ETV Bharat / state

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల బరిలోకి సీఎం కేసీఆర్​.. రోజుకు 3 బహిరంగ సభలు.. 100 నియోజకవర్గాలు టార్గెట్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2023, 6:47 AM IST

Updated : Oct 10, 2023, 7:04 AM IST

Telangana Assembly Elections
BRS Assembly Elections Plan 2023

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల ముహూర్తం ఖరారు కావడంతో.. బీఆర్​ఎస్​ దూకుడు పెంచింది. గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 15 నుంచి ఎన్నికల ప్రత్యక్ష బరిలోకి దిగనున్నారు. రోజుకు రెండు, మూడు చొప్పున సుమారు వంద నియోజకవర్గాల సభల్లో సీఎం పాల్గొంటారు. కేటీఆర్, హరీశ్‌రావు కూడా రాష్ట్రమంతటా రోడ్ షో, సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 15న ప్రకటించే మేనిఫెస్టో.. తుది రూపు దిద్దుకుంటోంది.

BRS Assembly Elections Plan 2023 ఎన్నికల బరిలోకి సీఎం కేసీఆర్​ రోజుకు 2 3 బహిరంగ సభలు 100 నియోజకవర్గాలు టార్గెట్

BRS Assembly Elections Plan 2023 : ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. భారత రాష్ట్ర సమితి వ్యూహ, ప్రతివ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఈ ఏడాది మొదట్నుంచే ఎన్నికల దిశగా బీఆర్​ఎస్ కార్యచరణ ప్రారంభించింది. ఓ వైపు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల వేగం పెంచడంతో పాటు.. సభ్యత్వ నమోదు, ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యాలయాల ప్రారంభం వంటి కార్యక్రమాలతో కార్యకర్తల్లో జోష్ పెంచుతూ వచ్చారు. ఆగస్టు 21న 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి గత ఎన్నికల వ్యూహాన్నే అనుసరించారు. అభ్యర్థులందరూ వెంటనే ప్రచారంలోకి దిగేలా బీఆర్​ఎస్​ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. నవంబర్‌ 9న కేసీఆర్ నామినేషన్లు

Telangana Assembly Elections 2023 : బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు కొన్ని రోజులుగా సుడిగాలి పర్యటనలతో ప్రచారానికి మరింత ఊపుతెచ్చారు. ఇద్దరూ కలిసి సుమారు 70 నియోజకవర్గాల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ.. బహిరంగ సభల్లో రాజకీయ ఆరోపణలు, ఎదురుదాడులతో వేడిని పెంచారు. తొమ్మిదేళ్లలో చేసింది వివరిస్తూ.. కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడుతూ ప్రచారం చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సీఎం కేసీఆర్.. నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

CM KCR Public Meetings in 100 Constituencies : ఈ నెల 15న గులాబీ దళపతి కేసీఆర్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. ఆరోజు తెలంగాణ భవన్‌లో బీఆర్​ఎస్​ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వడంతో పాటు.. పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తలు.. ఎన్నికల నియామళి, ప్రచార వ్యూహాలను అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఎన్నికల సభలకు ఈ నెల 15 నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల మాదిరిగా హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా ప్రణాళిక చేశారు. తెలంగాణ భవన్‌లో సమావేశం ముగియగానే.. హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.

Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..

TS Assembly Elections Schedule : ఈ నెల 16న జనగామ, భువనగిరిలో.. 17న సిద్దిపేట, సిరిసిల్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో.. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రచారం నిర్వహిస్తారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. నవంబరు 9న నామినేషన్లు వేయనున్నారు. అనంతరం తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేసి.. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రెండు రోజుల్లో తుది జాబితా..: ఈ నెల 15న ప్రకటించనున్న మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరనుంది. ఆసరా పింఛన్లు, రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం పెంపును ప్రకటించనున్నట్లు సమాచారం. రైతులకు పింఛన్లు, ఉచిత ఎరువులతో పాటు మహిళలు, యువత, బీసీలు, మహిళలను ఆకర్షించేలా ఎన్నికల హామీలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తలదన్నేలా మేనిఫెస్టో ఉంటుందని బీఆర్​ఎస్​ నేతలు చెబుతున్నారు. ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితాను ఒకటి.. రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

CEO Vikas Raj on Telangana Elections 2023 : 'రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమలు.. అభ్యర్థులు అవి తెలపకపోతే నామినేషన్ల తిరస్కరణే'

జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి, మల్కాజిగిరికి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్‌లో మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నాంపల్లిలో ఆనంద్ కుమార్, గోషామహల్‌లో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్​సింగ్ రాథోడ్ లేదా నియోజకవర్గం ఇంఛార్జీ నందకిషోర్ వ్యాస్ బిలాల్, శ్రీనివాస్ యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

కొనసాగుతోన్న అసమ్మతి పర్వం.. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పలు నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంది. కొందరు నేతలు ఇప్పటికే పార్టీని వీడగా.. మరికొందరు అలకతో ఉన్నారు. కొందరిని కేటీఆర్, హరీశ్‌రావు పిలిచి మాట్లాడి సర్దుబాటు చేస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్, తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమితి ఛైర్మన్ పదవులు ఇచ్చి అసంతృప్తి చల్లార్చారు. అయితే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, రేఖా నాయక్, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మనోహర్‌రెడ్డి తదితర సీనియర్ నేతలు పార్టీని వీడారు. కోదాడ, నాగార్జునసాగర్, రామగుండం, ఉప్పల్, అంబర్‌పేట, ఇల్లందు వంటి పలు నియోజకవర్గాల్లో నేతల్లో అసమ్మతి కొనసాగుతోంది.

Officials Removed Flags and Banners of Political Parties Telangana : ఎలక్షన్ కోడ్ వచ్చింది.. బ్యానర్లు, ప్రకటనల తొలగింపు మొదలైంది

ఎప్పటికప్పుడు సర్వేలు..: నియోజకవర్గాల్లో పరిస్థితులపై బీఆర్​ఎస్​ నాయకత్వం ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తోంది. కేసీఆర్, ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో అభిప్రాయం, పార్టీ అభ్యర్థులపై ప్రజల్లో చర్చ, ఇతర పార్టీల బలాలు, బలహీనతలపై వివిధ కోణాల్లో నివేదికలు తెప్పిస్తున్నారు. వాటిని విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు.

How to Carry Money when Election Code : రూ.50వేలు కంటే ఎక్కువ తీసుకెళ్తే.. తప్పనిసరిగా ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

Last Updated :Oct 10, 2023, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.