ETV Bharat / state

Global Temperature rise : 'అరడిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా.. అల్లకల్లోలమే'

author img

By

Published : May 23, 2023, 12:06 PM IST

temperatures
temperatures

Global Temperature rise : మండిపోతున్న ఎండలు... రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. అయితే ఇది ప్రతి ఏడాది ఉండేదే కదా... అంటారా..? కానీ, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఇంతితై అన్నట్లు ఎప్పుడూ లేనంతగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి కారణం మానవ తప్పిదాలేనని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ సమయంలో ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీలకు పెరిగితే తీవ్ర ఆహార సంక్షోభంతో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని యూఎన్​ఓ తెలిపింది. ఈ సమయంలో తక్షణ కట్టడి చర్యలు అవసరమని అంటోంది. అసలు, ఇంతలా ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణాలేంటి... ? ఏయే రంగాలపై దీని ప్రభావం పడనుంది..? పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కట్టడి చేయలేమా ? అనే దానిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

మండిపోతున్న ఎండలు...రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

Global Temperature rise : ఎండాకాలం... ఒకప్పుడు 35డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే మహా అనుకునేవారు. ఎవ్వరికి అంతలా ఎండల తీవ్రత తెలిసేది కాదు. కానీ, గత కొన్నేళ్ల నుంచి 45, 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే... అమ్మో ఇంత ఎండలు ఎలా తట్టుకోవాలి అంటున్నారు. అయితే ఇదంతా మానవ తప్పిదాల వల్లే అనేది అక్షర సత్యం. ఎందుకంటే మనం చేసే చిన్నచిన్న తప్పులే పుడమికి ముప్పులా మారాయి. గతంతో పోల్చుకుంటే జనాభా బాగా పెరిగింది. జనాల అవసరాలు కూడా పెరిగాయి. దీంతో ప్రకృతి కాలుష్యం, వాతావరణ మార్పులకు తెరతీసినట్లు అయ్యింది.

అరడిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే అల్లకల్లోలమే : ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబాలు ఒకప్పుడు ఏసీ వాడుతుండేవారు. కానీ, ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటికి ఓ ఏసీ, రిఫ్రేజ్‌రేటర్‌ తప్పనిసరిగా వినియోగిస్తున్నారు. అలాగే కరోనాకు ముందు వ్యక్తిగత వాహనాలు కలిగి ఉన్నవారు చాలా తక్కువ. ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న ఉద్యోగస్థులు కూడా వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడిదే భూమి పాలిట శాపంలా మారనుంది. ఎందుకంటే అనేక కారణాలతో భూతాపం పెరగనుంది. అందులో భాగంగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ 2 డిగ్రీల దాకా వెళ్లకుండా చూసుకోవాల్సిందేనని ఐక్యరాజ్యసమితి తాజాగా హెచ్చరించింది.

Global Temperature rise causes climate damage : ఒకప్పటితో పోలిస్తే వాహనాల వినియోగం పెరిగిపోయింది. దీంతో కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున విడుదల అవుతున్నాయి. మన దేశంలోని ప్రముఖ మెట్రోపాలిటన్‌ నగరాలన్నీ ప్రధాన కాలుష్య నగరాల జాబితాలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఆయా నగరాల్లో పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదల అవుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర నరకం చూస్తున్నారు. అలాగే భవిష్యత్‌లో ఇంతకంటే మరిన్ని కష్టాలు చవిచూస్తారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు అటవీ ప్రాంతాలు కుంచించుకపోవడం కూడా భూతాపానికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. దీంతో ప్రచండమైన ఎండలు, అకాల వర్షాలు సర్వసాధారణమవుతున్నాయి.

అలా జరిగితే తీవ్ర సంక్షోభం... ఉత్పత్తుల్లో కొరత ఏర్పడటం ఖాయం : భూతాపంతో.... ఆర్థిక నష్టాలు కూడా ఉద్ధృతమయ్యాయి. రానున్న రోజుల్లో పెరిగే ఎండలతో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారి సంఖ్య తగ్గడం ఖాయమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ముఖ్యమైన రంగాలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలింది. రానున్న కాలంలో చాలా రంగాలలో ఎండల ప్రభావంతో శ్రామిక శక్తి తగ్గే అవకాశం ఉందని అంచనా. అలా జరిగితే తీవ్ర సంక్షోభం... ఉత్పత్తుల్లో కొరత ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది.

ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా సగం వరకు తగ్గించాలి. 2050కల్లా కర్బన ఉద్గారాలు జీరో ఎమిషన్స్‌ స్థాయికి చేరుకోవాలి. ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు పెరిగితే భూతాపం, ఆహార సంక్షోభం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. భూతాపం వల్ల పుడమిపై ఇప్పుడున్న మెుక్కలు సగానికి సగం కన్పించకుండా పోయే ప్రమాదముంది. వాతావరణ మార్పుల వల్ల 2030-2050 మధ్య ఏటా అదనంగా 2 లక్షల 50వేల మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఇటీవల ఎండల తీవ్రతకు యువకులు సైతం మరణిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఉష్ణోగ్రతలు కట్టడి చేయాలంటే... ఈ చర్యలు తీసుకోవాల్సిందే : కొత్తగా నెలకొల్పే విద్యుత్‌ కేంద్రాలన్నీ సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలై ఉండాలి. 2050 కల్లా బొగ్గును పూర్తిగా పక్కనపెట్టి పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లాలి. విద్యుత్‌ వాహనాల వినియోగం, హీట్‌ పంపుల వంటి కొత్త సాంకేతికతలు కర్బన ఉద్గారాలను తగ్గిస్తాయి. అలాగే నౌకలు, విమానాల్లోనూ పునరుత్పాదక ఇంధనాలను ఎక్కువగా వినియోగించాలి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వాలు విధానాలను రూపొందించి, పటిష్ఠంగా అమలు చేయాలి.

2020 గణాంకాల ప్రకారం గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో అమెరికా, చైనా తర్వాత స్థానం భారత్‌దే. గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించేందుకు భారత ప్రభుత్వం.. తక్షణం జాతీయ కార్యక్రమాన్ని రూపొందించాలి. స్థానికంగా కూడా భూతాపం పెరుగుదలకు ప్రధాన కారణాలను విశ్లేషించాలి. దాన్ని తగ్గించడంపై దృష్టిసారించాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. ఏ దేశ అభివృద్ధిలోనైనా పర్యావరణానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి పర్యావరణాన్ని సంరక్షిస్తే ఫలితాలు బాగుంటాయి. లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.