ETV Bharat / sports

'పతకాలతోనే మాట్లాడతా'.. డెఫ్‌లింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన షూటర్ శ్రీకాంత్

author img

By

Published : Jun 2, 2022, 7:32 AM IST

Dhanush Srikanth: పుట్టుకతోనే చెవులు వినబడకున్నా, మాటలు రాకున్నా అతడు కుంగిపోలేదు. ఇతరులతో తానేమీ తక్కువ కాదంటూ తుపాకీ చేతబట్టి దేశానికి పతకాలు సాధిస్తున్నాడు. ఇటీవలే డెెఫ్​లింపిక్స్​లో రెండు స్వర్ణాలతో చరిత్ర సృష్టించాడు. అతడే తెలుగు కుర్రాడు ధనుష్ శ్రీకాంత్​. పతకాలతోనే మాట్లాడుతా అంటున్న శ్రీకాంత్.. తన తదుపరి గమ్యాలపై దృష్టిసారించాడు.

deaflympics 2022
dhanush srikanth

Dhanush Srikanth: పుట్టుకతోనే చెవులు వినబడవు.. మాటలూ రావు. అయితే ఆ పిల్లాడు తన వైకల్యం చూసి కుంగిపోలేదు. తాను ఎవరికీ తక్కువ కాదంటూ.. తుపాకీతో పతకాలు కొల్లగొడుతున్నాడు. ఇటీవల డెఫ్‌లింపిక్స్‌లో రెండు స్వర్ణాలతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మామూలు షూటర్లతోనూ పోటీపడుతూ సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్నాడు 19 ఏళ్ల ధనుష్‌ శ్రీకాంత్‌. తన కెరీర్‌.. చేరాల్సిన గమ్యం తదితర విషయాలను ఈ హైదరాబాదీ షూటర్‌ తన అమ్మ సాయంతో 'ఈనాడు'తో ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఆ విశేషాలు..

"నాకు చెవులు వినబడవు, మాటలు రావు అనే సంగతే పట్టించుకోను. తుపాకీ పడితే నా గురి లక్ష్యం పైన.. నా ధ్యాస పతకాలు సాధించడం మీదే ఉంటుంది. నాకున్న సమస్య తెలిసి అమ్మానాన్న చాలా బాధపడ్డారు. పైగా మా కుటుంబంలో ఎవరికీ ఇలాంటి వైకల్యం లేదు. అలాంటిది నాకు రావడంతో తీవ్ర నిరాశ చెందారు. కానీ నన్ను సాధారణ పిల్లల్లాగే పెంచాలనే ఉద్దేశంతో బాధను దిగమింగి ముందుకు సాగారు. ఏడాది లోపే అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా నా చెవి వెనకాల ఓ చిప్‌ పెట్టారు. దీని ద్వారా నేను అందరిలా స్పష్టంగా వినలేకపోయినా.. ఎదుటి వాళ్ల మాటలను అర్థం చేసుకోగలను. చిన్నప్పటి నుంచే నాకు ఆటలంటే ఆసక్తి. పాఠశాల స్థాయిలో అన్ని క్రీడల్లోనూ పోటీపడి పతకాలు గెలిచేవాణ్ని. తైక్వాండోలో అయితే రెండో డాన్‌ (ర్యాంకు) బ్లాక్‌బెల్ట్‌ సాధించా. కానీ తర్వాతి స్థాయిలో ప్రత్యర్థులతో తలపడ్డప్పుడు చెవికి ఏమైనా గాయం అవుతుందేమోనని మానేశా."

deaflympics 2022
ధనుష్‌ శ్రీకాంత్‌

అదే మలుపు..: చిన్నప్పుడు ఇంట్లో బొమ్మ తుపాకులతో ఆడుకోవడం ఇష్టంగా ఉండేది. మేం ఉండే తిరుమలగిరి (హైదరాబాద్‌)లోనే గగన్‌ సర్‌ 'గన్‌ ఫర్‌ గ్లోరీ' (జీఎఫ్‌జీ) అకాడమీ ఏర్పాటు చేశారు. ఓ సారి గగన్‌ తుపాకీతో ఉన్న ఫొటో చూసి ఆ అకాడమీలో చేరాలని అనుకున్నా. అందుకు అమ్మానాన్నలూ ఒప్పుకున్నారు. అలా 2015 నుంచి జీఎఫ్‌జీ నా లోకమైంది. నా సమస్య గురించి గగన్‌ సర్‌తో అమ్మ చెప్పినప్పుడు ఆయన సవాలుగా తీసుకున్నారు. నా వ్యక్తిగత కోచ్‌ నేహా చవాన్‌తో పాటు అక్కడున్న వాళ్లంతా నా కోసం ప్రత్యేకంగా సంజ్ఞల భాష నేర్చుకున్నారు. 2019 ఖేలో ఇండియా క్రీడల్లో 16 ఏళ్లకే అండర్‌-21లో 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ పసిడి గెలిచా. అదే ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు (జూనియర్‌ వ్యక్తిగత, పురుషుల టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌) సాధించడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. నిరుడు జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ పసిడి గెలిచాం.
నా లక్ష్యం అదే: కొన్నేళ్ల క్రితం వరకూ టోర్నీలకు నాతో పాటు అమ్మ వచ్చేది. కానీ ఇప్పుడు భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహిస్తుండడంతో కోచ్‌లు వెంట ఉంటున్నారు. వాళ్లు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నేను చెప్పాలకున్న విషయాలను తర్జుమా చేయడంలో ఇబ్బంది ఎదురవుతున్నా అదేమీ కష్టం కాదు. తొలిసారి డెఫ్‌లింపిక్స్‌లో నా లాంటి వాళ్లతో తలపడ్డా. ఈ క్రీడల్లో మెరుగైన ప్రదర్శనతో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ స్వర్ణాలు గెలిచా. వ్యక్తిగత ఫైనల్లో సరికొత్త ప్రపంచ రికార్డు (బధిరుల) సృష్టించడం ఆనందంగా ఉంది. అక్కడ పేపర్‌ టార్గెట్‌ పెట్టడంతో కాస్త ఒత్తిడికి గురయ్యా. ఎందుకంటే నేనెక్కువగా ఎలక్ట్రానిక్‌ టార్గెట్‌లపైనే ప్రాక్టీస్‌ చేస్తా. అయినప్పటికీ అక్కడ ఉత్తమ ప్రదర్శన చేశా. 2024 ఒలింపిక్స్‌కు అర్హత సాధించి, పతకం గెలవడమే నా లక్ష్యం.

ఇదీ చూడండి: ఆ ఒలింపిక్స్​లో తెలుగోడి జోరు... మరో స్వర్ణం గెలిచిన షూటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.