ETV Bharat / state

MLA Tickets Fight in BRS : 'నువ్వా నేనా'.. టికెట్ల కోసం బీఆర్ఎస్‌లో పోటీ..!

author img

By

Published : Jun 23, 2023, 8:52 AM IST

Tickets Fight in BRS : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేయడంతో.. నేతల ప్రయత్నాలు కూడా అదే స్థాయికి చేరాయి. సిట్టింగ్‌లకు ప్రాధాన్యమిస్తామంటూనే.. అవసరమైన చోట మార్చక తప్పదని గులాబీ దళపతి సంకేతాలు ఇవ్వడంతో.. నాయకుల్లో హడావిడి పెరిగింది. 20 నుంచి 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చడం ఖాయమంటూ పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్, కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు శాసనసభ్యులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని మిగతా ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగానికిపైగా నియోజకవర్గాల్లో నాయకులు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

brs
brs

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం ముమ్మర కసరత్తు

Competition for MLA Tickets in BRS : ఎన్నికలకు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన అధికార పార్టీలో.. టికెట్ల సందడి జోరుగా సాగుతోంది. సిట్టింగ్‌ శాసనసభ్యులకే మళ్లీ ఎక్కువ శాతం టికెట్లు ఇస్తామన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. పనితీరు సరిగా లేని వారిని మార్చక తప్పదని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మళ్లీ టికెట్ తమకేనని ప్రస్తుత శాసనసభ్యులు ఆశిస్తుండగా.. ఈసారి తమకే అవకాశమంటూ మిగతా ఆశావహులు ప్రచారం చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023 : దాదాపు ఏడాది నుంచే పలు నియోజకవర్గాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.. టికెట్ ఖాయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ముమ్మరం చేయడంతో కేసీఆర్, కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తమ బలాన్ని ప్రదర్శిస్తూ... అనుకూల అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూనే.. మరోవైపు పార్టీలో ప్రత్యర్థుల బలహీనతలను, లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సిద్ధమేనంటూ కొందరు పరోక్ష హెచ్చరికలను పంపిస్తున్నారు.

నువ్వా నేనా అనే విధంగా : గ్రేటర్ హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో.. బీఆర్ఎస్ నేతల మధ్య విబేధాలు కొన్నిసార్లు బహిరంగంగానే బయటపడ్డాయి. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు వర్గాలుగా ఏర్పడి బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పోటా పోటీగా నువ్వా నేనా అనే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ క్యాడర్ కూడా ఇక్కడ రెండు వైపులా చీలిపోయారు.

BRS Focus on Telangana Assembly Elections : ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి.. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మధ్య పోటీ కొన్ని సందర్భాల్లో శృతిమించి కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. గతంలో పోటీ చేసిన రామ్మోహన్ గౌడ్ కూడా వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తున్నారు. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బదులుగా తనకు లేదా తన కోడలికి ఇవ్వాలని.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

BRS Party Latest News : రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ మళ్లీ పోటీకి సిద్ధం అవుతుండగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. మహేశ్వరం లేదా రాజేంద్రనగర్‌లో తనకు అవకాశం ఇవ్వాలని ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ హ్యాట్రిపై ధీమాతో ఉండగా.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బండి రమేష్ కోరుతున్నారు.

వికారాబాద్‌లో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య భగ్గు మంటోంది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంబర్‌పేటలో గత ఎన్నికల్లో బీజేపీ నేత కిషన్‌రెడ్డిపై గెలిచిన న్యాయవాది కాలేరు వెంకటేశ్‌ పోటీకి మళ్లీ ఏర్పాట్లు చేసుకుంటుండగా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్నారు. ముషీరాబాద్‌లో తనకు లేదా తన కుమారుడు జైసింహాకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరుతుండగా.. దివంగత మంత్రి నాయని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎం.ఎన్.శ్రీనివాస్ కూడా ఆశతో ఉన్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు సాయన్న అకాల మరణంతో.. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కుమార్తె లాస్య నందిత కోరుతుండగా.. రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థ ఛైర్మన్ క్రిశాంక్, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పూర్తి ధీమాతో ఉండగా.. డీసీసీబీ ఛైర్మన్ బి.మనోహర్‌ రెడ్డి పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు.. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన క్యామ మల్లేశ్‌ కూడా ఆశిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు.. మళ్లీ తనకే టికెట్ అని ధీమాతో ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా అదే ఆశతో ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోస్థానం నుంచి పోటీ చేస్తే.. అక్కడి నుంచి బరిలోకి దిగాలని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత ఆశిస్తున్నారు. మంచిర్యాలలో తనను కొనసాగించాలని లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ప్రస్తుత శాసనసభ్యుడు దివాకర్ రావు కోరుతుండగా.. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, భారత జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Competition for MLA Tickets in BRS : ఖానాపూర్‌లో రేఖా నాయక్ ధీమాతో ఉండగా.. జడ్పీ మాజీ ఛైర్మన్ జనార్దన్ రాఠోడ్‌.. భూక్యా నాయక్ పోటీ పడుతున్నారు. బోథ్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపూరావుతోపాటు మాజీ ఎంపీ నగేశ్‌, జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్ ప్రయత్నిస్తున్నారు. ముథోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితోపాటు.. వేణుగోపాల్ ఆశిస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి మూడో సారి తనకే టికెట్ అంటుండగా.. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు ప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్‌తోపాటు అవకాశం వస్తే బరిలోకి దిగేందుకు ఎమ్మెల్సీ ఎల్.రమణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం కోర్టులో కొనసాగుతున్నందున.. ఈసారి తాను రంగంలోకి దిగబోతున్నట్లు చల్మెడ లక్ష్మీనారాయణ చెప్పుకుంటున్నారు. రెండేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరిన చల్మెడ వేములవాడ నియోజకవర్గంలో తరచూ పర్యటనలు, ప్రచారం చేసుకుంటున్నారు.

మానకొండూరు టికెట్ రేసులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు.. ఆరెపల్లి మోహన్ కూడా పోటీలో ఉన్నారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. మళ్లీ అవకాశం వస్తుందేమోనని ఉపఎన్నికల్లో ఈటెల రాజేందర్‌పై పోటీ చేసిన రాష్ట్ర పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆశతో ఉన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో : ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్‌ రాజకీయం ఆసక్తిగా ఉంది. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భరత్ టికెట్‌పై ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి తనకు ఇవ్వాలంటున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి.. ఒకవేళ బీసీకే ఇవ్వాల్సి వస్తే.. మన్నె రంజిత్ యాదవ్‌కు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ మామ, భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా అక్కడ టికెట్ ఆశిస్తూ... కేసీఆర్ ఫౌండేషన్ పేరుతో గ్రామాల్లో జోరుగా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఉపఎన్నికతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన మునుగోడు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ హాట్‌గానే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మునుగోడుపై సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోపాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కన్నేశారు. నకిరేకల్‌లోనూ పోటాపోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టికెట్ తనకు ఖాయమంటుండగా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తన బలప్రదర్శన చేస్తున్నారు. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తోపాటు.. సీనియర్ నాయకుడు చందర్‌రావు ఆశిస్తున్నారు. మరోవైపు విజిలెన్స్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న అమరగాని కృష్ణయ్య.. ఫౌండేషన్ పేరుతో కార్యక్రమాలు చేస్తూ పార్టీ పెద్దలను కలిసి టికెట్ కోరుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనీసం రెండు, మూడుస్థానాల్లో కచ్చితంగా మార్పు ఉంటుందన్న ఆశతో పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మళ్లీ ఆశిస్తుండగా.. తనకు లేదా తన కుమార్తెకు ఇవ్వాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కోరుతున్నారు. జనగామలో కూడా వివాదాలకు కేరాఫ్‌గా ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మళ్లీ ఆశిస్తుండగా.. ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా దృష్టి పెట్టారు.

డోర్నకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తోపాటు పాటు మంత్రి సత్యవతి రాఠోడ్ కూడా దృష్టి పెట్టారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తోపాటు.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి ప్రయత్నిస్తున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన గండ్ర వెంకటరమణరెడ్డి పూర్తి ధీమాతో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతుండగా.. తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కోరుతున్నారు.

BRS Party Latest News : కొత్తగూడెంపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు.. జలగం వెంకటరావు, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి, ప్రజారోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు ఆశతో ఉన్నారు. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొంది. వైరాలో రాములు నాయక్‌తోపాటు.. మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌ , చంద్రావతి ఆశిస్తున్నారు.

Competition for MLA Tickets in BRS : మెదక్‌లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి పోటీగా.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో వయసు కారణంగా మదన్‌రెడ్డిని మారిస్తే.. అక్కడ పోటీ చేయాలని మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఆశిస్తున్నట్లు సమాచారం. జహీరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిణ్‌రావుతోపాటు.. ఎర్రోళ్ల శ్రీనివాస్, వసంత్ లైన్‌లో ఉన్నారు.

Telangana Assembly Elections 2023 : ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకరిద్దరు తప్ప.. ఎక్కువగా సిట్టింగ్‌లకే దక్కే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత శాసనసభ్యులు, ఆశావహులు అఖరి అస్త్రాలను బయటకు తీస్తున్నారు. కొందరు అధిష్ఠానం వద్ద శరణు వేడుకుంటుండగా.. మరికొందరు తాడో పేడో తేల్చుకుంటామంటూ పరోక్ష ఆల్టిమేట్టం ఇస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం అన్ని అంశాలను పరిశీలిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బలాబలాలతోపాటు.. మిగతా ఆశావహుల సామర్థ్యం, విజయావకాశాలపై వివిధ పలు సర్వేలను చేయిస్తోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.