ETV Bharat / sports

వరల్డ్​లోనే తొలి క్రికెటర్​గా 'సూర్య' చెత్త రికార్డు.. ఇక వన్డే కెరీర్‌ ముగిసినట్లేనా?

author img

By

Published : Mar 23, 2023, 8:57 AM IST

team india batter suryakumar yadav
team india batter suryakumar yadav

ఆసీస్​తో జరిగిన మూడు వన్డేల్లోనూ తొలి బంతికే పెవిలియన్​ చేరిన టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​.. అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. మరోవైపు, అతడి వన్డే కెరీర్​ ముగిసినట్లేనని నెటిజన్లు అంటున్నారు.

టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​.. వన్డేల్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో మొదటి బంతికే ఔట్​ అయిన సూర్య.. మూడో వన్డేలోనూ తొలి బంతికే క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్​కు దిగిన స్కై.. అష్టన్​ అగర్​ బౌలింగ్​లో మొదిటి బంతికే పెవలియన్​ చేరాడు. అగర్‌ వేసిన స్ట్రెయిట్ లెంగ్త్ బాల్‌కు బ్యాక్‌ఫుట్‌పై షాట్ ఆడేందుకు సూర్య ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయి స్టంప్‌లను తాకింది. దీంతో ఖాతా తెరవకుండానే సూర్య నిరాశతో మైదానాన్ని వీడాడు.

మూడో వన్డే మ్యాచ్‌లో గోల్డన్‌డక్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు. ఓ వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గోల్డెన్ డకౌటైన తొలి బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. అదే విధంగా మూడు వన్డేల సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన మొదటి భారత బ్యాటర్ కూడా సూర్యనే కావడం గమనార్హం. ఓవరాల్‌గా వన్డేల్లో వరుసగా మూడు సార్లు డకౌటైన ఆరో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు.

అంతకుముందు సచిన్ తెందూల్కర్​, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వరుసగా మూడు డకౌట్‌లుగా వెనుదిరిగారు. కానీ వీరంతా తొలి బంతికే ఔట్‌ కాలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వరుసగా అత్యధిక డకౌట్‌లు అయిన రికార్డు మాత్రం శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగ పేరిట ఉంది. వన్డేల్లో మలింగ వరుసగా నాలుగు సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.

సూర్య వన్డే కెరీర్‌ ముగిసినట్లే!
అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఓడిపోయినప్పటికీ.. టీమ్​ఇండియా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. కానీ సూర్య కెరీర్​ మాత్రం ప్రమాదంలో పడినట్లే. టీ20ల్లో దూకుడుగా ఆడినప్పటికీ.. బంతిని చూసి ఆడడం అతడికి అలవాటు. కానీ వన్డేలకు వచ్చేసరికి అతడి మార్క్​ కనుమరుగైంది. క్రీజులో నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బౌలర్లు అతడిని పెవిలియన్‌ చేరుస్తున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్య ఔటైన విధానం చూస్తే అసలు ఆడుతుంది సూర్యనేనా అన్న అనుమానం చాలా మందికి వచ్చింది.

శ్రేయస్‌ అయ్యర్‌ లోటును తీరుస్తాడని సూర్యను వన్డేలకు ఎంపికచేస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతడు విఫలమయ్యాడు. ఇక రానున్న కాలంలో సూర్య వన్డేలు ఆడేది అనుమానమే. ఈ ప్రదర్శనతో అతడు వన్డే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడం కూడా అనుమానమే. అందుకే అభిమానులు కూడా సూర్యకుమార్‌ను తెగ ట్రోల్​ చేస్తున్నారు. అతడు కేవలం టీ20 మెటీరియల్​ మాత్రమేనని, సంజూ శాంసన్​కు అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.