ETV Bharat / state

"పోలవరం ఆకృతుల విషయంలో నిర్ణయం.. అప్పుడే తీసుకుంటాం"

author img

By

Published : Jan 8, 2022, 9:15 AM IST

Polavaram Structure
పోలవరం ఆకృతుల విషయం

Polavaram Structure: పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు సంబంధించిన అంశాల్లో.. డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సభ్యులంతా వచ్చి చూసిన తర్వాతే.. నిర్ణయం తీసుకుంటామని ఆ కమిటీ ఛైర్మన్‌ పాండ్యా తెలిపారు. డ్రిప్‌ కమిటీ పర్యటనలో భాగంగా పోలవరం సందర్శించిన పాండ్యా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే లో హైడ్రాలిక్‌ సిలిండర్లు ఎలా పని చేస్తున్నాయో చూశారు.

Polavaram structure: పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు సంబంధించిన అంశాల్లో డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) సభ్యులంతా వచ్చి చూసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఆ కమిటీ ఛైర్మన్‌ పాండ్యా స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం విశ్రాంత ఛైర్మన్‌, డీడీఆర్‌పీ ఛైర్మన్‌ పాండ్యా శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. షెడ్యూల్‌ మేరకు డీడీఆర్‌పీ సమావేశం శుక్ర, శనివారాల్లో పోలవరంలో నిర్వహించాల్సి ఉంది. కానీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశం వాయిదా పడింది.

డ్రిప్‌ కమిటీ పర్యటనలో భాగంగా శ్రీశైలం, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి సందర్శించిన పాండ్యా.. శుక్రవారం పోలవరం వెళ్లారు. ఉదయం నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే లో హైడ్రాలిక్‌ సిలిండర్లు ఎలా పని చేస్తున్నాయో చూశారు. ఇందుకోసం కొద్ది సేపు గేట్లు నిర్వహించి కొంత మేర గేట్లు ఎత్తి చూపించారు.

ప్రధాన రాతి, మట్టి కట్ట నిర్మాణంలో భాగంగా నీళ్లు లేకుండా, ఇసుక కోత లేకుండా ఉన్న ప్రాంతంలో పనులు చేసుకుంటామని పోలవరం అధికారులు చెప్పారు. పూర్తి స్థాయి కమిటీ సభ్యులు, ఐఐటీ ప్రొఫెసర్లు, భార్గవ, హండా వంటి నిపుణుల ఆధ్వర్యంలో పనులు పరిశీలించి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ట్రునియన్‌ గడ్డర్ల తనిఖీకి సంబంధించిన మెథడాలజీని ఖరారు చేశామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులను పరిశీలించారు. త్వరలోనే డీడీఆర్‌పీ సమావేశం ఏర్పాటు చేస్తామని పాండ్యా వెల్లడించారు. ఆయన వెంట ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, పోలవరం చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, సలహాదారు గిరిధర్‌రెడ్డి, ఎస్‌ఈ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: srisailam dam : శ్రీశైలం ప్లంజ్ పూల్ పనులకు ఉత్త చేయేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.