ETV Bharat / state

Rs.2000 note Exchange : రూ.2వేల నోట్లున్నాయ్‌.. తీసుకుంటారా?

author img

By

Published : May 23, 2023, 9:18 AM IST

Rs.2000 note Exchange : మొన్నటి వరకు మార్కెట్​లో కనుమరుగైన రెండు వేల నోట్లు ఆర్బీఐ ప్రకటనతో అధిక మొత్తంలో ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంత కాలం తమ దగ్గర దాచుకున్న రెండు వేల నోట్లను ఇప్పుడు అందరూ బయటకు తీస్తున్నారు. రూ.2 వేల నోటు ఉపసంహరణ ప్రకటనతో నల్లబజారులో బంగారం విక్రయాలకు ఊపొచ్చింది. ఇప్పటివరకు దాచిపెట్టిన సొమ్మును బంగారంపై పెట్టుబడిలా మార్చేందుకు కొంగొత్త దారులను వెతుక్కుంటున్నారు.

RBI decision to withdraw 2000 notes
RBI decision to withdraw 2000 notes

Rs.2000 note Exchange : రెండు వేల నోటు ఉపసంహరణ ప్రక్రియపై ఆర్బీఐ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో బంగారం అమ్మకాలకు ఊపొచ్చింది. తమ దగ్గర ఉన్న రూ.2వేల నోట్లతో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు కొందరు దారులు వెతుక్కుంటున్నారు. రూ.65వేల నుంచి 68వేల వరకు ఇచ్చి.. అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2వేల నోటు చలామణి ఉపసంహరణపై ప్రకటన చేసిన రోజు నుంచే.. రూ.2వేల నోట్లు చాలా ఉన్నాయి.. తీసుకుంటారా..? అంటూ బ్లాక్‌ మార్కెట్‌తో కొందరు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Rs.2000 notes Exchange process starts : కొందరు బంగారం వ్యాపారులు దీనిని అవకాశంగా తీసుకొని బంగారం ధరను వారే నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​లోని ఆబిడ్స్‌, కోఠి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంగారం కొనుగోలు, అమ్మకాల్లో హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్రమ పద్ధతుల్లో బంగారం విక్రయాలు, కొనుగోళ్లు చేసేవారిని అధికారులు ఎలా గుర్తిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Rs.2000 notes Exchange Scam : ఇక సాధారణ బంగారం షాపుల్లో రోజుకు 10నుంచి 15కు మించి రెండు వేల నోట్లు రావడం లేదని వ్యాపారులు అంటున్నారు. వివియోగదారులు రూ.2వేల నోట్లు చూసి చాలా రోజులైందని చెబుతున్నారు. డిజిటల్​ పేమెంట్లకు అలవాటు పడ్డామని.. బిల్లులు కూడా అలానే చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ప్రకటన సామాన్యులపై పెద్దగా ప్రభావం చూపదని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హాల్‌ మార్కింగ్‌ లేని బంగారు అమ్మకాలు, కొనుగోళ్లపై ఏప్రిల్‌ ఒకటి నుంచి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంతో బ్లాక్‌ మార్కెట్‌లో బంగారం విక్రయాలపై అనుమానాలు పెరుగుతున్నాయి.

మరోవైపు నేటి నుంచి రూ.2వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. రోజుకు రూ.20 వేల చొప్పున మార్చుకొనే అవకాశం ఉందని పేర్కొంది. రూ.50 వేలకు మించి డిపాజిట్‌ చేస్తే పాన్‌ నంబర్‌ తప్పనిసరిగా సూచించింది. కొత్తగా రూ.2 వేల నోటును జారీ చేయవద్దని బ్యాంకులకు ఈనెల 20న ఆదేశాలు జారీ చేసింది. రూ.2 వేల నోట్లను సెప్టెంబరు 30 వరకు మార్చుకునేందుకు రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అవకాశమిచ్చింది. రూ.2 వేల నోటు వెనక్కి తీసుకున్నా చెల్లుబాటవుతుందని ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.