ETV Bharat / state

కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చడానికే కేసీఆర్‌ను బీజేపీ వాడుకుంటోంది: రేవంత్

author img

By

Published : Dec 9, 2022, 7:31 PM IST

Updated : Dec 9, 2022, 10:36 PM IST

Revanth reddy fires on BJP and BRS: టీఆర్​ఎస్ బంగారు కూలీ వసూళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం.. బీఆర్‌ఎస్‌గా పేరు మార్పునకు ఆమోదముద్ర ఎలా వేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రమేయం లేకుండా... దిల్లీ హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే పేరు మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. గుజరాత్‌ ఎన్నికల మాదిరి వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేకూర్చేందుకే బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ తెరపైకి తెచ్చారని విమర్శించారు.

Revanth reddy
Revanth reddy

Revanth reddy fires on BJP and BRS: వైఎస్​ఆర్ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌... రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేందుకు యత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందుకనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను... కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఖండించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని... హైదరాబాద్‌ బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

డిసెంబర్‌ 9 తెలంగాణ ప్రజలకు బ్లాక్‌డేగా... కేసీఆర్‌ మార్చారంటూ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శిబిరంలో రక్తదానం చేసిన 1065మందికి రేవంత్‌ రెడ్డి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో.. స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి కేక్‌ను కట్‌ చేసి సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కేసులు పెండింగ్‌లో ఉంటే ఈసీ పేరు ఎలా మారుస్తుంది.. టీఆర్​ఎస్ బంగారు కూలీ పేరున చేసిన వసూళ్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి తాను చేసిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే సీఈసీ ఎలా బీఆర్‌ఎస్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తుందని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఇదే అంశంపై దిల్లీ హైకోర్టులో తాను దావా వేయగా 2018లోనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా టీఆర్​ఎస్ పేరు మార్చడానికి వీలు లేదని తాను మళ్లీ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు నోటీసు ఇవ్వగానే ఆగమేఘాల మీద ఎన్నికల సంఘం పార్టీ పేరు మారుస్తూ లేఖ పంపిందని ఆరోపించారు. వచ్చే సోమవారం కేసు విచారణకు వస్తుందన్న భయంతోనే ఇలా చేశారని ధ్వజమెత్తారు.

మూడో మిత్రుడిగా కేసీఆర్‌ చేరారు.. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో బీఆర్ఎస్‌ను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీకి ఆప్, ఎంఐఎంలు సహకరిస్తుండగా తాజాగా మూడో మిత్రుడు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో చేరారని విమర్శించారు. ఆప్, ఎంఐఎంలు ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతుండగా.. వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో ఓట్లు చీల్చేందుకు బీఆర్‌ఎస్‌ను వాడుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంతో ఉన్న పేగు బంధం తెగిపోయింది.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎ​స్‌గా పేరు మార్చుకోవడంతో కేసీఆర్‌కు తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని రేవంత్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలతోకాని, తెలంగాణ రాష్ట్రం పేరుతో కాని ఎలాంటి బంధం లేకుండా పోయిందని విమర్శించారు. దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన సీబీఐ విచారణ చేయడం లేదని.. ఆమె నుంచి వివరణ తీసుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అందరిని దిల్లీకి పిలిపించి కఠినంగా విచారణ చేసిన సీబీఐ.. కవిత విషయంలో ఎందుకు మోకరిల్లుతున్నారని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 9, 2022, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.