ETV Bharat / state

జోరుగా కొనసాగుతోన్న ఇంటింటి ఫివర్ సర్వే

author img

By

Published : May 9, 2021, 12:35 PM IST

home fever survey in Joint Mahabubnagar District
మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతోన్న ఇంటింటి ఫివర్ సర్వే

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతీ ఇంటికీ తిరిగి కొవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. స్వల్ఫలక్షణాలు ఉన్నవారికి మందులివ్వడం, తీవ్ర లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి అవసరమైతే ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందించడం సర్వే ప్రధాన ఉద్దేశం. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది కూడా ఈ సర్వేలో పాల్గొంటున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఫీవర్ సర్వే నిరాటంకంగా కొనసాగుతోంది. శని, ఆదివారాలు సెలవులున్నా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మాత్రం తమ పనిని కొనసాగిస్తున్నారు. ప్రతి ఆశ కార్యకర్త రోజుకు వెయ్యి మందిని సర్వే చేసేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మున్సిపల్ సిబ్బంది పల్లెల్లో ఆరోగ్యశాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. వారితో పాటుగా.. పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సర్వేను కొనసాగిస్తున్నారు.

నాలుగు రోజుల్లో ఐదు లక్షల కుటుంబాల సర్వే

ప్రతి ఇంటికి వెళ్లి కొవిడ్ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? ఆరా తీస్తున్నారు. స్వల్ప లక్షణాలున్నవారు వైద్యుల సలహా మేరకు మందులు, తీవ్ర లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులుంటే ఆ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ సిబ్బంది క్రిమి సంహారక ద్రావణాలతో ఆ ప్రాంతాలను శుభ్రపరుస్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 2011 గణాంకాల ప్రకారం 7లక్షల 50వేల కుటుంబాలున్నాయి. 2021 నాటికి ఈ సంఖ్య 10లక్షలకు చేరి ఉంటుంది. 5 జిల్లాలు కలపుకుని ఇప్పటి వరకూ 5 లక్షల కుటుంబాలను 4 రోజుల్లో సర్వే చేశారని అంచనా. 19 మున్సిపాలిటీలు, 1,648 గ్రామాల్లో ఈ సర్వే జోరుగా కొనాసాగుతోంది. అనుమానితులను గుర్తిస్తే వారికి వెంటనే ఐసోలేషన్ కిట్‌తో పాటుగా జాగ్రత్తలు వివరిస్తున్నారు.

తీవ్ర లక్షణాలుంటేనే పరీక్షలు

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కారణంగా మంచి ఫలితాలే వస్తున్నాయి. స్వల్ఫలక్షణాలున్న వారికి పరీక్షలు చేయకుండా మందులు ఇవ్వడం వల్ల ప్రభుత్వాసుపత్రుల వద్ద పరీక్షల కోసం వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తీవ్ర లక్షణాలుంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అవసరం ఉన్న వాళ్లకు మాత్రమే పరీక్షలు జరుగుతున్నాయి. ఆరోగ్యం విషమంగా ఉంటే ఆశాకార్యకర్తల సమాచారం తీసుకుని వైద్యులు ప్రభుత్వాపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల అవసరమైన వారికి మాత్రమే చికిత్స అందుతోంది. వైద్యారోగ్య శాఖ సిబ్బంది వెంట మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొనడంతో పారిశుద్ధ్యం సహ ఇతర సమస్యల్ని పరిష్కరిస్తున్నారు.

వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఫీవర్ సర్వే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. కేవలం సర్వే చేసి వదిలేయకుండా కొవిడ్ సోకిన వారిని, స్వల్ఫ, తీవ్ర లక్షణాలు ఉన్న వారి నుంచి క్రమం తప్పకుండా సమాచారం సేకరిస్తూ.. తగిన వైద్య సహాయం అందిస్తే కేసులు మరింత తగ్గుతాయని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: కరోనా సోకిన వారు ఇలా చేస్తే మరింత ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.