ETV Bharat / state

చేసిన పనులకు బిల్లులు రాక.. చేయాల్సిన పనులకు నిధులు లేక.. సర్పంచ్​ల అష్టకష్టాలు

author img

By

Published : Mar 12, 2023, 8:51 AM IST

Updated : Mar 12, 2023, 8:59 AM IST

No Funds To Gram Panchayats In Mahbubnagar: చేసిన పనులకు నిధుల్లేవు.. చేయాల్సిన పనులకు డబ్బుల్లేవు. ఖాతాలో సొమ్ములున్నా.. వినియోగించుకునే పరిస్థితి లేదు. ట్రాక్టర్ల సులభ వాయిదాలు.. డీజిల్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించలేకపోతున్నామని అంటున్నారు సర్పంచ్​లు. కొన్ని నెలలుగా జీతాల్లేని పంచాయతీ కార్మికులు ఆందోళనబాట పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పలు గ్రామపంచాయతీలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ప్రత్యేక కథనం..

panchayati
panchayati

చేసిన పనులకు బిల్లులు రాక.. సర్పంచ్​ల అష్టకష్టాలు

No Funds To Gram Panchayats In Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్​లు ఇటీవలే కొనుగోలు చేసిన ట్రాక్టర్లను.. మండల పరిషత్ కార్యాలయం వద్ద నిలిపి ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ట్రాక్టర్లు వద్దని, వాటి ఈఎంఐ, డీజిల్ బిల్లులు, కార్మికుల వేతనాలు చెల్లించలేకపోతున్నామంటూ.. సర్పంచ్​లు నిరసనకు దిగారు. వాటిని అక్కడే వదిలేసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎలాగో అధికారులు సర్దిచెప్పడంతో తిరిగి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీల ఆర్థిక దుస్థితికి ఆ సంఘటన అద్దం పడుతోంది.

చేసిన పనులకు బిల్లులు రాక, చేయాల్సిన పనులకు నిధులు లేక.. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఎలాగోలా నెట్టుకొస్తున్నారు సర్పంచ్​లు. కొన్ని నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామ పాలన కుంటుపడింది. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా.. ఇంటి పన్నుల ద్వారా వసూలు చేసిన నిధులైనా వాడుకుందామంటే.. డబ్బులు తీసుకోకుండా పంచాయతీ ఖాతాలు స్తంభింపజేశారంటూ సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పల్లె ప్రగతి, ఉపాధి హామీ కింద ఇప్పటికే గ్రామాల్లో సర్పంచిలు చాలా రకాల పనులు చేపట్టారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ దామాలు, చెత్త వేరు చేసే షెడ్లు, సీసీ రోడ్లు, మురికి కాల్వల్లాంటి పనులు పూర్తి చేశారు. కానీ సకాలంలో బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో పని చేసే పంచాయతీ కార్మికులు నిరసన బాట పడుతున్నారు. ఇచ్చేదే చాలీచాలని జీతాలు, వాటినీ సకాలంలో ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయాలని సర్పంచిలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామాల్లో పనులు నిలిపివేస్తామని పంచాయతీ కార్మికులు హెచ్చరిస్తున్నారు.

"సర్పంచ్‌లు తమ భార్యల పుస్తెలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామ సిబ్బందికి 6 నెలల జీతాలు రూ.45 వేలు ఇవ్వాలి. డీజిల్‌ రూ.15 వేలు, కరెంట్‌ బిల్లు రూ.12 వేలు, ట్రాక్టర్‌ ఈఎంఐ రూ. 20 వేలు.. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. నెలకు గ్రామ పంచాయతీకి రూ.లక్ష వరకు ఖర్చు ఉంటుంది. ఇంటి పన్ను రూ.1.50 లక్షలు వసూలు చేసి.. పంచాయతీ అకౌంట్‌కు కడితే.. దానిని కూడా పెండింగ్‌లో పెట్టారు. అసలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు హక్కులు ఉన్నాయా?" - జితేందర్ రెడ్డి, సల్కర్ పేట్ సర్పంచ్

"చేతిలో డబ్బులు ఉంటే వారి అకౌంట్‌లలో వేస్తాము. కానీ అది గవర్నమెంట్‌ నుంచి రావాల్సి ఉంది. డిసెంబర్‌ నుంచి రావాల్సినవి అన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. చిన్న పంచాయతీలు ఉండటం వల్ల వాటికి డబ్బులు తక్కువ మొత్తంలో వస్తాయి. ఇది కూడా ఒక సమస్యగా చెప్పొచ్చు." - శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి, పెద్దాయిపల్లి

ఇవీ చదవండి:

Last Updated :Mar 12, 2023, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.