ETV Bharat / state

'దేశ ఆర్థిక వ్యవస్థకు ఎమ్​ఎస్​ఎమ్ఈలే వెన్నెముక'

author img

By

Published : Dec 8, 2020, 10:06 PM IST

ఎమ్​ఎస్​ఎమ్ఈలే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. టై హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్​ సమ్మిట్​ ప్రారంభోత్సవంలో దృశ్యమాధ్యమం ద్వారా ఉపరాష్ట్రపతితో కలిసి ఆయన పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్​ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని మంత్రి పేర్కొన్నారు.

tie global sumit inaugauration by central minister nithin gadkari in hyderabad
దేశ ఆర్థిక వ్యవస్థకు ఎమ్​ఎస్​ఎమ్ఈలే వెన్నెముక

ప్రస్తుత పరిస్థితులు భారత్​లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. టై హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్​ ప్రారంభోత్సవంలో దృశ్యమాధ్యమం ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివని మంత్రి వెల్లడించారు.

ఉద్యోగాల సృష్టే కీలకం: నితిన్ గడ్కరీ

దేశ జీడీపీలో 30 శాతం వాటా, ఎగుమతుల్లో 48 శాతం వాటా అందిస్తోన్న ఎమ్ఎస్ఎమ్ఈలు 11 కోట్ల మందికి ఉపాధి అందిస్తున్నాయని తెలిపారు. దేశ జీడీపీలో వీటి వాటాను 40 శాతానికి, ఎగుమతుల్లో వాటాను 60 శాతానికి పెంచడం ద్వారా కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. చేనేత, ఖాదీ, గ్రామీణ, వ్యవసాయ, గిరిజన పరిశ్రమల నుంచి 80 కోట్ల ఆదాయం వస్తోందని, రెండేళ్లలో 5 లక్షల కోట్లకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కొవిడ్ సమయంలో ఎమ్ఎస్ఎమ్ఈలు సమస్యల్లో చిక్కుకున్నాయని.. వాటికోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. దేశీయ వాహన రంగం కరోనా సమయంలో ఎగుమతులు పెంచుకుందని, వాహనాల తయారీలో ప్రపంచానికి హబ్​గా భారత్​ మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులుకు భారత్ సరైన గమ్యస్థానమని, పెట్టుబడులతో వచ్చేవారికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని గడ్కరీ స్పష్టం చేశారు.

యువత ఉద్యోగాలు సృష్టించాలి : వెంకయ్యనాయుడు

ఆలోచనలను కార్యరూపం దాల్చేలా భారతీయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశ జనాభాలో 65 శాతం ఉన్న యువత ఆలోచన విధానం ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి కొలువులను సృష్టించే విధంగా మారాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. జనాభాలో 50 శాతం మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలన్నారు. విశ్వవిద్యాలయాలు ఇంక్యూబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని... విదేశాల్లో మాదిరి కార్పోరేట్ రంగం కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎక్కువ మంది ఔత్సహికులు ఉన్నట్లయితే ఆ దేశం సంపన్నంగా మారుతుందని బ్రిటన్​లో ఓ సర్వే తేల్చిందని... అలాంటి దేశాలు సంతోషంగా ఉంటాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.


ఇదీ చూడండి:ధర్నా చౌక్​ ఎత్తేసిన కేసీఆర్​కు ధర్నా చేసే హక్కెక్కడిది : ఎంపీ అర్వింద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.