ETV Bharat / bharat

మోదీ కాన్వాయ్​ కమాండో మృతి.. కాలువలో పడ్డ 20 గంటల తర్వాత..

author img

By

Published : Mar 11, 2023, 7:51 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్​లో పనిచేసే ఓ ఎస్పీజీ కమాండర్​ ప్రమాదవశాత్తు మృతి చెందారు. విహారయాత్రలో భాగంగా కుటుంబసభ్యులతో బైక్​పై వెళ్లిన కమాండో ఒక్కసారిగా అదుపుతప్పి కాలువలో పడిపోయారు. ఆ ప్రమాదంలో ఆయన భార్య, పిల్లలు సురక్షితంగా బయటపడగా.. కమాండో ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది దాదాపు 20 గంటల తర్వాత ఆయన మృతదేహాన్ని వెలికితీశారు.

modi spg commando
modi spg commando

దేశ ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్​లోని ఓ కమాండో ప్రమాదవశాత్తు మృతి చెందారు. పీఎం కాన్వాయ్​లో విధులు నిర్వర్తించే ఓ ఎస్పీజీ కమాండో కాలువలో పడి మరణించారు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కమాండో కుటుంబసభ్యులతో కలిసి బైక్​పై శిర్డీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. బైక్ అదుపుతప్పి కుటుంబంతో సహా కాలువలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడగా.. ఆ కమాండో మృతి చెందారు. దాదాపు 20 గంటల తర్వాత సహాయక సిబ్బంది కమాండో మృతదేహాన్ని వెలికితీశారు.

మహారాష్ట్ర నాశిక్ జిల్లాలోని సిన్నార్​ ప్రాంతంలోని మెంధీ గ్రామానికి చెందిన గణేశ్ గీతే(36).. 2011లో సీఐఎస్​ఎఫ్​లో చేరారు. ఆ తర్వాత ఎస్పీజీ విభాగానికి ఎంపికై ప్రస్తుతం ప్రధాని మోదీ కాన్వాయ్​లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు గణేశ్ ఫిబ్రవరి 24 నుంచి కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న గణేశ్​ గురువారం తన భార్య, ఏడేళ్ల కుమార్తె, 18 నెలల కుమారుడితో కలిసి ప్రసిద్ధ శిర్డీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి బైక్​పై వెళ్లారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో వారు తిరిగి వస్తుండగా.. ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఓ మలుపు వద్ద వారి బైక్​ అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా గణేశ్​ కుటుంబం బైక్​తో సహా గోదావరి నదిపై నిర్మించిన ఓ డ్యామ్ కాలువలో పడిపోయింది.

వీరిని గమనించిన ఓ స్థానికుడు వెంటనే కాలువలో దూకి.. ఒడ్డుకు దగ్గర్లో ఉన్న గణేశ్​ భార్య, కుమారుడిని బయటకు తీశాడు. అయితే కాలువ మధ్యలో పడిపోయిన గణేశ్​, అతని కుమార్తెను రక్షించడానికి ప్రయత్నించగా.. మొదటగా వారి కుమార్తెను బయటకు తీశారు. అయితే ఆ సమయంలో కాలువ ప్రవాహం అధికంగా ఉన్నందున గణేశ్​ ఆ ప్రవాహ ధాటికి కొట్టుకుపోయారు. వారు ఎంత వెతికినా సరే ఫలితం లేకపోయింది. దీంతో వెంటనే వారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రి దాదా భూసే.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఆ సమయంలో కాస్త ఉద్రిక్తత తలెత్తింది. గ్రామస్థులు మంత్రిని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. మృతదేహం వెలికితీయడంలో ఆలస్యమైందని ఆందోళన చేశారు. దీంతో సహాయక సిబ్బంది ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపి.. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే దాదాపు 20 గంటల తర్వాత ప్రమాద స్థలానికి కిలో మీటరు దూరంలో.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత గణేశ్​ మృతదేహం లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం గణేశ్ ఎస్పీజీ విభాగంలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వరిస్తున్నారని అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.