ETV Bharat / state

'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు'

author img

By

Published : May 28, 2022, 5:37 PM IST

"తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు"
"తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు"

Kishan Reddy on KCR: కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు కచ్చితంగా తెరాస పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

"తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. దానిని ఎవరూ అడ్డుకోలేరు"

Kishan Reddy on KCR: రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​ ముషీరాబాద్​లోని ఆర్యవైశ్య భవనంలో భాజపా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా ఆవిర్భవించిందని.. 8 ఏళ్ల మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం లేదని కిషన్​రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రజలు కచ్చితంగా తెరాసకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ మార్పును కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు అడ్డుకోలేరన్నారు. సూర్యుడిపై ఉమ్మేసిన చందంగా తెరాస మంత్రులు వ్యవహరిస్తున్నారని కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్​ను సమస్యలకు కేంద్రంగా ఈ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. ఆదాయ వనరులుగా ఉన్న హైదరాబాద్​లోని పేద ప్రజల నివాస ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పరిపాలన కొనసాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని భాజపా నేతలకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా నాయకుడు శ్యాంసుందర్ గౌడ్, కార్పొరేటర్ రవి చారి, తదితరులు పాల్గొన్నారు.

"రాష్ట్రం దివాలా దిశగా సాగుతోంది. హైదరాబాద్​లో పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి 80 శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యం. జీహెచ్ఎంసీ, జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారు. 8 ఏళ్ల మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది." -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.