ETV Bharat / sports

నేటి నుంచే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్స్..​ కళ్లన్నీ నీరజ్‌ పైనే

author img

By

Published : Jul 15, 2022, 9:07 AM IST

world athletics championships 2022
world athletics championships 2022

World athletics championships 2022: ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కు శుక్రవారం తెరలేవనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఛాంపియన్‌షిప్స్‌ ఈ సారి మూడేళ్ల విరామం తర్వాత అభిమానులను అలరించనుంది. అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో సత్తాచాటేందుకు 20 మంది భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది.

World athletics championships 2022: ట్రాక్‌పై చిరుతల్లాంటి పరుగులు.. మెరుపు విన్యాసాలతో అదరగొట్టే అథ్లెట్లు.. సుదూర దూరాల దిశగా అడుగులు.. పతకాన్ని ముద్దాడేందుకు పోరాటాలు.. ఈ దృశ్యాలకు నెలవైన అథ్లెటిక్స్‌ పండగ మళ్లీ వచ్చింది. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కు శుక్రవారం తెరలేవనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ఛాంపియన్‌షిప్స్‌ ఈ సారి మూడేళ్ల విరామం తర్వాత అభిమానులను అలరించనుంది. నిరుడు జరగాల్సిన ఈ పోటీలకు టోక్యో ఒలింపిక్స్‌ కోసం ఈ ఏడాదికి వాయిదా వేశారు. అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో సత్తాచాటేందుకు 20 మంది భారత అథ్లెట్ల బృందం సిద్ధమైంది. ఒలింపిక్స్‌లో పసిడితో సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్‌పైనే అందరి కళ్లు. ఇప్పటివరకూ ఈ మెగా టోర్నీ చరిత్రలో భారత్‌ ఒక్క పతకమే (2003లో లాంగ్‌జంప్‌లో అంజూబాబీ కాంస్యం) సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు తన అత్యుత్తమ ప్రదర్శన మెరుగుపర్చుకుని.. జాతీయ రికార్డు బద్దలు కొట్టిన నీరజ్‌ (ప్రస్తుత అత్యుత్తమం 89.94మీ) ఇదే జోరు కొనసాగించి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉన్నాడు. పసిడి దిశగా అతనికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (93.07మీ) రూపంలో సవాలు ఎదురు కానుంది. కానీ ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు సార్లు అతణ్ని వెనక్కినెట్టడం నీరజ్‌కు కలిసొచ్చే అంశం. నీరజ్‌తో పాటు రోహిత్‌ యాదవ్‌ కూడా పోటీపడుతున్న జావెలిన్‌ త్రో అర్హత రౌండ్లు గురువారం, ఫైనల్‌ శనివారం జరుగుతాయి.

తొలి రోజు వీళ్లు..: తొలి రోజు పోటీల్లో లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌, జెస్విన్‌, పురుషుల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌ సాబ్లె, 20 కిలోమీటర్ల నడకలో పురుషుల్లో సందీప్‌ కుమార్‌, మహిళల్లో ప్రియాంక, షాట్‌పుట్‌లో తజిందర్‌ సింగ్‌ బరిలో దిగుతున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్ల పోటీలు ఆరంభమవుతాయి. ఈ ఛాంపియన్‌షిప్స్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచే పురుషుల 100మీ. పరుగు హీట్స్‌ కూడా తొలి రోజే జరుగుతాయి. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ, రజత, కాంస్య విజేతలు వరుసగా జాకబ్స్‌ (ఇటలీ), ఫ్రెడ్‌ కెర్లీ (అమెరికా), డిగ్రేజ్‌ (కెనడా) మరోసారి యుద్ధానికి సై అంటున్నారు. మహిళల 100మీ. పరుగులో టోక్యోలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచిన జమైకా స్ప్రింటర్లు థాంప్సన్‌ హెరా, ఫ్రేజర్‌, జాక్సన్‌ మధ్య మరోసారి తీవ్ర పోటీ నెలకొంది. స్ప్రింట్‌ దిగ్గజం అలీసన్‌ ఫెలిక్స్‌ (అమెరికా) పదోసారి ఈ ఛాంపియన్‌షిప్స్‌లో పోటీపడుతోంది. ఇప్పటికే ఈ పోటీల చరిత్రలో అత్యధిక (పురుషులు, మహిళల్లో కలిపి) పతకాలు (13 స్వర్ణాలు సహా 18) నెగ్గిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన 36 ఏళ్ల ఆమె ఈ సారి 4×400మీ. రిలే జట్టు తరపున పోటీపడుతుంది.

పది రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్‌షిప్స్‌లో 49 ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ క్రీడాంశాల్లో 200కు పైగా దేశాల నుంచి సుమారు 2 వేలకు పైగా అథ్లెట్లు బరిలో నిలిచారు. మరోవైపు భారత రన్నర్‌ ధనలక్ష్మీతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అథ్లెట్లు వీసా కారణాలతో ఛాంపియన్‌షిప్స్‌కు దూరమయ్యారు. కెన్యా స్ప్రింటర్‌ ఫెర్డినాండ్‌ ఒమన్యాలా కూడా అదే జాబితాలో చేరేవాడే కానీ చివరి నిమిషంలో అతనికి వీసా మంజూరు కావడంతో గురువారం అమెరికా బయల్దేరాడు. 100మీ. పరుగులో పోటీపడే అతను హీట్స్‌కు కొన్ని గంటల ముందు అక్కడికి చేరుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది 9.85 సెకన్ల టైమింగ్‌ నమోదు చేసిన అతను పతకం కోసం గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ND vs ENG: రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ ఘన విజయం.. తేలిపోయిన భారత బ్యాట్స్‌మెన్

సింగపూర్​ ఓపెన్​ క్వార్టర్స్​లోకి సైనా.. రాణించిన అర్జున్​-కపిలా జోడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.