ETV Bharat / state

డాక్టర్‌ కావాలనుకున్నా.. కానీ నాన్న చెప్పిన ఆ మాటలతో..!

author img

By

Published : Dec 4, 2022, 10:45 AM IST

హైదరాబాద్​లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించిన 'ఉమెన్​ ఇన్​ మెడిసిన్​' సదస్సుకు మంత్రి కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చదువుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని మంత్రి కేటీఆర్​ పంచుకున్నారు. అమ్మ కోరిక ప్రకారం తాను డాక్టర్​ కావాలనుకున్నానని.. కానీ నాన్న చెప్పిన మాటలతో బయో టెక్నాలజీ వైపు వెళ్లానని ఆయన తెలిపారు.

డాక్టర్‌ కావాలనుకున్నా.. నాన్న చెప్పిన మాటలతో  విరమించుకున్నా..!
డాక్టర్‌ కావాలనుకున్నా.. నాన్న చెప్పిన మాటలతో  విరమించుకున్నా..!

‘‘వైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది. కష్టకాలంలో వైద్యులు పని చేసే విధానం చూస్తే గర్వంగా ఉంటుంది. మా అమ్మ కోరిక ప్రకారం డాక్టర్‌ కావాలనుకున్నా. అప్పట్లో ఎంసెట్‌ రాస్తే 1,600వ ర్యాంకు రావడంతో ఇక్కడ మెడిసిన్‌ సీటు రాలేదు. కర్ణాటకలో ప్రవేశపరీక్ష రాస్తే వచ్చింది. వైద్య వృత్తిలో డిగ్రీ, పీజీ చదివి.. సూపర్‌ స్పెషాలిటీ కోర్సు చేసి జీవితంలో స్థిరపడాలంటే వయసు 32కు చేరుతుంది. డాక్టరైన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో, అర్ధరాత్రిళ్లు పని చేయాల్సి ఉంటుంది. ‘జీవితం, పనిని సమన్వయం చేసుకోగలవా..’ అని నాన్న అనడంతో నాలో ఆలోచన రేకెత్తింది. దీంతో బయోటెక్నాలజీ వైపు వెళ్లాను’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహించిన ‘ఉమెన్‌ ఇన్‌ మెడిసిన్‌’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

హెల్త్‌కేర్‌, లైఫ్‌సైన్సెస్‌లోనే కాదు.. పరిశోధన రంగాల్లోనూ నేడు మహిళలు రాణిస్తున్నారన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థలకు సుచిత్ర ఎల్ల(భారత్‌ బయోటెక్‌), మహిమా దాట్ల(బయోలాజికల్‌-ఇ) నాయకత్వం వహిస్తున్నారని ఉదహరించారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా వర్కింగ్‌ ఉమెన్‌ ఉన్న రాష్ట్రం తెలంగాణయేనని పేర్కొన్నారు.

'ఉమెన్​ ఇన్​ మెడిసిన్​' సదస్సులో మంత్రి కేటీఆర్
'ఉమెన్​ ఇన్​ మెడిసిన్​' సదస్సులో మంత్రి కేటీఆర్

మహిళల కోసం విశ్వవిద్యాలయం, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు వీహబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ‘‘హెల్త్‌కేర్‌ రంగంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. టెక్నాలజీ, లైఫ్‌సైన్సెస్‌కు హైదరాబాద్‌ హబ్‌గా మారింది. రాష్ట్రంలో 40 లక్షల మంది ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫెల్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిరిసిల్ల జిల్లాలో వివరాలు సేకరించగా ఎక్కువ మందిలో క్యాన్సర్‌ లక్షణాలున్నట్లు తేలింది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ నిర్మించనున్న ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్‌ చికిత్స విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నాం. ములుగు జిల్లాలోని ప్రజల్లో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు బయటపడ్డాయి. కొవిడ్‌ సమయంలో హైదరాబాద్‌ నగరంలోని చాలా ఆసుపత్రులు రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినా.. ఏఐజీ మాత్రం రోగుల చికిత్సలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ధరలకే సేవలందించడం గొప్ప విషయం. ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, ఇతర వైద్యులకు అభినందనలు’’ అని కేటీఆర్‌ అన్నారు.

సూపర్‌ స్పెషాలిటీ సేవల్లో మహిళా భాగస్వామ్యం పెరగాలి: వైద్య రంగంలోకి వస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి అన్నారు. ఎంబీబీఎస్‌లో 65-70 శాతం మంది మహిళలుండగా పీజీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో 15-20 శాతానికి మించి లేరని తెలిపారు. దేశవ్యాప్తంగా 2,500 మంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు ఉండగా.. అందులో 123 మంది మాత్రమే మహిళలున్నారని చెప్పారు.

వేయి మంది ఎండోస్కోపీ నిపుణుల్లో ఇద్దరే మహిళలున్నారన్నారు. పీజీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు పూర్తిచేసే దిశగా మహిళలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజీ, థోరాసిక్‌ సర్జరీ లాంటి విభాగాల్లో మహిళా వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.సీ.మల్లికార్జున్‌, ఫెర్నాండెజ్‌ హాస్పిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏవిటా ఫెర్నాండెజ్‌, స్టార్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం పాల్గొన్నారు. అనంతరం ఐఏఎస్‌ అధికారిణి శాంతికుమారి, సినీ నటి అక్కినేని అమల, ఐపీఎస్‌ అధికారిణి షికా గోయల్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తదితరులతో డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.