ETV Bharat / sports

ఐపీఎల్​ టైటిలే లక్ష్యంగా చెన్నై 'కింగ్స్'​ గర్జన

author img

By

Published : May 1, 2021, 12:02 PM IST

విజిల్‌ పోడు.. ఇది చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఉత్సాహపరిచే మాట. ఆటగాళ్లకు కొత్త శక్తినిచ్చే నినాదం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టుకు అతికినట్లు సరిపోయే తారక మంత్రం. ఎందుకంటే చెన్నై గతేడాది పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండా తొలిసారి ఇంటిముఖం పట్టింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆటగాళ్లు రాణిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు, వికెట్లు పడగొడుతున్నారు. ప్రత్యర్థులపై గర్జిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే గతేడాదితో పోలిస్తే చెన్నై ఇప్పుడు అద్భుతంగా రాణిస్తోంది. ఒక ఏడాదిలో చెన్నైలో ఏం మార్పొచ్చింది.. ఆ కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.

dhoni, chennai super kings captain
ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్

యూఏఈలో జరిగిన 2020 సీజన్‌లో టోర్నీ ఆరంభానికి ముందే చెన్నై ఇబ్బందులు ఎదుర్కొని మానసికంగా అలసిపోయింది. ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటం. సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌ లాంటి కీలక ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో దూరమవ్వడం. సరైన ఓపెనింగ్‌ భాగస్వామ్యం లేకపోవడం. కెప్టెన్‌ ధోనీ ఏడాదికిపైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవ్వడం లాంటి కారణాలతో చెన్నై తొలి అర్ధభాగంలో రెండే విజయాలు సాధించింది. అయితే, రెండో భాగంలో జట్టు కుదురుకునేలోపు పరిస్థితులు చేయిదాటిపోయాయి. అప్పుడు పలు విజయాలు నమోదు చేసినా ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. దాంతో ఏడో స్థానంతో ఇంటిముఖం పట్టింది.

Chennai Super Kings are doing well this season.
దీపక్ చాహర్

ఓటములకు కారణాలు..

గతేడాది ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, పేసర్‌ దీపక్‌ చాహర్‌ టోర్నీకి ముందు కొవిడ్‌ బారిన పడ్డారు. తొలి మ్యాచ్‌కు ముందు దీపక్‌ కోలుకోగా రుతురాజ్‌ కాస్త ఆలస్యంగా జట్టుతో కలిశాడు. దాంతో అతడి స్థానంలో మురళీ విజయ్‌.. షేన్ వాట్సన్‌కు తోడుగా ఓపెనింగ్‌ చేశాడు. కానీ ఇద్దరూ విఫలమయ్యారు. ఆపై డుప్లెసిస్‌, అంబటి రాయుడు ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేసినా నిలకడగా ఆడలేదు. దానికి తోడు మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేదార్‌ జాదవ్‌, కెప్టెన్‌ ధోనీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక బౌలింగ్‌ విభాగంలో దీపక్‌ చాహర్‌ తొలి మ్యాచ్‌ నుంచే ఆడినా సరిగ్గా వికెట్లు తీయలేకపోయాడు. మరోవైపు 2019లో అత్యధిక వికెట్లు తీసిన ఇమ్రాన్‌ తాహీర్‌ లాంటి సీనియర్ స్పిన్నర్‌ను పక్కన పెట్టి చివర్లో అవకాశాలిచ్చారు. ధోనీ ఎంతో మెచ్చి తెచ్చుకున్న పీయుష్ చావ్లా సైతం అనుకున్నంత మేర రాణించలేకపోయాడు. ఇవన్నీ చెన్నై వైఫల్యానికి కారణాలే.

Chennai Super Kings are doing well this season.
రవీంద్ర జడేజా

ఇదీ చదవండి: ఒలింపిక్స్​ పతకమే లక్ష్యంగా యూఎస్​లో మీరాబాయి శిక్షణ

ఇప్పుడన్నీ మెరుపులే..

ఇక ఈ సీజన్‌లో చెన్నై తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో ఓటమి మినహా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు రాణిస్తున్నారు. చిన్న తల సురేశ్‌ రైనా జట్టులోకి వచ్చి వీలైనన్ని పరుగులు సాధిస్తున్నాడు. ఓపెనర్లు డుప్లెసిస్‌, రుతురాజ్‌ దంచికొడుతూ ప్రత్యర్థులపై చెలరేగుతున్నారు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, మొయిన్‌ అలీ వికెట్లు తీస్తూనే, పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, లుంగి ఎంగిడి బౌలింగ్‌ విభాగాన్ని సమర్థంగా నడిపిస్తున్నారు. ఇక మిగిలింది కెప్టెన్‌ ధోనీ ఒక్కడే. ఇప్పటివరకూ అతడు బ్యాట్‌తో పెద్దగా రాణించింది లేదు. ఆడిన షాట్లలో కచ్చితత్వం కనిపించలేదు. ఒకసారి ధోనీ టచ్‌లోకి వస్తే జట్టుకు ఏనుగంత బలం. దీంతో అభిమానులు ధోనీ ఆట కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు మహీ ప్రాక్టీస్‌ సెషన్లలో సిక్సులు కొడుతూ కనిపించిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. దాంతో తమ అభిమాన సారథి ఎప్పుడెప్పుడు బ్యాట్‌ ఝళిపిస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Chennai Super Kings are doing well this season.
డుప్లెసిస్

మేళవింపు కుదిరింది...

చివరిగా చెన్నై ఈ సీజన్‌లో రాణించడానికి మరో కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటంటే ఇంతకుముందు సీఎస్కే అంటే 'డాడీస్‌ ఆర్మీ'గా పేరుండేది. కెప్టెన్‌ ధోనీ అనుభవజ్ఞులైన ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఇప్పుడా పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. సరైన ప్రతిభ ఉంటే యువకులకు సైతం ధోనీ అవకాశాలిస్తున్నాడు. ఈ క్రమంలో ఆకట్టుకుంటున్న ఆటగాళ్లే రుతురాజ్‌‌, దీపక్‌ చాహర్‌, సామ్‌కరణ్‌, శార్దూల్‌ ఠాకుర్‌. దాంతో చెన్నై ఇప్పుడు సీనియర్‌ ఆటగాళ్లతో పాటు సరైన యువ ప్రతిభావంతులతో కలిసి ఆడుతూ వరుసగా రాణిస్తోంది. మరోవైపు ఈ ఏడాది వేలంలోనూ చెన్నై కెప్టెన్‌ పలువురు కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాడు. అందులో భాగంగానే కృష్ణప్ప గౌతమ్‌, హరిశంకర్‌ రెడ్డి, భగత్‌ వర్మ, హరి నిశాంత్‌, కేఎం అసిఫ్‌, సాయి కిషోర్‌ లాంటి యువకులు జట్టులోకి వచ్చారు. అయితే, వీరికిప్పుడే అవకాశాలు రాకపోయినా భవిష్యత్‌లో మంచి ప్రదర్శన చేస్తే స్టార్లుగా ఎదిగే వీలుంది. ఇలా సరైన ఆటగాళ్ల మేళవింపుతో కొనసాగితే భవిష్యత్‌లోనూ చెన్నై మంచి ఫలితాలే సాధిస్తుంది.

Chennai Super Kings are doing well this season.
సురేశ్ రైనా

ఇదీ చదవండి: ఫుట్​బాల్​ స్టార్​ రొనాల్డో నుంచి రూ.579 కోట్ల డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.