ETV Bharat / bharat

విపక్షాల భేటీకి అంతా రెడీ.. కేజ్రీవాల్ అలక.. మమతది మరోదారి.. ఇద్దరికీ చెక్ పెట్టేలా కాంగ్రెస్ వ్యూహం!

author img

By

Published : Jun 22, 2023, 4:31 PM IST

Opposition meeting in Patna : బీజేపీని ఢీకొట్టేందుకు విపక్ష కూటమి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అందులోని కొన్ని పార్టీల వైఖరి ఆసక్తికరంగా మారింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. కాంగ్రెస్​ ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నారు. వాటికి అంగీకరించకపోతే సమావేశానికి దూరమవుతామని చెబుతున్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఇద్దరికీ కలిపి చెక్ పెట్టేలా వ్యూహం రచించిందని టాక్ వినిపిస్తోంది.

opposition meeting in patna
opposition meeting in patna

Opposition meeting in Patna : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం ధాటికి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేసిన దేశంలోని విపక్ష పార్టీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కమలదళాన్ని ఢీకొట్టే వ్యూహాలకు పదును పెట్టాయి. 2024 ఎన్నికల కోసం బీజేపీయేతర కూటమిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా శుక్రవారం పట్నాలో భేటీ కానున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు, విపక్షకూటమికి నాయకులెవరనే అంశాలపై కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్లడం, బీజేపీపై పోరాటానికి రోడ్​మ్యాప్​పైనే ప్రధానంగా చర్చ ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Opposition unity 2024 : విపక్షాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే బాధ్యతను భుజానికెత్తుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌.. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలతో చర్చలు జరిపారు. ఆ దిశలో ముందడుగు వేసిన ఆయన శుక్రవారం పట్నా వేదికగా విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్, వామపక్షాలు, ఇతర విపక్షాల నేతలు హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాల ఐక్యత దిశగా ఈ సమావేశం తొలి అడుగు అని పలు పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"ఇది ప్రారంభం మాత్రమే. భావసారూప్యత కలిగిన వారు సమావేశం కావడం ముఖ్యం. ఎన్నికల వ్యూహాలు, నాయకత్వం వంటి అంశాలు ఈ దశలో వచ్చే అవకాశం లేదు. బీజేపీని ఇరుకున పెట్టడానికి విపక్షాలన్నీ ఉమ్మడిగా లేవనెత్తగలిగే అంశాలు సమావేశంలో ప్రధాన అజెండాగా ఉంటాయి. మణిపుర్ హింస, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు వంటి విషయాలు చర్చకు రావొచ్చు."
-విపక్ష నేత

కేజ్రీ వర్సెస్ కాంగ్రెస్
Kejriwal opposition unity : విపక్షాల సమావేశం నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. దిల్లీ ప్రభుత్వ అధికారాలను కట్టడి చేసేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై చర్చించాలని కేజ్రీవాల్‌ గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటివరకూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్.. పట్నా భేటీలో ఎలా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది. ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఉంటామని కాంగ్రెస్ ఇప్పటివరకు చెప్పలేదు. అయితే, పట్నా సమావేశంలో ఆర్డినెన్స్​పై తమకు మద్దకు ప్రకటించకపోతే.. భేటీ నుంచి ఆమ్ ఆద్మీ వెళ్లిపోతుందని ఆ పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. భేటీలో కాంగ్రెస్ తన వైఖరి స్పష్టం చేయాలని కేజ్రీవాల్ సైతం డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, బంగాల్‌లో సీపీఎంతో కాంగ్రెస్‌ జట్టుకడితే లోక్‌సభ సమరంలో ఆ పార్టీకి సాయంచేసేది లేదని మమతా బెనర్జీ తేల్చిచెప్పగా.. ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా లేదో చూడాలి. దిల్లీ ఆర్డినెన్స్ విషయంపైనా మమతా బెనర్జీ.. కాంగ్రెస్​పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా.. హస్తం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో బంగాల్​లో కాంగ్రెస్ సైతం మమతా సర్కారుపై దూకుడు ప్రదర్శిస్తోంది. తమ కార్యకర్తలపై టీఎంసీ అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ లోక్​సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి.. ఇటీవల ముర్షిదాబాద్​లో ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో సమావేశంలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
Opposition unity congress : అయితే, కేజ్రీవాల్, మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచించిందని హస్తం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మోదీతో వీరికి లంకె పెట్టి దాడి చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మాదిరిగానే.. మమత, కేజ్రీవాల్ సైతం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయాన్ని సమావేశంలో ప్రస్తావిస్తామని చెబుతున్నాయి.

"దర్యాప్తు సంస్థలను, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకొని విపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా మోదీ సర్కారును నియంతృత్వ ప్రభుత్వమని అంటున్నాం. పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీ, బంగాల్​లో తృణమూల్​ వ్యవహారం సైతం మోదీ సర్కారులాగే ఉంది. మమత-కేజ్రీవాల్ వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసి బీజేపీ విజయానికి ఎలా సహకరించారో మేం గుర్తు చేస్తాం. విపక్షంలో ఉండి వివిధ అంశాలపై భిన్నస్వరాలు వినిపించిన విషయాన్ని ప్రస్తావిస్తాం. ఆర్టికల్ 370, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించారు. ఆర్డినెన్స్​పై మద్దతు కోరే ముందు ఈ విషయాలపై వారు స్పష్టతనివ్వాలి."
-కాంగ్రెస్ నేత

రాజస్థాన్‌లో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. అక్కడి అధికారపక్షం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. అటు ఉత్తర్​ప్రదేశ్​లో బీజేపీని ఓడించాలనుకునే పార్టీలన్నీ తమ వెనక నిలబడాలని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అంటున్నారు. ఇలా ఎవరికి వారు స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి చేర్చాలన్న నీతీశ్‌ లక్ష్యం ఏ మేరకు ముందుకెళుతుందో చూడాలి.

బీజేపీ వ్యంగ్యాస్త్రాలు..
ఇదిలా ఉంటే.. విపక్షాల ఐక్యతపై బీజేపీ వ్యంగ్యాస్త్రాల దాడిని కొనసాగిస్తోంది. ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ ఎద్దేవా చేస్తోంది. అయితే, విపక్షాల పీఎం అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి ముఖ్యం కాదని, మొదట బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి లక్ష్యమని కొందరు విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించిన తర్వాత ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెబుతున్నారు. మన్మోహన్ సింగ్​ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుండానే 2004లో బీజేపీని ఓడించామని, ఆ తర్వాత పదేళ్ల పాటు యూపీఏ సర్కారు కొనసాగిందని కాంగ్రెస్ బిహార్ అధ్యక్షుడు అఖిలేశ్ ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు.

లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు ఒక వేదికపైకి రావడం శుభసూచికమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తెలిపారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి పనిచేయాలన్నారు. 2024లో భాజపా వ్యతిరేక కూటమి విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రాధాన్యం కాదన్న రాజా.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

పోస్టర్ వార్..
విపక్షాల సమావేశం వేళ బిహార్​లో పలు పోస్టర్లు కలకలం రేపాయి. కాబోయే ప్రధాని కేజ్రీవాల్ అంటూ ఉన్న ఓ పోస్టర్ పట్నాలోని రోడ్లపై కనిపించింది. నీతీశ్ కుమార్ ఎవరికీ ఆశాజ్యోతి కాలేరని, మోదీకి ఆయన అత్యంత ఆప్తులని పోస్టర్​లో పేర్కొన్నారు. లాలూ, నీతీశ్​కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం గోడకు సైతం పలు పోస్టర్లు వెలిశాయి. అయితే, ఆ పోస్టర్​తో తమకు సంబంధం లేదని ఆప్ వివరణ ఇచ్చింది. పోస్టర్​పై ఉన్న వికాస్ కుమార్ జ్యోతి వ్యక్తి తమ పార్టీ నేత కాదని స్పష్టం చేసింది.

bihar kejriwal poster
తదుపరి ప్రధాని కేజ్రీవాల్ అని వెలిసిన పోస్టర్
bihar kejriwal poster
బీజేపీ కార్యాలయం వద్ద పోస్టర్లు
bihar kejriwal poster
బీజేపీ కార్యాలయం వద్ద పోస్టర్లు
bihar kejriwal poster
బీజేపీ కార్యాలయం వద్ద పోస్టర్లు

వీరంతా దూరం..
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి, నవీన్ పట్నాయక్​కు చెందిన బిజు జనతా దళ్, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్, ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వంటి భాజపాయేతర పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.