ETV Bharat / state

ఈరోజు చాలా ‘హాట్‌ అండ్‌ స్పైసీ’ గురూ

author img

By

Published : Jan 16, 2023, 9:58 AM IST

Hot and Spicy
Hot and Spicy

International Hot and Spicy Food Day : చాలా మంది ఫుడీలకు స్వీట్ కంటే హాట్ వంటకాలే ఇష్టం. ముఖ్యంగా తెలుగువాళ్లకైతే మాంచి మసాలా దట్టించి పెట్టిన పదార్థాలంటే మక్కువ ఎక్కువ. అలా మసాలా ఆహార పదార్థాలు ఆరగించే వాళ్లకోసమే ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ డే. ఇది ఇవాళే. మరి ఈ హాట్ అండ్ స్పైసీ రోజున మసాలాల మర్మమేంటో ఓసారి తెలుసుకుందామా..?

International Hot and Spicy Food Day : వేడుక ఏదైనా భారతీయ వంటకాల్లో స్వీట్‌ అండ్‌ హాట్‌ ఉండాల్సిందే. మధుమేహం, ఊబకాయం తదితర కారణాలతో స్వీట్స్‌ను చాలామంది దూరం పెట్టినా హాట్‌ను మాత్రం ఆస్వాదిస్తూ తింటారు. అలా హాట్‌గా ఆరగించే వారికోసం వచ్చిందే ‘ఇంటర్నేషనల్ హాట్ అండ్‌ స్పైసీ ఫుడ్ డే’ జనవరి 16న దీనిని నిర్వహిస్తారు. ఈ డే సందర్భంగా సుగంధ ద్రవ్యాలు.. అందులోని మసాలాల విశేషాలేంటో తెలుసుకోండి మరి.

Story Of Spices : ప్రపంచవ్యాప్తంగా ఏదైనా వంటకంలో కొన్ని రకాల సుగంధ్ర ద్రవ్యాలు దట్టిస్తే దాన్ని ‘హాట్ అండ్‌ స్పైసీ ఫుడ్‌’గా పేర్కొంటారు. అయితే ఇక్కడ ఆహారం విషయంలో హాట్‌ అంటే అసలైన అర్థం వేడి అని కాదు. వంటకంలో ఎంతమేర మిరియాలు వాడారు... అది ఏ స్థాయిలో నషాళానికి అంటుతోంది అనేది ప్రధానం.

ఇక మన దేశం విషయానికి వస్తే మిరియాల తో కాకుండా మిరపకాయలతో చేసిన వంటకాలను హాట్‌ అండ్‌ స్పైసీగా పిలుస్తారు. అటువంటి మిరపను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. కేరళ రాష్ట్రాన్ని ‘స్పైస్‌ ట్రేడ్ హబ్‌’గా పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని సుగంధ ద్రవ్యాలు ఇక్కడ లభిస్తాయి. ఐరోపా, ఇతర దేశాల నుంచి భారతదేశానికి విదేశీయుల రాకపోకలు ప్రారంభమైందే వీటి వర్తకం కోసం.

చరిత్ర పొరల్లో సుగంధాలు.. సుమారు 6 వేల ఏళ్ల క్రితం నుంచి సుగంధ ద్రవ్యాలు వంటల్లో వినియోగిస్తున్నారని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒంట్లోని తాపాన్ని తగ్గించి రోగాలను నయం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే పూర్వీకులు సైతం ఎక్కువగా వాడేవారు. గ్రీకులు సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబర్చారట.

మిరియాలు, దాల్చిన చెక్క తదితర ఉత్పత్తులను విరివిగా వాడారని సమాచారం. కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క, పసుపు, ధనియాలు, పుదీన, మరువం అప్పట్లోనే వినియోగించినట్లు గ్రీకు వైద్యుడు హిప్పోక్రేట్స్‌ తన గ్రంథాల్లో రాశారు. ‘ఫాదర్‌ ఆఫ్‌ బోటనీ’గా పిలిచే తత్వవేత్త థియోఫ్రాస్టస్‌ తాను రచించిన రెండు పుస్తకాల్లో 600 రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాల గురించి ప్రస్తావించారు.

ఇక రోమన్లది మరో వైవిధ్యమైన శైలి. వైన్‌, బామ్‌, ఆయిల్‌ తయారీలో వీరు మసాలాల్ని ఉపయోగించేవారు. కొన్ని రకాల వ్యాధుల నిర్మూలనలో మసాలా దినుసుల్ని ఎక్కువగా వినియోగించారు. ప్రస్తుతం మనం వంటల్లో వాడుతున్న పసుపును ఆయుర్వేద పద్ధతుల్లో వాడి కీళ్ల వాపులు, వికారం, తలనొప్పి తగ్గించడం.. రోగ నిరోధక శక్తి పెంపొందించడం ఆ కాలంలోనే ప్రారంభించారు.

బిర్యానీ

ఏవి.. ఎప్పుడు మొదలు పెట్టారంటే..!

  • క్రీస్తుపూర్వం 400 సంవత్సరంలో వ్యవసాయ పంటల్లో మిరప భాగమైంది.
  • 1-2వ శతాబ్దాల్లో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను ఉపయోగించి రోగాలను నయం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
  • 8వ శతాబ్దంలో బాబిలోన్‌లోని తోటల్లో యాలకలు, పసుపు పండించడం ప్రారంభమైంది.
  • 17వ శతాబ్దం నాటికి మతపరమైన కార్యక్రమాలు, అంత్యక్రియలు, వైద్యం, వ్యాపారం, వంటలు.. ఇలా అన్ని రకాలుగా మసాల దినుసులను వినియోగించారు. అవి మానవుల జీవన విధానంలో ఒక భాగంగా మారాయి.

ఆరోగ్యం.. దీర్ఘాయుష్షు

సుగంధ ద్రవ్యాలు, వాటిలోని మసాలాలు వంటలకు రుచి మాత్రమే కాదు. అవి తీసుకునే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. 2015లో యూఎస్‌, చైనా చేసిన పరిశోధనల్లో వారం మొత్తం స్పైసీ ఫుడ్ తీసుకున్న జనాభాలో మరణాల సంఖ్య 14 శాతం తగ్గిందని తేలింది. మిరపలో అధికంగా ఉండే క్యాప్సియాన్‌ ఔషధం శరీరంలో చేరే క్యాన్సర్‌ కణాలను నిర్మూలిస్తున్నట్లు వెల్లడైంది. ఇక ఆరోగ్యానికి స్పైసీ వంటకాలు చాలా మంచివి. బరువు తగ్గడంలో ఇవి తోడ్పడతాయి. కాబట్టి స్పైసీ ఫుడ్‌ నచ్చని వారంతా దానిని మెచ్చుకుంటూ తినే రోజు ఇదేనని గుర్తుంచుకోండి. హాట్‌ అండ్‌ స్పైసీగా ఆహారాన్ని టేస్ట్‌ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.