ETV Bharat / state

రూ.60 కోట్లు చాలు.. రూ.20కే శంషాబాద్ విమానాశ్రయానికి..!

author img

By

Published : Dec 4, 2022, 11:54 AM IST

Updated : Dec 4, 2022, 1:08 PM IST

MMTS trains
MMTS trains

శంషాబాద్ ఎయిర్​పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే విమానాశ్రయం నుంచి అన్ని వేళ్లలో సరైన రవాణా సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఉందానగర్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ విస్తరించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి రూ.20తో విమానాశ్రయానికి చేరుకోవచ్చు.

శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు బాగా పెరిగాయి. ప్రయాణికుల సంఖ్యను ఊహించే ఎంఎంటీఎస్‌ రైళ్లను విమానాశ్రయానికి నడపాలని నిర్ణయించారు. 2014లో ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రారంభమైంది. అయితే విమానాశ్రయ నిర్వాహకులు ఎయిర్‌పోర్టు వరకూ అనుమతించకపోవడంతో ఉందానగర్‌ వరకే పరిమితమైంది. ఇలా విమానాశ్రయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఎంఎంటీఎస్‌ ఆగిపోయింది.

మెట్రో కంటే తక్కువ ఖర్చుతో..: రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో మార్గం నిర్మించడానికి రూ. 6వేల కోట్ల అంచనాతో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ కారిడార్‌ను కలుపుతూ జరుగుతున్న ఈ నిర్మాణాన్ని ఆహ్వానించదగ్గదే. అయితే ఎంఎంటీఎస్‌ రెండోదశకు ఉన్న అవాంతరాలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. కేవలం రూ. 60 కోట్లు వెచ్చిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ రెండోదశ కింద రైల్వే లైన్లు వేయడానికి వీలవుతుంది. స్టేషన్ల నిర్మాణాలు.. ఇతరత్రా అన్నీ కలిపితే రూ.100 కోట్లు వెచ్చిస్తే చాలు. అప్పుడు రూ.20 తో నగరం నుంచి విమానాశ్రయానికి రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని జంటనగరాల సబర్బన్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి నూర్‌ మహ్మద్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

రవాణా భారం తగ్గుతుంది: విమానాశ్రయం నుంచి అన్నివేళల్లో సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో క్యాబ్‌ సర్వీస్‌లకు రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు రవాణా భారం తగ్గుతుంది. ఎయిర్‌పోర్టులో పని చేసే వేలాది మంది ఉద్యోగులకు కూడా ఉపశమనం లభిస్తుందని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘం ప్రధానకార్యదర్శి చందు తెలిపారు. కేవలం 6 కిలోమీటర్లు పొడిగిస్తే విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌లో వెళ్లడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి: డాక్టర్‌ కావాలనుకున్నా.. కానీ నాన్న చెప్పిన ఆ మాటలతో..!

రైలు పట్టాలపై ఇన్​స్టా రీల్స్.. చెవుల్లో ఇయర్​ఫోన్స్.. ట్రైన్ వచ్చి నేరుగా..

Last Updated :Dec 4, 2022, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.