ETV Bharat / state

Ponguleti srinivas : నేడు ఖమ్మం జిల్లాకు బీజేపీ నేతలు.. పొంగులేటితో భేటీ

author img

By

Published : May 4, 2023, 7:14 AM IST

BJP Leaders Meets Ponguleti Srinivas : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు పట్టులేని జిల్లాపై ప్రధానంగా గురిపెట్టిన కమలదళం.. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకునేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీజేపీ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఈ మేరకు ఇవాళ ఖమ్మం వెళ్లనున్న బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని ముఖ్యనేతల బృందం.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం కానుంది.

ponguleti
ponguleti

నేడు పొంగులేటితో సమావేశం కానున్న బీజేపీ నేతలు

BJP Leaders Meets Ponguleti Srinivas: బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ.. ఇప్పటి వరకు పార్టీకి పట్టులేని జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని విస్తరించే లక్ష్యంతో కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం నేడు ఖమ్మం వెళ్లి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం కానుంది. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా బీజేపీ నేతల పర్యటన సాగనున్నట్లు తెలుస్తోంది.

BJP Leaders Meets Ponguleti Srinivas Today: రాష్ట్రంలో బీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీతోనే సాధ్యమన్న సంకేతాన్నివ్వడం సహా.. పార్టీలో చేరాలని ఆహ్వానించే అవకాశం ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురయ్యాక బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలో ప్రచారం సాగింది. అయితే రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు సంప్రదిస్తున్నారని మాజీ ఎంపీ పలుమార్లు చెప్పారు. ఈటల రాజేందర్ తనకి అత్యంత ఆత్మీయమిత్రుడని పేర్కొన్నారు. ఈ తరుణంలో పొంగులేటి.. బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది.

ఆ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోను: రెండు జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాక నాయకులు, అనుచరుల అభీష్టం మేరకు పార్టీమార్పుపై.. నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు సంప్రదించినట్లు వార్తలొచ్చినా.. అవి ఊహాగానాలేనని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్​ను మూడోసారి అధికారంలోకి రాకుండా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాకుండా చేసే పార్టీలోకి వెళ్తానన్న పొంగులేటి.. ఉభయ ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథంతో జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి.

నేడు పొంగులేటితో బీజేపీ ముఖ్యనేతలు భేటీ: కర్ణాటక ఫలితాల తర్వాతే పొంగులేటి రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారన్న ప్రచారం సాగింది. ఖమ్మంలో జరిగే ఆత్మీయ సమ్మేళనంలోనే రాజకీయ అడుగులపై స్పష్టతనిస్తారని చర్చ సాగింది. మరికొద్దిరోజుల్లో ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎంపీ సన్నద్ధమవుతున్నారు. ఆలోగా బీజేపీ ముఖ్యనేతలు ఖమ్మం రానుండటం పొంగులేటితో భేటీ అవుతుడటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

పొంగులేటి రాజకీయ అడుగులు ఎటువైపు: బీజేపీ నేతలు పొంగులేటితో భేటీ కానుండటం ఉభయ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పొంగులేటి రాజకీయ అడుగులు ఎటువైపు వేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ వైపు మొగ్గుచూపుతారా లేదా అన్న అంశంపై ఆ భేటీ తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పలు జిల్లాల నుంచి కొంతమంది నేతలు ఇప్పటికే కమలంగూటికి చేరారు. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు పెద్దగా చేరలేదు. గతంలో టీడీపీ నాయకుడు కోనేరు సత్యనారాయణ, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎర్నేని రామారావు కమలంలో చేరారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.