ETV Bharat / state

Telangana Budget 2022: మరోసారి భారీ బడ్జెట్​.. హామీల అమలుకు ప్రాధాన్యం

author img

By

Published : Mar 7, 2022, 5:11 AM IST

Telangana Budget 2022: రాష్ట్ర ప్రభుత్వం మరోమారు భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గత రెండేళ్ల తరహాలోనే బడ్జెట్ అంచనాలు 20 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. పద్దు పరిమాణం 2.70 లక్షల కోట్లు దాటినట్లు సమాచారం. ఎప్పటి లాగే సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు హామీల అమలు, ప్రాధాన్యతా పథకాలకు సరిపడా నిధులు కేటాయించినట్లు తెలిసింది. దళితబంధుకు భారీ కేటాయింపులతో పాటు ఉద్యోగ నియామకాల కోసం కేటాయింపులు ఉండనున్నాయి.

Telangana Budget
Telangana Budget

Telangana Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇవాళ వెల్లడి కానుంది. తుది కసరత్తు అనంతరం నిన్న సాయంత్రం... బడ్జెట్‌ను మంత్రివర్గం ముందుంచారు. రాబడులు, కేటాయింపులు, ప్రాధాన్యతలను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కేబినెట్‌కు వివరించారు. ఆ తర్వాత బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. దాన్ని ఇవాళ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం 2.30 లక్షల కోట్ల బడ్జెట్​ని ప్రవేశపెట్టింది. గత రెండేళ్లు బడ్జెట్ పరిమాణాన్ని పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం క్రితం ఏడాది అంచనాలపై 20 శాతానికి పైగానే పెంచుతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల రాబడి బాగా ఉంది. అంచనాలను అందుకుంటామన్న విశ్వాసంతో సర్కార్ ఉంది.

అంచనాల కంటే 20 శాతానికి పైగానే...

వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి 20 శాతానికి పైగానే పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అటు జీఎస్​డీఏ వృద్ధిరేటు కూడా 19 శాతానికి పైగా ఉంది. భూముల అమ్మకం తదితరాల ద్వారా పన్నేతర ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్​డీపీ పెరుగుదలతో బాండ్ల ద్వారా తీసుకునే రుణాల మొత్తం కూడా పెరగనుంది. వీటన్నింటి నేపథ్యంలో రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్దును భారీగానే సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది బడ్జెట్ అంచనాల కంటే 20 శాతానికి పైగానే పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. దీంతో బడ్జెట్ పద్దు 2.70 లక్షల కోట్ల రూపాయలను దాటే అవకాశం కనిపిస్తోంది. 25 శాతం పెరుగుదలకు కూడా అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రగతి పద్దు 1.50 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. నిర్వహణ పద్దు 1.20 లక్షల కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది.

భారీగా పద్దు...

పద్దు పరిమాణాన్ని భారీగా పెంచిన సర్కార్... అందుకు అనుగుణంగా ఆయా శాఖలకు కేటాయింపులను కూడా పెంచినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయ రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం దక్కనుంది. అన్ని రకాల సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు నిధులు పెంచనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలు కోసం 20 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిసింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బియ్యం రాయితీ, తదితరాలకు నిధులు పెరగనున్నాయి. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థికసాయం కోసం నిధులు పొందుపరిచినట్లు సమాచారం. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు పెరగనున్నాయి. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఆయిల్‌పామ్ సాగు, విద్యుత్ రాయితీ, తదితరాల కోసం నిధులు పెరగనున్నాయి. వ్యవసాయానికి సంబంధించి కొత్త కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

హామీల అమలుకు ప్రాధాన్యం...

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, హైదరాబాద్, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితరాలకు కేటాయింపులు పెరగనున్నాయి. కీలకమైన ఉద్యోగాల నియామకాల కోసం కార్యాచరణ అమలుకు సిద్దమవుతున్న పరిస్థితుల్లో అందుకు తగ్గట్టుగా బడ్జెట్​లో నిధులు కేటాయించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, నెరవేర్చాల్సిన హామీల అమలుకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఆయా శాఖలు, కార్యక్రమాలకు కేటాయింపులు చేశారు.

ఇదీ చూడండి: Telangana Cabinet Meeting: బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.