Telangana Cabinet Meeting : కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయంలో తొలిసారి మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేయడంతో.. అది కూడా రెండు సంవత్సరాలు తర్వాతనే జరగనుండడం విశేషంగా చెప్పవచ్చు. ఇందులో సీఎం కేసీఆర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమావేశం చర్చించనున్నారు. జూన్ రెండో తేదీ నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు.
అందుకు సంబంధించి కేబినెట్లో చర్చించి మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. సచివాలయం ఎదుట సిద్ధమైన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభ తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. పోడు పట్టాల పంపిణీ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రకటించి అమలు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ విషయమై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫారుఖ్ హుస్సేన్ పదవీకాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.
ఆ రెండు స్థానాలకు ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ఆమోదించి గవర్నర్కు సిఫారసు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందుకు సన్నాహక ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడం, సమర్థంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేసి లబ్ది చేకూర్చడం లాంటి వాటిపై మంత్రులకు సీఎం మార్గనిర్ధేశం చేయనున్నారు. ఎన్నికల కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు.
ఇవాళ బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశాలు: ఈ సమావేశం కంటే ముందే బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ, పార్లమెంటరీ పార్టీల సమావేశం ఈరోజు నిర్వహించనున్నారు. ఈ బుధవారం పార్టీ అధ్యక్షులు సమక్షంలో జరిగే సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గోనున్నారు. అయితే అంతకు ముందు గత నెల 27న వీరందరితో మాట్లాడిన కేసీఆర్.. 20 రోజులు తిరగకుండానే మళ్లీ సమావేశం నిర్వహించడం అందరికీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అదీ కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జరగనున్న సమావేశంలో ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూన్ 2 నుంచి జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రజల్లోకి నేరుగా తీసుకువెళ్లాలనే.. ప్రధానాంశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. గత నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, శాసనసభా పక్ష, పార్లమెంటరీ పక్ష సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి: