ETV Bharat / state

RAINS IN TS: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వర్షం.. కరీంనగర్‌లో కుప్పకూలిన లుమినార్

author img

By

Published : Jan 11, 2022, 11:30 PM IST

VADAGALLA vanalu
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు

RAINS IN TS: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు జోరుగా కురిశాయి. అనుకోని వర్షంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి కరీంనగర్‌లో రాములోరి భారీ లుమినార్‌ కుప్పకూలింది. మరో రెండురోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది.

RAINS IN TS: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్‌ వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, రంగంపేట, గర్జనపల్లి, లాల్ సింగ్ నాయక్ తండ, అడవి పదిర తదితర గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పెద్ద పెద్ద వడగళ్లతో వాన పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

కుప్పకూలిన భారీ లుమినార్‌..

Rains in karimnagar: కరీంనగర్‌ భారీవర్షానికి తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. మురుగుకాల్వలు పోటెత్తి రహదారులపైకి భారీగా నీరు చేరింది. రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కరీంనగర్‌లో గీతాభవన్‌ వద్ద 70 అడుగుల ఎత్తులో కట్టెలతో ఏర్పాటు చేసిన భారీ లుమినార్‌ ఈదురుగాలుల ధాటికి కుప్పకూలింది. కరీంనగర్‌లో ఫిబ్రవరిలో జరగనున్న రాములోరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. రాముడి పట్టాభిషేక దృశ్యాలను ఆవిష్కరించేలా విద్యుత్‌దీపాలతో లుమినార్‌ సకల హంగులతో 45 లక్షలు వెచ్చించి నిర్మించగా అకాల వర్షాలకు పడిపోయింది.

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం..

rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో వర్షం పడింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో పలుచోట్ల వర్షం కురిసింది. గాజులరామారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సురారంలోనూ చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్‌ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్‌లోని పరిధిలోని చర్లపల్లి, జవహర్‌నగర్‌, దమ్మాయిగూడలో భారీ వర్షం కురవగా.. మేడ్చల్‌, మౌలాలి, కుషాయిగూడ ప్రాంతాల్లో కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

వరంగల్‌ జిల్లాలో వడగళ్ల వాన...

Rains in Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వడగళ్ల వాన దంచికొట్టింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ధాటికి కొన్నిచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలు గ్రామాల్లో మిరప, మొక్కజొన్న పంటకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. హన్మకొండ, భూపాలపల్లి, జనగామ,వరంగల్ జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వడగళ్ల వర్షంతో ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. చలికి తోడు వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

రాగల మూడు రోజులు వర్షాలు...

Weather Report Telangana: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్. నాగరత్న తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.