ETV Bharat / sports

యోయో టెస్టు అంటే ఏంటి.. ఎవరు టాప్ స్కోరర్?

author img

By

Published : Jan 26, 2021, 10:26 AM IST

యోయో టెస్టు.. టీమ్ఇండియా క్రికెట్ అభిమానులకు ఎక్కువగా పరిచయమున్న పేరు. భారత జట్టులో చోటు దక్కాలంటే ఈ టెస్టులో కచ్చితంగా పాస్ కావాల్సిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ యోయో టెస్టు అంటే ఏంటి? ఈ టెస్టులో ఇప్పటివరకు ఎవరు ఎక్కువ స్కోర్ సాధించారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.

Yo Yo test Top scorer
యోయో టాప్ స్కోరర్

భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు యోయో ఫిట్​నెస్ అనేది చాలా ముఖ్యం. ఆటగాళ్లు తమ ఫిట్​నెస్​ను నిరూపించుకోవాలంటే ఈ పరీక్షలో కచ్చితంగా పాస్ కావాల్సిందే. 2017లో టీమ్ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్​ శంకర్ బసు ఈ టెస్టును ప్రారంభించారు. అప్పటి నుంచి బీసీసీఐ భారత ఆటగాళ్ల ఫిట్​నెస్​కు దీనికి ప్రామాణికంగా భావిస్తోంది. యువరాజ్ సింగ్, సంజూ శాంసన్, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లు ఈ టెస్టులో పాస్ కాలేకపోయారు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి చురుకైన క్రికెటర్లు ఈ టెస్టులో అత్యధిక స్కోర్ సాధించారు.

యోయో టెస్టు ఎలా నిర్వహిస్తారు?

20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు తిరిగి వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం తర్వాత బీప్ శబ్దాలు త్వరత్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు దాదాపు గంటకు ఎనిమిది కోలోమీటర్ల వేగం నుంచి 22, 23 కిలోమీటర్లు పరుగెత్తుతుంటారు. ప్రస్తుతం టీమ్​ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ 17.4 స్కోరును ప్రామాణికంగా నిర్ణయించింది.

యోయో టెస్టులో టాప్ స్కోరర్స్

5. ఆశిష్ నెహ్రా - 18.5

టీమ్ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తరచూ గాయాలబారిన పడి జట్టులో చోటు కోల్పోయేవాడు. కానీ ఈ గాయాలు ఇతడికి యోయో టెస్టులో ఎటువంటి ఆటంకం కలిగించలేకపోయాయి. కెరీర్ చివరి వరకు ఈ టెస్టులో పాల్గొన్న నెహ్రా.. 18.5 స్కోర్​ను సాధించాడు. ప్రస్తుతం యోయో టెస్టులో అత్యధిక స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

Ashish Nehra
ఆశిష్ నెహ్రా

4. కోహ్లీ, హార్దిక్ పాండ్యా - 19

ఫిట్​నెస్ పరంగా ఎంతో శ్రద్ధగా ఉంటాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అతడి శ్రమను చూసి సహ ఆటగాళ్లు కూడా స్ఫూర్తి పొందుతారు. అయితే యోయో టెస్టులో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతడి స్కోర్ 19గా ఉంది. మరో ఆటగాడు హార్దిక్ పాండ్యా కూడా 19 స్కోర్​తో కోహ్లీతో సమానంగా ఉన్నాడు.

Virat Kohli
కోహ్లీ

3. మనీష్ పాండే -19.2

టీమ్ఇండియా బ్యాట్స్​మన్, అద్భుత ఫీల్డర్ మనీష్ పాండే యోయో టెస్టులో కోహ్లీ కంటే ఎక్కువ స్కోర్ సాధించాడు. ఇతడి స్కోర్ 19.2గా నమోదైంది. ప్రస్తుతం ఇతడు మూడో స్థానంలో ఉన్నాడు.

Manish Pandey
మనీష్ పాండే

2. మయాంక్ డాగర్ - 19.3

మయాంక్ అగర్వాల్​ యోయో రికార్డును 2018లో తిరగరాశాడు యువ ఆటగాడు మయాంక్ డాగర్. అదే ఏడాది మయాంక్ ఐపీఎల్​లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు టీమ్ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​కు అల్లుడు. ఐపీఎల్​లో తన సత్తా చాటుకునే అవకాశం ఇప్పటివరకు రాకపోయినా యోయో టెస్టులో రికార్డు స్కోర్​తో వార్తల్లో నిలిచాడు.

Mayank dagar
మయాంక్ డాగర్

1. అహ్మద్ బాండే- 19.4

యోయో టెస్టులో ప్రస్తుతం టాప్ స్కోరర్​గా కొనసాగుతున్నాడు జమ్ముకశ్మీర్ క్రికెటర్ అహ్మద్ బాండే. 2018 దేశవాళీ టోర్నీ సమయంలో ఇతడు 19.4 స్కోర్​ను నమోదు చేశాడు. ఈ రికార్డే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది.

Ahmed Bandey
అహ్మద్ బాండే

ఇవీ చూడండి: ఐపీఎల్2021: ఈ స్టార్ ఆటగాళ్లకు భారీ ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.