ETV Bharat / bharat

కొద్దిగంటల్లో పెళ్లి.. పార్లర్​కు వెళ్లిన వధువుపై కాల్పులు.. కానిస్టేబుల్ పనే

author img

By

Published : May 23, 2023, 10:30 AM IST

Updated : May 23, 2023, 11:36 AM IST

బిహార్​లో దారుణం జరిగింది. బ్యూటీ పార్లర్​లో మేకప్ వేయించుకుంటున్న ఓ యువతిపై కాల్పులు జరిపాడు ఓ వ్యక్తి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు స్థానికులు. బాధితురాలికి మరికొన్ని గంటల్లో పెళ్లనగా.. నిందితుడు ఆమెపై కాల్పులు జరపడం గమనార్హం. మరోవైపు.. తన భార్య డబ్బుల్ని మరో ఇద్దరు యువకులకు ఇస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

bride shot on her wedding day
bride shot on her wedding day

మరికొద్ది గంటల్లో ఆమె పెళ్లి... అందంగా తయారై పెళ్లి పందిరి ఎక్కుదామని భావించింది ఆ యువతి... అందుకే మేకప్ కోసం బ్యూటీపార్లర్​కు వెళ్లింది.. అంతలోనే యువతిని ప్రేమిస్తున్న వ్యక్తి బ్యూటీపార్లర్​కు వచ్చి ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన బిహార్​.. ముంగేర్ జిల్లాలో ఆదివారం జరిగింది. నిందితుడిని పట్నా పోలీస్ స్టేషన్​లో పనిచేసే కానిస్టేబుల్​ అమన్ కుమార్​గా గుర్తించారు.

ముంగేర్​లోని తారాపుర్​ మహేశ్​పుర్​కు చెందిన జితేంద్ర కుమార్​ కుమార్తె అపూర్వ కుమారి(26)కి ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఆమె మేకప్ వేయించుకునేందుకు అదే రోజు నగరంలోని బ్యూటీ పార్లర్​కు వెళ్లింది. ఆ సమయంలో ఆమెపై కానిస్టేబుల్ అమన్ కుమార్​ కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఛాతీలోకి బుల్లెట్​ దూసుకెళ్లింది. వెంటనే బ్యూటీ పార్లర్ సిబ్బంది, స్థానికులు.. అపూర్వను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అపూర్వను నిందితుడు ప్రేమిస్తున్నాడని సమాచారం. ఆమెకు పెళ్లి అయిపోతుందనే కోపంతో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

"అమన్ కుమార్​ కూడా అపూర్వ కుమారి వెంటే బ్యూటీ పార్లర్​కు వచ్చాడు. మేము ఆమెను ముస్తాబు చేస్తుండగా.. బ్యూటీపార్లర్​లో ఆమె వెనుకే నిలబడ్డాడు. అమన్​ కుమార్​ను మేము.. అపూర్వ కుమారి కుటుంబ సభ్యుడని అనుకున్నాం. నిందితుడు.. అపూర్వపై వెనుక నుంచి కాల్పులు జరిపాడు. ఈ తర్వాత తనను తాను కాల్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ గన్ సరిగ్గా పేలలేదు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాం. కానీ అతడు దొరకకుండా బ్యూటీ పార్లర్ నుంచి పరారయ్యాడు."
-బ్యూటీ పార్లర్ సిబ్బంది

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం అతడు పట్నాలో పోలీస్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడని తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో పోలీసులు ఒక పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు.

నా భార్య వేరే యువకులతో..
తాను సంపాదించిన డబ్బును తన భార్య వేరే యువకుల కోసం ఖర్చు చేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీలో జరిగింది.

ఇదీ జరిగింది..
హల్ద్వానీలో లోహ్రియాసల్​కు చెందిన ఓ వ్యక్తి.. తన భార్య గత రెండేళ్లుగా షాజాద్ ఖురేషీ, అభిషేక్ సింగ్‌ అనే ఇద్దరు యువకుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయంపై తన భార్యను ప్రశ్నిస్తే దుర్భాషలాడిందని పేర్కొన్నాడు. తన భార్య.. ఆ ఇద్దరు యువకులతో బయట తిరుగుతోందని అన్నాడు. ఆ యువకులను ప్రశ్నిస్తే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని అన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి భార్య, మరో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు.

స్థిరాస్తి వ్యాపారిపై కాల్పులు..
దిల్లీలో ఓ స్థిరాస్తి వ్యాపారిపై కాల్పులు జరిపారు దుండగులు. దీంతో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. జహంగీర్​పురి ప్రాంతంలో సోమవారం జరిగిందీ ఘటన. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడిని బిజేంద్ర యాదవ్​గా గుర్తించారు. ఆస్తి విషయంలో గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 23, 2023, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.