ETV Bharat / state

Telangana on Budget: రేపే కేంద్ర బడ్జెట్​.. రాష్ట్రానికి తోడ్పాటు అందేనా?

author img

By

Published : Jan 31, 2022, 4:44 AM IST

Telangana on Budget: కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రానికి అందే తోడ్పాటుపై ఆసక్తి నెలకొంది. పన్నుల వాటా, గ్రాంట్లు, ఆర్థికసంఘం సిఫార్సులకు అనుగుణంగా నిధులతో పాటు విభజనచట్టం హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తులు పంపింది. పెండింగ్ అంశాలతో పాటు ఆయా రంగాలు, అంశాల్లో రాష్ట్రానికి నిధులు కేటాయించి తగిన సహకారం అందించాలని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే కేంద్రాన్ని కోరింది.

Telangana on Budget: రేపే కేంద్ర బడ్జెట్​.. రాష్ట్రానికి తోడ్పాటు అందేనా?
Telangana on Budget: రేపే కేంద్ర బడ్జెట్​.. రాష్ట్రానికి తోడ్పాటు అందేనా?

Telangana on Budget: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ రేపు ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞాపనలు పంపుతూనే ఉంది. ఈ మారు కూడా రాష్ట్ర ప్రతిపాదనలు, అభ్యర్థనలను కేంద్రం ముందు ఉంచింది. బడ్జెట్ సన్నాహకంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని కేంద్ర ఆర్థిక మంత్రికి నివేదించారు. బకాయిలు, పెండింగ్ నిధులపై ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు లేఖ కూడా రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రావాల్సిన 30,751 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులకు సంబంధించిన రెండేళ్ల బకాయిలు 900 కోట్లు ఇవ్వాలని, నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు.

జాతీయ హోదా కల్పించాలి..

స్థానికసంస్థలకు 817 కోట్ల గ్రాంట్లు, పన్నుల్లో వాటా తగ్గడంతో 723 కోట్ల ప్రత్యేక గ్రాంటు, ఏపీ ఖాతాలోకి పొరపాటున వెళ్లిన 495కోట్లు ఇవ్వాలని, పెండింగ్​లో ఉన్న 210 కోట్ల ఐజీఎస్టీ నిధులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి చేసిన ప్రత్యేక సిఫారసులకు తిరస్కరించడం సబబు కాదని.. వాటిని గౌరవించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అనుగుణంగా మిషన్ భగీరథ నిర్వహణకు 2350 కోట్లు, హైదరాబాద్ ఘనవ్యర్థాల నిర్వహణ - వాలు కాలుష్య నియంత్రణ కోసం ఐదేళ్ల కాలానికి దాదాపు రెండు వేల కోట్లు, వైద్యారోగ్యం, పీఎంజీఎస్​వై, వ్యవసాయం, న్యాయ, ఉన్నతవిద్య, ఇతర ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని మరోమారు విజ్ఞప్తి చేయడం సహా కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

రుణపరిమితిని పెంచాలి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల్లో వాటాగా కేంద్రం నుంచి 13990 కోట్లు వస్తాయని అంచనా వేయగా... దాన్ని 8721 కోట్లకు తగ్గించారు. కేంద్రం నుంచి 38వేల కోట్ల గ్రాంట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తే అందులో ఇప్పటి వరకు కేవలం 5689 కోట్లు మాత్రమే వచ్చాయి. కొవిడ్, లాక్ డౌన్ కారణంగా ఆదాయాలు తగ్గిన వేల తోడ్పాటు ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రుణపరిమితిని కూడా పెంచాలని విజ్ఞప్తి చేసింది.

ఆయా రంగాలకు నిధుల కోసం కేటీఆర్​ లేఖలు

అటు ఆయా రంగాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. రాష్ట్రంలో వివిధ పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్రం తరపున 7778 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఔషధనగరి, పారిశ్రామిక కారిడార్లకు పదివేల కోట్ల వరకు నిధులు ఇవ్వాలని కోరిన ఆయన... నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్​లో హైదరాబాద్​ను చేర్చాలని కోరారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు సహా చేనేత రంగం అభివృద్ధి, ప్రోత్సాహం కోసం కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరారు. జాతీయ ఉపాధిహామీ పథకం తరహాలో పట్టణపేదల కోసం కూడా ప్రత్యేకంగా ఉపాధిహామీ పథకాన్ని తీసుకురావాలని కూడా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.