CM KCR ON TS ASSEMBLY ELECTIONS : 'వచ్చే ఎన్నికల్లో.. 105 సీట్లు మనవే'

author img

By

Published : May 17, 2023, 8:37 PM IST

KCR

BRS Meeting Concluded At Telangana Bhavan : వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు ఖాయమని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ వెల్లడించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ప్రకటించారు. వీటితో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని.. ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు.

BRS meeting concluded at Telangana Bhavan : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి బీఆర్​ఎస్​నే పాగా వేస్తుందని సీఎం కేసీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 95 నుంచి 105 సీట్లు ఖాయమని సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి దశాబ్ది వేడుకలు ఘనంగా జరపాలని కేసీఆర్​ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించి.. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని తెలిపారు.

సర్వేలన్నీ బీఆర్​ఎస్​కే అనుకూలం : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ మరోసారి విజయఢంకా మోగించడం తథ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్​ విశ్వాసం వ్యక్తం చేశారు. వందకు పైగా సీట్లలో గులాబీ అభ్యర్థులు గెలవటం ఖాయమన్నారు. సర్వేలన్నీ బీఆర్​ఎస్​కే అనుకూలంగా ఉన్నాయని తెలంగాణభవన్‌లో జరిగిన విస్తృతస్థాయి భేటీలో చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని బీఆర్​ఎస్​ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామని వివరించిన సీఎం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 21 రోజుల పాటు పండగ వాతావరణంలో వేడుకలు జరపాలని సీఎం ఆదేశించినట్లు సమావేశం అనంతరం బీఆర్​ఎస్​ నేతలు పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం తరఫున సంబురాలు అంబరాన్ని అంటేలా నిర్వహిస్తామని చెప్పారు.

దశాబ్ది ఉత్సవాల కమిటి నియామకం : రాష్ట్రప్రభుత్వప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కమిటీని సర్కార్‌ ఏర్పాటుచేసింది. సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరించనున్నారు. దశాబ్ది ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌ను ప్రభుత్వం నియమించింది.

'వచ్చే ఎన్నికల్లో.. 105 సీట్లు మనవే'

"జూన్​ 2 నుంచి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పెద్ద ఎత్తున జరపాలని కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు. 21 రోజులు అన్ని శాఖలకు రోజుకో శాఖ ప్రకారం పండుగలా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్​ రాష్ట్రంగా తీర్చిదిద్దాము. కాంగ్రెస్​, బీజేపీలకు జాతీయ రాజకీయాల్లో బీఆర్​ఎస్​నే పోటీ." - మల్లారెడ్డి, మంత్రి

"ప్రతిరంగంలోనూ తెలంగాణ ముందు వరుసలో ఉందనే విషయం పార్లమెంటులో బీజేపీనే ముక్త కంఠంతో చెపుతుంది. తెలంగాణ వస్తే ఏం వస్తుంది అన్నవారికీ.. పది సంవత్సరాల తెలంగాణను చూసి.. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. రైతుల ఆత్మహత్యలు లేవు. ఇదే తెలంగాణను సాధించి తెచ్చుకున్న తర్వాత గొప్ప విజయం. తెలంగాణ అభివృద్ధితో అందరి నోళ్లు మూయించాం." - వినోద్​ కుమార్​, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యాక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.