ETV Bharat / sports

సరికొత్త 'స్లో బాల్'​ టెక్నిక్​ను ఐపీఎల్​లో ప్రదర్శిస్తా..

author img

By

Published : Sep 13, 2020, 1:26 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​ స్టార్​ ఆల్​రౌండర్​ డ్వేన్​ బ్రావో.. ఐపీఎల్​లో ఆడేందుకు యూఏఈలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి ఘనస్వాగతం పలికింది జట్టు యాజమాన్యం. తాను 'స్లో బాల్'​ టెక్నిక్​ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంటూ దాన్ని ఐపీఎల్​లో ప్రదర్శిస్తానని చెప్పాడు బ్రావో.

bravo latest news
సరికొత్త 'స్లో బాల్'​ టెక్నిక్​ను ఐపీఎల్​లో ప్రదర్శిస్తా..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోకు మెగా స్వాగతం లభించింది. కొద్ది రోజుల క్రితమే కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు.. తాజాగా దుబాయ్‌ చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే జట్టు తమకెంతో నమ్మకమైన ఆటగాడి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

దుబాయ్‌లో ఆ జట్టు ఉంటున్న హోటల్‌లో బ్రావోకు ఘన స్వాగతం పలికింది. అతడి గదిలోని డైనింగ్‌ టేబుల్‌పై పలు రకాల పండ్లు, తిను బండారాలతో పాటు '500 వికెట్ల వీరుడికి తాజ్‌ దుబాయ్‌ సుస్వాగతం' అని పేర్కొంది. అలాగే పలు రకాల కరోనా కిట్లు కూడా అందించింది. వీటన్నింటినీ విండీస్‌ క్రికెటర్‌ వీడియోగా చిత్రీకరించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. మళ్లీ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తిరిగి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

ఐపీఎల్​లో స్లో బాల్​..

తాను 'స్లో బాల్'​ టెక్నిక్​ను​ అభివృద్ధి చేసినట్లు చెప్పిన బ్రావో.. ఐపీఎల్​లో దాన్ని ప్రదర్శిస్తానని తెలిపాడు. డెత్​ ఓవర్లలో కూడా అది బాగా పనిచేస్తుందని పేర్కొన్నాడు.

2018 ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లో ముంబయిపై 68 రన్స్​ చేశాడు బ్రావో. అదే తన బెస్ట్​ ఐపీఎల్​ ప్రదర్శనగా పేర్కొన్నాడు. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్​లో 30 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశాడు. బుమ్రా, మెక్లెనగన్​, ముస్తాఫిజుర్​ వంటి బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్​లో ఒక్క వికెట్​ తేడాతో గెలిచింది చెన్నై జట్టు.

500 వికెట్లు తీసిన బౌలర్​..

ఇటీవల కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో జట్టు రికార్డు స్థాయిలో నాలుగోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. దానికి పొలార్డ్‌ నాయకత్వం వహిస్తుండగా బ్రావో ప్రధాన ఆల్‌రౌండర్‌గా కొనాసాగుతున్నాడు. ఈ క్రమంలోనే టోర్నీలో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు 9 వికెట్లు తీశాడు. దీంతో మొత్తం టీ20 క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.

మరోవైపు సీఎస్కే ఆటగాళ్లు మిచెల్‌ శాంట్నర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ శనివారమే దుబాయ్‌కి చేరుకున్నారు. దీంతో వీరంతా వారం రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే రెండు సార్లు నిర్వహించే కరోనా పరీక్షల్లోనూ నెగెటివ్‌గా రావాలి. అప్పుడే వీరు ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక చెన్నై జట్టు సెప్టెంబర్​ 19న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ను ఢీకొనబోతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.