తే కౌన్సిలర్లు, రాజకీయ నేతలతో ఫోన్​లు చేయించి ఒత్తిడి తెస్తున్నారు. ఒప్పందం ప్రకారం.. నెల నెలా డబ్బులు చెల్లిస్తూ వస్తున్నామని మధ్యలో ఒకేసారి అద్దెలు పెంచారని.. ఆ బకాయిలు తాము చెల్లించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

కొవిడ్ ఆంక్షల కాలంలో దుకాణాలు మూసేశామని ఆ అద్దెలు వసూలు చేయబోమన్న అధికారులు.. ఇప్పుడు వాటిని చెల్లించాలని పట్టుబడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. బకాయిల వసూళ్లలో సిబ్బంది చేతివాటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ కమిషనర్‌ను వివరణ కోరగా.. టెండర్‌ కాలం పూర్తైన దుకాణాలకుతిరిగి వేలం నిర్వహిస్తామని.. తాళాలు వేసుకొని బకాయిలు చెల్లించకుండా తప్పించుకున్న దుకాణాలు స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు

మున్సిపాలిటీ సిబ్బంది, వ్యాపారులు చెబుతున్న బకాయిలకు లక్షల్లో తేడా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. డబ్బులు వసూలుచేసి మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయకుండా.. గతంలో సిబ్బంది స్వాహా చేశారు. ఆడిటింగ్ నిర్వహించి పురపాలికకు రావాల్సిన ఆదాయానికి గండిపండకుండా చూడాలని జనం కోరుతున్నారు.

"కొత్త కమిషనర్ వచ్చాక అద్దెలు పెంచారు. ఒకేసారి 100 శాతం పెంచారు. దుకాణాలకు కిరాయిలు కడుతున్నాం. మేము బాకీ ఉన్నమాట వాస్తవమే. మధ్యలో కొన్ని సమస్యల వల్ల బకాయిలు పడ్డాం. త్వరలోనే మిగిలిన డబ్బులు చెల్లిస్తాం." - వ్యాపారులు

"ఏదైతే సమయం అయిపోయిందో అలాంటి దుకాణాలను స్వాధీనం చేసుకుంటాం. తాళాలు ఎవరైనా వేసుకుంటారో ఆ దుకాణాలకు వేలం వేస్తాం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం." - ప్రదీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్

ఇవీ చదవండి: ధ్రువీకరణం పత్రం ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే: హైకోర్టు

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.