ETV Bharat / state

Bjp Meeting in Mahabubnagar: రేపు పాలమూరులో "జనం గోస-భాజపా భరోసా"

author img

By

Published : May 4, 2022, 5:02 AM IST

Bjp Meeting in Mahabubnagar: వలసలకు, వెనకబాటుతనానికి చిరునామాగా మారిన పాలమూరు జిల్లాపై భాజపా కేంద్ర నాయకత్వం దృష్టి సారించింది. గులాబీ కంచుకోటను బద్దలు కొట్టి కమలాన్ని వికసింపజేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రంలో భాగంగా రేపు మహబూబ్‌నగర్‌లో జనం గోస-భాజపా భరోసా పేరిట... భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సభకు హాజరు కానున్నారు.

Bjp
Bjp

Bjp Meeting in Mahabubnagar: పాలమూరు జిల్లా ప్రస్తుతం తెరాస కంచుకోట. ఉమ్మడి జిల్లాలోని 14 శాసనసభ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెరాస నేతలే శాసనసభ్యులుగా, ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ దత్తత తీసుకున్న జిల్లా కూడా పాలమూరే. అలాంటి జిల్లాలో పాగా వేసేందుకు భాజపా కేంద్ర నాయకత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. 8 ఏళ్ల తెరాస వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు, భాజపా అధికారంలోకి వస్తే ఏం చేయబోతోందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని భావిస్తోంది. అందుకు ఈ నెల 5న మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కళాశాల మైదానంలో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర.. బహిరంగసభను వేదికగా మలచుకుంటోంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరు కానున్నారు.

పాలమూరులో పట్టు నిలుపుకునే ఉద్దేశంతోనే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను 31రోజుల పాటు.. ఉమ్మడి జిల్లాలోనే కొనసాగేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచించింది. ఇప్పటికే అలంపూర్, గద్వాల, మక్తల్, నారాయణపేట సహా దేవరకద్ర నియోజకవర్గాల్లో యాత్రకు, అక్కడ నిర్వహించిన బహిరంగ సభలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఊపుతో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సభకు లక్షమందికి పైగా జనాన్ని సమీకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.

పాలమూరు జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు. వెనకబడిన జిల్లాకు సాగునీరు అందించి వలసలను నివారించడంలో తెరాస వైఫల్యాన్ని సభ ద్వారా భాజపా నేతలు ప్రజలకు వివరించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి, ఆర్టీఎస్, నారాయణపేట- కొండగల్ ఎత్తిపోతల పథకం అమలుపై జాతీయ పార్టీ నేతలతో స్పష్టమైన ప్రకటన చేయించే అవకాశం ఉంది. దీనికితోడు పాలమూరు జిల్లాలో ప్రధాన సమస్యలైన అసంపూర్తి ప్రాజెక్టులు, చేనేత కార్మికుల కష్టాలు, ఇతర రాష్ట్రాలకు వలసలు, వాల్మీకి బోయలు, మాదాసి కురువలను ఎస్టీ జాబితాలో చేర్చడం, కుల వృత్తుల సమస్యలు సహా మౌలిక వసతుల కల్పనపై జాతీయ పార్టీ తరపున హామీలివ్వనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది.

మహబూబ్‌నగర్ బహిరంగ సభ తర్వాత ఈనెల 14న మహేశ్వరంలో నిర్వహించే బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. రెండో విడత సంగ్రామ యాత్ర ముగింపు సభను సైతం రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండో విడత సంగ్రామ యాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు ప్రజలు నాంది పలుకుతారని కమలదళం గట్టిగా విశ్వసిస్తోంది.

ఇదీ చదవండి: MP KOMATI REDDY: రైతుల తలరాతలు మార్చేలా వరంగల్‌ డిక్లరేషన్‌: కోమటిరెడ్డి

సిమ్​కార్డు రాకెట్ గుట్టు రట్టు.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా పేరుతో చీటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.