ETV Bharat / state

'ఎఫ్‌ఐఆర్‌లో వివరాలు.. సీఎం వెల్లడించినవి ఒక్కటేనా?'

author img

By

Published : Dec 10, 2022, 8:14 AM IST

MLAs Poaching Case Update
MLAs Poaching Case Update

MLAs Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీ, తుషార్‌ వెల్లాపల్లి, భాజపా దాఖలు చేసిన పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అంశాలనే సీఎం వెల్లడించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించగా.. అందుకు ఆధారాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

MLAs Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అంశాలనే ముఖ్యమంత్రి వెల్లడించారని చెప్పడానికి ఆధారాలేమిటని పిటిషనర్లను శుక్రవారం హైకోర్టు ప్రశ్నించింది. కేసు వివరాలు, సీఎం వెల్లడించినవి ఒక్కటేనా? అని అడిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఒక్కటేననగా.. ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే ఇచ్చి ఉండవచ్చు కదా అని ప్రశ్నించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీ, తుషార్‌ వెల్లాపల్లి, భాజపా దాఖలు చేసిన పిటిషన్‌లపై శుక్రవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. శుక్రవారం తుషార్‌తో పాటు ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈ నెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు.

MLAs Poaching Case Latest News : తుషార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌.డి.సంజయ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘వీడియోలను తారుమారు చేసి వారికి అనుకూలంగా ఉన్నదే విడుదల చేశారు. సీఎం మీడియా సమావేశంతో మీడియా ట్రయల్‌ ప్రారంభమైంది. తుషార్‌ సహా పలువురిని నిందితులుగా పేర్కొంటూ కథనాలు వెలువడ్డాయి. సీఎం తుషార్‌ పేరును వెల్లడించారు. ఆ తరువాతే సిట్‌.. 41ఏ కింద నోటీసు జారీ చేసి, నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేసింది. దీన్నిబట్టి సీఎం సూచనల ఆధారంగానే దర్యాప్తు జరుగుతోందని అర్థమవుతోంది. దర్యాప్తు సంస్థ వద్ద ఉన్న ఆధారాలు సీఎం, తెరాస అధ్యక్షుడి వద్దకు ఎలా వెళతాయి? జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న లక్ష్యంతో ఇతర పార్టీలను లక్ష్యంగా చేసుకుని అరెస్ట్‌ చేయించాలన్న ప్రయత్నం జరుగుతోంది. సిట్‌ బృందంలో ఒకరు మినహా అందరూ ఐపీఎస్‌ అధికారులే. వీరి పోస్టింగ్‌లు, పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి. ఇలాంటి వారు నిష్పాక్షిక దర్యాప్తు చేస్తారని ఆశించలేం. ఫిర్యాదుదారు రోహిత్‌రెడ్డిపై పలు కేసులున్నాయి. అన్ని ఆధారాలను పరిశీలిస్తే నిష్పాక్షిక దర్యాప్తు జరగడం లేదని తెలుస్తోంది. అందుకోసమే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.

రుజువుకాని ఆధారాలతో మీడియా సమావేశం..: ‘టేప్‌ రికార్డర్‌ వంటి రుజువుకాని ఆధారాలతో పోలీసు కమిషనర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి వారివల్ల పారదర్శక దర్యాప్తును ఆశించగలమా?’ అని ముగ్గురి నిందితుల తరఫు సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ నివేదించారు. ‘‘ఎవరికీ డబ్బు ఇవ్వలేదు. డబ్బు దొరకలేదు. దాడులకు సంబంధించి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సమావేశంలో 7 నుంచి 8 మంది పాల్గొన్నారు. టేప్‌ రికార్డర్‌లో ఎవరెవరు మాట్లాడారు? ఏం మాట్లాడారో తెలియదు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో ధ్రువీకరించుకోలేదు. రుజువుకాని ఆధారాలతో పోలీసులు ఓ నిర్ణయానికి రాకూడదు. నిందితులను అప్రతిష్ఠపాలు చేసేలా మీడియా సమావేశం నిర్వహించారు. దర్యాప్తు పూర్తికాకముందే మీడియాకు సమాచారం ఇవ్వరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసు కమిషనర్‌ మీడియా సమావేశం నిర్వహించారనడానికి ఆధారాలు సమర్పిస్తాం. దీన్ని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు ఖండించడం లేదు. అభియోగాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇలాంటి కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలి. కానీ ఏకంగా అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతానికి బెయిలుపై ఉన్నాం. సాక్ష్యాలన్నీ ముఖ్యమంత్రికి చేరాయి. అక్కడి నుంచి సీజేెఐ, హైకోర్టు సీజేలకు వెళ్లాయి. ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే క్షమాపణ కోరారు. కేసును రాజకీయం చేయాలన్న దృఢ నిశ్చయంతో సీఎంకు సమాచారం ఇచ్చారు. వీటన్నింటినీ చూస్తే రాజకీయ నియంత్రణలో దర్యాప్తు కొనసాగుతోంది. సీబీఐతో కాకపోయినా హైకోర్టు ఎంపిక చేసిన అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేయండి’’ అని నివేదించారు.

రామచంద్రభారతి విడుదల.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో గురువారం ఉదయం బెయిల్‌పై విడుదలైన వెంటనే మరో కేసులో రామచంద్రభారతి అరెస్టయిన విషయం తెలిసిందే. ఇతడిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులోనూ బెయిల్‌ లభించడంతో శుక్రవారం ఆయనను అధికారులు విడుదల చేశారు.

నందకుమార్‌ కస్టడీ కోరుతూ పిటిషన్‌..: కోరె నందకుమార్‌ అలియాస్‌ నందును హైదరాబాద్‌ ఫిలింనగర్‌ రోడ్‌ నంబరు 1లోని డెక్కన్‌ కిచెన్స్‌తో పాటు ఇతర వ్యాపార సముదాయాల స్థలం లీజు వ్యవహారంలో విచారణకు 5 రోజుల కస్టడీ కోరుతూ బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బెయిల్‌పై విడుదలైన నందకుమార్‌.. స్థలాల లీజు, బెదిరింపుల కేసుల్లో మరోసారి అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఇవీ చూడండి..

'కేసీఆర్ సర్కార్​పై యుద్ధం ప్రారంభించాం.. ఏడాదిలో బీజేపీని అధికారంలోకి తెస్తాం'

కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోంది: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.