ETV Bharat / state

సర్కారు బడుల్లో.. సహకార వెలుగులు...

author img

By

Published : Dec 26, 2020, 7:06 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం సదుపాయాలు కల్పించినా.. కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత తరచూ వేధిస్తోంది. ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, కంప్యూటర్‌ పరిజ్ఞానం కోసం సాంకేతిక సామగ్రి, మధ్యాహ్న భోజన వసతి, తదితర సౌకర్యాల కల్పనకు మేము సైతం అంటూ దాతలు ముందుకొస్తున్నారు. ఆయా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కొంత మెరుగుపడి.. విద్యార్థుల బోధన మరింత సమర్థంగా సాగేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఈ విధంగా పాఠశాల, విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడుతున్న దాతలపై ‘ఈటీవీ భారత్’ కథనం.

facilities to Telangana government schools
సర్కారు బడుల్లో సహకార వెలుగులు

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం డి.బూడిదపాడు వద్ద వీఎస్టీ సంస్థ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించారు. ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.8 లక్షల వ్యయంతో డిజిటల్‌ తరగతి గదికి సాంకేతిక సామగ్రి, నీటి ట్యాంకు నిర్మాణం చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.8 లక్షల ఖర్చుతో అలంపూర్‌ మండలం లింగనవాయి, అలంపూర్‌, ఉండవల్లి మండలం బైరాపురంలో డిజిటల్‌ తరగతి గదితో పాటు విద్యార్థులు కూర్చునేందుకు టేబుళ్లు ఉచితంగా అందించారు. ఉండవల్లి మండలం తక్కశిల పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన 70 బల్లలు ఉచితంగా అందించినట్లు వీఎస్టీ సంస్థ జనరల్‌ మేనేజర్‌ జయచంద్రారెడ్డి తెలిపారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా..

అయిజ మండలం ఉత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల అభివృద్ధికి గ్రామస్థులతో పాటు దాతలు చేయూత అందించారు. విద్యార్థులు చదువుకునేందుకు అనుకూలంగా గ్రంథాలయాన్ని, ఇన్నోవేషన్‌ గదిని దాతల సాయంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రంథాలయం ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చు కాగా అందులో దాత పులకుర్తి శ్రీనాథ్‌రెడ్డి రూ.1.5 లక్షలు అందించగా మిగిలిన డబ్బులు గ్రామస్థులు అందించారు. పాఠశాల ఇన్నోవేషన్‌ జోన్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు వ్యయం అవగా అందులో గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన దాత యు.దేవేందర్‌ రూ.6 లక్షలు సాయం అందించారు.

డిజిటల్‌ చదువుల యోగం

ఉండవల్లి మండలం చిన్నఆముదాలపాడుకు చెందిన రామకృష్ణారెడ్డి అమెరికా తెలుగు అసోసియేషన్‌ సౌజన్యంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.2 లక్షల ఖర్చుతో డిజిటల్‌ తరగతి, బల్లలు అందించారు. 2019 డిసెంబరులో జిల్లావ్యాప్తంగా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ఆటా స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిన్నారులకు సకల సౌకర్యాలు

వడ్డేపల్లి మండలం తిమ్మాజిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను 3 సంవత్సరాల పాటు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కంటోన్మెంట్‌ సికింద్రాబాద్‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాలకు ఉచితంగా 50 టేబుళ్లు, ఫ్యాన్లు, కంప్యూటర్‌ ప్రింటర్‌ సామగ్రి వితరణ చేశారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు దుస్తులు, బూట్లు, వాటర్‌బాటిళ్లు, లైబ్రరీకి పుస్తకాలు, ప్రతి విద్యార్థికి నోటుబుక్స్‌ అందించారు. విద్యార్థులు చేతులు శుభ్రపరచుకునేందుకు శానిటైజేషన్‌ సామగ్రి ఉచితంగా పంపిణీ చేశారు.

నీటి వసతితో విద్యార్థులకు మేలు

ఉండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వీఎస్టీ సంస్థ నిర్మించిన నీటి ట్యాంకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. దీంతో వంటలకు, తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. వీఎస్టీ సంస్థ పాఠశాల అభివృద్ధికి చేయూత అందించింది. పాఠశాలకు సెలవులు ఉండటంతో ఆకతాయిలు నీటిట్యాంకు పైపులు విరగొడుతున్నారు. గ్రామస్థులు రక్షణ కల్పించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది.

- రేవతి, విద్యార్థిని, ఉండవల్లి జడ్పీహెచ్‌ఎస్‌

సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంటాం

డిజిటల్‌ తరగతులతో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. యాత్రా ప్రదేశాలు, తదితర అంశాలపై దృశ్యరూపకంగా సులభ రీతిలో బోధన సాగుతోంది. ఉండవల్లి పాఠశాలలో తరగతి గదిలోనే డిజిటల్‌ తరగతులు నిర్వహించకుండా ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి. దీంతో కంప్యూటర్‌, ప్రింటర్‌తో పాటు సాంకేతిక పరికరాలకు భద్రత ఉంటుంది.

- అరవింద్‌రెడ్డి, విద్యార్థి, ఉండవల్లి జడ్పీహెచ్‌ఎస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.