ETV Bharat / state

24న విచారణకు రావాలి: బండి సంజయ్‌కు సిట్‌ నోటీసులు

author img

By

Published : Mar 21, 2023, 6:39 PM IST

Updated : Mar 21, 2023, 7:03 PM IST

SIT Notices to Bandi Sanjay: పేపర్‌ లీకేజీ కేసులో ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్‌ అధికారులు.. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కూ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న విచారణకు రావాలన్న అధికారులు.. ఆధారాలుంటే దర్యాప్తులో ఉపయోగపడతాయని నోటీసుల్లో పేర్కొన్నారు.

SIT Notices to Bandi Sanjay
SIT Notices to Bandi Sanjay

SIT Notices to Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దర్యాప్తునకు ఆధారాలు ఉపయోగపడతాయని బండి సంజయ్‌కు ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్‌ నెంబర్ 3లో ఉన్న బండి సంజయ్ నివాసంలో నోటీసులు ఇచ్చారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 50 మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు దాటాయని బండి సంజయ్ ఇటీవల ఆరోపించారు. ఈ విషయంలో సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి.. 24వ తేదీన హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ ఆరోపణలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ముమ్మరంగా దర్యాప్తు..: ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి సిట్‌ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల 6 రోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే నాలుగు రోజుల పాటు విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించారు. దర్యాప్తులో భాగంగా నేడు ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజశేఖర్‌రెడ్డి నివాసంలో తనిఖీలు జరపగా.. మరికొన్ని పరీక్ష పత్రాల ప్రతులు దొరికినట్లు సమాచారం. మరోవైపు పరీక్ష రాసిన గోపాల్, నీలేశ్‌ ఇద్దరికీ నీలేశ్‌ సోదరుడు రాజేంద్ర నాయక్ డబ్బులు సమకూర్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మేడ్చల్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కేతావత్ శ్రీనివాస్ ద్వారా మరికొంత నగదు ఇప్పించారని గుర్తించినట్లు సమాచారం. నీలేష్, గోపాల్ అసిస్టెంట్‌ ఇంజినీర్ పరీక్ష రాయగా.. పేపర్ ఇచ్చినందుకు రూ.14 లక్షలు సమకూర్చినట్లు తేల్చారు.

మరోవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి 3 వారాల్లో స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలంది.

ఇవీ చూడండి..

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని పరీక్ష పత్రాల ప్రతులు..!

పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Last Updated : Mar 21, 2023, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.