ETV Bharat / state

పదోతరగతి విద్యార్థులకు నిజంగా పరీక్షే.. కేంద్రాల్లో ఏదో ఒక సమస్య

author img

By

Published : May 19, 2022, 4:06 AM IST

పదోతరగతి విద్యార్థులకు నిజంగా పరీక్షే.. కేంద్రాల్లో ఏదో ఒక సమస్య
పదోతరగతి విద్యార్థులకు నిజంగా పరీక్షే.. కేంద్రాల్లో ఏదో ఒక సమస్య

SSC Exams: అసలే వేసవికాలం.. ఆపై భరించలేని ఉక్కపోత. పేరుకు ఫ్యాన్లు ఉన్నా కరెంటు లేక తిరగని పరిస్థితి. ముక్కుమూసుకుంటే తప్ప మరుగుదొడ్లకు వెళ్లలేని దుస్థితి. పట్టపగలే కమ్ముకున్న చీకట్ల మధ్య మీద పడేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు కింద.. పరీక్షలు రాయటమంటే నిజంగా విద్యార్థులకు పరీక్షే. రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదోతరగతి పరీక్షలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి.

పదోతరగతి విద్యార్థులకు నిజంగా పరీక్షే.. కేంద్రాల్లో ఏదో ఒక సమస్య

SSC Exams: కరోనా పరిస్థితులు వాయిదాలు, రద్దుల తర్వాత రాష్ట్రంలో మళ్లీ పదో తరగతి పరీక్షలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. విద్యార్థుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నా చాలాచోట్ల వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలనే పరీక్షా కేంద్రాలకు ఎంపిక చేయగా.. అందుకు తగిన ఏర్పాట్లు చేయటంలో యంత్రాంగం విఫలమమవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 59 కేంద్రాలను ఎంపికచేయగా.. 274 పాఠశాలలకు చెందిన 13,242 మంది అక్కడ పరీక్షలు రాయనున్నారు. చాలాచోట్ల పరీక్షలు రాసేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తికాలేదు. జిల్లాలో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఎండల ప్రభావం విద్యార్థులపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు.. అనేక కేంద్రాల్లోని గదులకు కరెంట్‌ సరఫరా లేదు. కొన్నిచోట్ల ఉన్నా.. తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్లు అందుబాటులో లేకపోవడంతో.. సరైన గాలి, వెలుతురు రావటంలేదు. ఉక్కపోతలోనే విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నేలపై కూర్చునే రాయాల్సిన దుస్థితి: రెండేళ్లుగా పాఠశాలలు పూర్తి స్థాయిలో నడవనందున కొత్త బెంచీలు ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్లైతే నేలపై కూర్చుని పరీక్షలు రాయాల్సిన దుస్థితి. పాఠశాల ఆవరణలో మరుగుదొడ్లు సరిపడలేకపోవటం.. ఉన్నవాటిలో పరిశుభ్రత లోపించి, దుర్గంధభరితంగా మారాయి. పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినా... పాఠశాలల్లో పనిచేసేందుకు విముఖత చూపుతున్నారు. మహబూబ్‌నగర్‌తో పాటు మిడ్జిల్‌, దేవరకద్ర, కోయిలకొండ, జడ్చర్ల తదితర కేంద్రాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.

నిధుల లేమితో..: పరీక్షలు రాస్తున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గతంలో ఒక్కోకేంద్రం నిర్వహణకు నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం నిధుల కేటాయింపు లేకపోవటం, పాఠశాలల ఖాతాలోనూ పైసా లేకపోవటంతో పరీక్షల ఏర్పాట్ల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యార్థులు నేలపై కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితి రాకుండా ఇతర చోట్ల నుంచి బల్లలు సమకూర్చుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పరీక్షలకు సమయం ఉన్నందున ఆ లోగా పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో శుభ్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పది పరీక్షలంటేనే విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారని.. అలాంటిది సమస్యల మధ్య వారితో పరీక్షలు రాయించటం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.