ETV Bharat / state

కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు.. విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్

author img

By

Published : Mar 11, 2023, 3:23 PM IST

Updated : Mar 11, 2023, 4:05 PM IST

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్.. విచారణకు డీజీపీని ఆదేశించింది. మహిళల గౌరవాన్ని కించపరిచేలా బండి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడింది. ఈ మేరకు వ్యక్తిగతంగా హాజరుకావాలని బండి సంజయ్‌కు నోటీసులు పంపనుంది.

కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు
కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. సంజయ్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి.. విచారణకు డీజీపీని ఆదేశించారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసి.. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆశిష్ యాదవ్ ఆధ్వర్యంలో.. కార్యాలయం ముందు బైఠాయించిన మహిళలు, నేతలు.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితపై బండి సంజయ్, ఇతర నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని.. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణ చెప్పకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే..: చిలకలగూడ కూడలి వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, సికింద్రాబాద్ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు ఈడీ విచారణ కొనసాగుతుండగా.. బండి సంజయ్ ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంజయ్‌ ఫ్యామిలీ మీద దాడి చేస్తాం..: కుత్బుల్లాపూర్‌లోని ఐడీఎల్‌ చౌరస్తాలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బండి సంజయ్ వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే.. ఉన్నత పదవిలో ఉన్న నాయకురాలని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో సంజయ్ ఇంటి మీద, ఫ్యామిలీ మీద దాడులు చేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కవిత పట్ల సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై నగరంలోని పలు పీఎస్‌లలో కంప్లైంట్‌ ఇచ్చారు. కేసుల నమోదుపై న్యాయ సలహా తీసుకుంటున్న పోలీసులు.. అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒకే పీఎస్‌కు బదిలీ చేసి, దర్యాప్తు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇవీ చూడండి..

చంపుతామని బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఎంపీ కోమటిరెడ్డి ఫిర్యాదు

మోదీ కాన్వాయ్​ కమాండో మృతి.. కాలువలో పడ్డ 20 గంటల తర్వాత..

Last Updated : Mar 11, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.