కడియం శ్రీహరి, రాజయ్య మధ్య భగ్గుమన్న వర్గపోరు.. బహిరంగంగానే విమర్శలు

author img

By

Published : Aug 30, 2022, 5:20 PM IST

Updated : Aug 30, 2022, 5:30 PM IST

MLC Kadiyam Srihari Fire on MLA Tatikonda Rajayya statements

Kadiyam Srihari on Tatikonda Rajayya: స్టేషన్​ ఘన్​పూర్​లో అధికార పార్టీలో ఒక్కసారిగా వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఉన్న విభేదాలు.. బహిరంగ విమర్శలతో తారాస్థాయి చేరాయి. ఈ క్రమంలోనే రాజయ్య చేసిన ఆరోపణలపై కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు.

Kadiyam Srihari on Tatikonda Rajayya: జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్​లోని అధికార పార్టీలో మళ్లీ వర్గ పోరు మొదలైంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పరస్పర విమర్శలు చేసుకోవటంతో ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు ఎక్కుపెడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, కడియం శ్రీహరి హయంలో ఘనపురంలోనే అత్యధికంగా ఎన్​కౌంటర్లు జరిగాయని.. 361 మందిని పొట్టనపెట్టుకున్నారని... రాజయ్య చేసిన పరోక్ష విమర్శలపై కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పార్టీ నియమావళి అడ్డు వస్తున్నందున మాట్లాడలేకపోతున్నానని అంటూనే.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజయ్య చిల్లర చేష్టలు, అవినీతి, తాగుడు, వ్యవహారాలకు సంబంధించి తన దగ్గర అన్ని రికార్డ్​గా ఉన్నాయన్నారు. అవి బయటపెడితే.. రాజయ్య బయట తిరగలేరని అన్నారు. పార్టీ ఆదేశానుసారం.. ఎవరెక్కడ పోటీ చేయాలన్ననది నిర్ణయం ఉంటుందన్నారు. "ఇది నా అడ్డా.." అని రాజయ్య చెప్పుకోవడం తగదని సూచించారు. రాజయ్య తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదని... దేశంలో భర్తరఫ్ అయిన తొలి ఉపముఖ్యమంత్రి కూడా రాజయ్యేనని ఆక్షేపించారు.

"చాలా సార్లు నాపై స్టెట్​మెంట్లు ఇస్తున్నారు. నేను వాటిపై ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు స్పందించాల్సివస్తోంది. ఇది నా అడ్డా అని చెప్పుకుంటున్నారు. విజయావకాశాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం అవకాశాలు ఇస్తుంటుంది. అంతా సరిగ్గానే ఉంటే అసలు నా వరకు ఎందుకు వస్తుంది. ఇప్పటికైనా చిల్లర మాటలు బంద్ చేయాలి. స్వచ్చంద సంస్థతో సర్వే చేయిద్దాం. ఇందుకు అవసరమైన ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా. ఇందులో పార్టీతో సంబంధంలేదు. ఇద్దరమే తేల్చుకుందాం. ప్రజలు ఎవర్ని కోరుకుంటే వాళ్లే నియోజకవర్గంలో రాజకీయంగా ముందుకువెళ్దాం. నా సవాల్​కు సిద్ధమా..? నా సవాల్‌కు సిద్ధం కాకపోతే ఎక్కడైనా నా ప్రస్తావన తీసుకురావద్దని వార్నింగ్ ఇస్తున్నా." - కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ

Tatikonda Rajayya Comments: జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై సంచలనవ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తెదేపా హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు అడ్డగోలుగా ఎన్‌కౌంటర్లు చేయించారని ఆరోపించారు. ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారన్నారు. తనకు రాజకీయ గురువు వైఎస్సార్‌ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్‌ దేవుడన్న రాజయ్య.. నియోజకవర్గానికి తాను పూజారినన్నారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్‌ తన అడ్డా అని, ఎవరినీ కాలు పెట్టనీయనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కడియం శ్రీహరి, రాజయ్య మధ్య భగ్గుమన్న వర్గపోరు.. బహిరంగంగానే విమర్శలు

ఇవీ చూడండి:

Last Updated :Aug 30, 2022, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.