ETV Bharat / state

దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఆర్మీ

author img

By

Published : Mar 26, 2023, 10:20 AM IST

CIT investigation of data theft case: దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల వద్ద రక్షణ రంగానికి చెందిన ఉద్యోగుల సమాచారం లభించడం.. ఈ పరిణామం జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉండటంతో సైనిక అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఈ మేరకు సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులతో ఆర్మీ అధికారులు భేటీ అయ్యారు.

Data theft case
Data theft case

CIT investigation of data theft case: రక్షణ రంగానికి చెందిన ఉద్యోగుల డేటా చోరీపై సైనిక అధికారులు స్పందించారు. ఇప్పటికే 2.55 లక్షల మంది రక్షణ ఉద్యోగుల డేటా ఈ కేసులో అరెస్టయిన నిందితుల వద్ద పోలీసులు గుర్తించారు. ఉద్యోగుల పేరు, ఐడీ, ఏ దళంలో పని చేస్తున్నారు. వారి హోదా, పని చేసే ప్రాంతం వంటి వివరాలున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన రక్షణశాఖ అధికారులు.. సైబరాబాద్‌ పోలీసులతో వివిధ అంశాలపై చర్చించారు.

ఉద్యోగులకు సంబంధించిన డేటాను స్వాధీనం చేసుకున్నారు. డేటా ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని అంతర్గతంగా విచారించడానికి సైనిక అధికారులు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత డేటా చోరీ కేసులో మరింత లోతుగా సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, సామాజిక మాధ్యమాలు, వివిధ బోర్డులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. అరెస్టయిన ఏడుగురు నిందితులు తమ వద్ద ఉన్న డేటాను 138 విభాగాలుగా విభజించి విక్రయించారు.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డు డేటా ఎలా వచ్చింది: పాన్‌కార్డు కలిగిన వ్యక్తుల సమాచారాన్ని ఒక్కో విభాగంగా విభజించారు. జస్ట్‌ డయిల్‌లో డేటా ప్రొవైడర్ల పేరిట పేరు నమోదు చేసుకుని తమను సంప్రదించిన వారికి డేటా విక్రయిస్తున్నారు. ఫేస్‌బుక్‌, నీట్‌, సీబీఎస్‌ఈ, పలు బ్యాంకుల ఖాతాదారులు, సీనియర్‌ సిటిజన్లు, నెట్‌ఫ్లిక్స్‌, ఫ్లిప్‌కార్టు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాన్‌ కార్డు దారుల సమాచారాన్ని ప్రత్యేక విభాగాలుగా విభజించారు. డేటా చోరీకి మూలాధారమైన వ్యవస్థలను గుర్తించేందుకు సిట్‌ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనుంది.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డు డేటా, ఇతర వినియోగదారుల సమాచారం ఎలా బయటకు వచ్చింది. ప్రైవేటు సంస్థలు డేటా నిల్వ చేస్తున్న విధానం, ఎవరైనా హ్యాక్‌ చేశారా, డబ్బుల కోసం బయట వ్యక్తులకు విక్రయిస్తున్నారా వంటి పలు కోణాల్లో విచారణ జరపనున్నారు. నిందితులు డేటా పొందిన జస్ట్‌ డయల్‌ను కేసులో భాగంగా విచారించనున్నారు. నిందితులు కోట్ల మంది వ్యక్తిగత డేటా ఎలా పొందారు అనే కోణంలో సిట్‌ ఆరా తీస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో జియా ఉర్‌ రెహ్మాన్‌ మిగిలిన ఆరుగురికి డేటా విక్రయించాడు. మిగిలిన నిందితులు కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన జియాను పోలీసులు విచారణలో ప్రశ్నించగా ముంబయికి చెందిన వ్యక్తి నుంచి డాటా కొనుగోలు చేసినట్లు సమాచారం.

ముంబయి సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని దర్యాప్తు చేసి మరింత మందిని కేసులో నిందితులుగా చేర్చే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల నుంచి సేకరించిన డేటాను తెలంగాణ రాష్ట్ర పోలీసు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ ద్వారా విశ్లేషిస్తున్నారు. నిందితుల వద్ద ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజల డేటా ఉన్నట్టు సిట్‌ గుర్తించింది.

data theft case update: బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్‌ ఖాతాదారులకు సంబంధించి హైదరాబాద్‌, తెలంగాణలోని కొన్ని జిల్లాల ప్రజల డేటా ఉన్నట్టు తేలింది. నగర వాసుల డేటాకు సంబంధించి జంట నగరాలకు సంబంధించి ఒక వ్యక్తి ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. మొత్తం మీద ఈ కేసును సిట్‌ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ఇవీ చదవండి:

అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా.. ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

మీ డేటా బహిర్గతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలేంటీ?

విషాదం... ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.